బాప్‌రే.. బకాయిలు!

ABN , First Publish Date - 2021-03-05T04:51:38+05:30 IST

కార్పొరేషన్‌, మున్సిపాలిటీలలో ఆస్తిపన్ను బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి.

బాప్‌రే.. బకాయిలు!

మున్సిపాలిటీల్లో వసూలు కాని ఆస్తి పన్ను

మొత్తం బకాయి రూ.78 కోట్లు, వడ్డీ రూ.61 కోట్లు

నెల్లూరు నగరంలో అసలు కంటే కొసరే ఎక్కువ

కరోనా ఎఫెక్ట్‌తో మందగించిన చెల్లింపులు


నెల్లూరు (జడ్పీ), మార్చి 3 : కార్పొరేషన్‌, మున్సిపాలిటీలలో ఆస్తిపన్ను బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. దీనిపై వడ్డీ కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. ఎక్కువగా పేదలు, మధ్య తరగతి ప్రజలు ఆస్తి పన్ను సకాలంలో కట్టలేని పరిస్థితి ఉంది.  నెల్లూరు కార్పొరేషన్‌తోపాటు కావలి, ఆత్మకూరు, గూడూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట మున్సిపాలిటీలలో ప్రతి ఆర్నెల్లకు ఒక్కసారి ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, పేద, మధ్యతరగతి కుటుంబాలు సక్రమంగా చెల్లించకపోవడం, వడ్డీపై అవగాహన రాహిత్యంతో ప్రస్తుతం పన్ను బకాయిలు తడిసిమోపెడు అయ్యాయి. మూడు, నాలుగేళ్లుగా పన్ను చెల్లించని వారికి దాదాపుగా నూటికి రూ.2 చొప్పున వడ్డీ పడుతూ వస్తోంది. 


భారం ఇలా...


జిల్లావ్యాప్తంగా నగరం, పట్టణాలలో అటు ప్రభుత్వ భవనాలకు, ఇటు గృహాలకు  కేవలం వడ్డీ దాదాపుగా రూ.61 కోట్లు మేర ఉంది. ఇక అసలు రూ.78 కోట్ల వరకు పేరుకుపోయి ఉంది. ఇందులో అగ్రభాగం నెల్లూరుకే ఉంది. నగరంలో 1.35 లక్షలు మేర గృహాలు, ప్రభుత్వ భవనాలు ఉండగా వాటికి సంబంధించి పన్ను బకాయిలు రూ.54.61కోట్లు ఉన్నాయి. దీనికి వడ్డీ రూ.58.91 కోట్లు పడింది. అలాగే కరెంటు డిమాండ్‌ రూ.10.92 కోట్లు ఉండగా, వడ్డీ రూ.4.71 లక్షలు అయ్యింది. 


వడ్డ్డీమాఫీతో ప్రయోజనాలు..


గతంలోనూ ఇలాగే బకాయిలు పేరుకుపోవడం, వడ్డీ పెరిగిపోయి ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత పాలకులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆస్తి పన్నుపై వడ్డీని మాఫీ చేయించారు. దీంతో ప్రజలంతా ఆస్తి పన్ను బకాయిలను పూర్తిగా చెల్లించేశారు. మున్సిపాలిటీల్లోని ఖజానాకు నగదు వచ్చి చేరడంతో అభివృద్ధి పనులు కూడా వేగం అందుకున్నాయి. అయితే గత ఏడాది కరోనా విజృంభించి ప్రజల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం, పాలకులు ఆస్తి పన్ను వడ్డీ మాఫీపై దృష్టి పెట్టకపోవడం పట్టణవాసులను తీవ్రంగా కలిచి వేస్తున్నది.

Updated Date - 2021-03-05T04:51:38+05:30 IST