Nupur వ్యాఖ్యలపై హింసకు వ్యతిరేకంగా Bajrang Dal దేశవ్యాప్త నిరసనలు

ABN , First Publish Date - 2022-06-14T20:47:51+05:30 IST

మమహ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మ వ్యాఖ్యల నేపథ్యంలో ఇటీవల..

Nupur వ్యాఖ్యలపై హింసకు వ్యతిరేకంగా Bajrang Dal దేశవ్యాప్త నిరసనలు

న్యూఢిల్లీ: మమహ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మ (Nupur Sharma) వ్యాఖ్యల నేపథ్యంలో ఇటీవల దేశవ్యాప్తంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడాన్ని విశ్వహిందూ పరిషత్ (VHP) ఖండించింది. ఈ హింసాత్మక ఘటనలకు వ్యతిరేకంగా తమ యువజన విభాగమైన బజ్‌రంగ్ దళ్ (Bajrang Dal) దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్టు మంగళవారంనాడు ప్రకటించింది.


దేశంలోని ఇస్లామిక్ జిహాదీ మతోన్మాదుల హింసాత్మక ఘటనలు అంతకంతకూ పెరుగుతున్నందున బజ్‌రంగ్ దళ్ కార్యకర్తలు తమ నిరసనలతో రోడ్లపైకి రానున్నట్టు వీహెచ్‌పీ సెక్రటరీ జనరల్ మిలింద్ పరాండే ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 16న అన్ని జిల్లాల ప్రధాన కార్యాలయాల ముందు బైఠాయింపు నిరసనలు చేపట్టనున్నట్టు చెప్పారు. హిందువులపై జిహాదీ మతోన్మాదుల నిరంతర దాడులకు వ్యతిరేకంగా రాష్ట్రపతికి ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పిస్తామని తెలిపారు.


ఈనెల 10వ తేదీన శుక్రవారం ప్రార్థనల తర్వాత అల్లర్లు జరిగాయని, ఏయే మసీదుల నుంచి ఈ అల్లర్లు మొదలయ్యాయో ఆ మసీదులపై నిఘా ఉంచాలని, అల్లరిమూకలను రెచ్చగొట్టిన వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పరాండే డిమాండ్ చేశారు. జిహాదీ మతోన్మాదుల నుంచి బెదరింపులు ఎదుర్కొంటున్న వారికి భద్రత కల్పించాలని, బెదరింపులకు పాల్పడుతున్న వారిని గుర్తించి అరెస్టు చేయాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన అన్నారు. కాగా, ఈనెల 10న వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగడంపై నిరసనలు తెలిపేందుకు అన్ని ఆలయాల్లో ప్రజలు పెద్దఎత్తున హాజరై హనుమాన్ చాలీసా పఠించాలని వీహెచ్‌పీ ఢిల్లీ విభాగం మంగళవారంనాడు పిలుపునిచ్చింది.

Updated Date - 2022-06-14T20:47:51+05:30 IST