బెయిర్‌స్టో వీరవిహారం

ABN , First Publish Date - 2022-05-14T10:07:09+05:30 IST

పడుతూ లేస్తూ సాగుతున్న పంజాబ్‌ కింగ్స్‌.. ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

బెయిర్‌స్టో వీరవిహారం

దుమ్మురేపిన లివింగ్‌స్టోన్‌

 పంజాబ్‌ ఘన విజయం 

 54 పరుగులతో బెంగళూరు ఓటమి

ముంబై: పడుతూ లేస్తూ సాగుతున్న పంజాబ్‌ కింగ్స్‌.. ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. నాకౌట్‌ చేరాలంటే తప్పనిసరిగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో జానీ బెయిర్‌స్టో (29 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 66), లివింగ్‌స్టోన్‌ (42 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70) అర్ధ శతకాలతో చెలరేగడంతో.. పంజాబ్‌ 54 పరుగుల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును చిత్తు చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. హర్షల్‌ 4 వికెట్లు దక్కించుకున్నాడు. ఛేదనలో బెంగళూరు ఓవర్లన్నీ ఆడి 155/9 స్కోరు మాత్రమే చేసింది. మ్యాక్స్‌వెల్‌ (35), రజత్‌ పటీదార్‌ (26) పోరాడారు. రబాడ 3 వికెట్లు పడగొట్ట గా.. రిషి, చాహర్‌ చెరో 2 వికెట్లు కూల్చారు. ఈ విజయంతో పంజాబ్‌ 12 పాయింట్లతో ఆరో స్థానానికి ఎగబాకింది. బెయిర్‌స్టో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.


తడ‘బ్యాటు’..:

ఛేదనలో ఓపెనర్లు కోహ్లీ (20), డుప్లెసి (10)తోపాటు లోమ్రర్‌ (6)ను స్వల్ప స్కోరుకే కోల్పోవడంతో.. పవర్‌ ప్లే ముగిసే సరికి బెంగళూరు 44/3తో ఇబ్బందుల్లో పడింది.


అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన పటీదార్‌, మ్యాక్స్‌వెల్‌ ధాటిగా ఆడుతూ.. 4వ వికెట్‌కు 37 బంతుల్లో 64 పరుగుల భాగస్వామ్యంతో ఆశలు రేపారు. చాహర్‌ వేసిన 8వ ఓవర్‌లో మ్యాక్స్‌వెల్‌ 4,6 బాదగా.. పటీదార్‌ సిక్స్‌తో గేర్‌ మార్చారు. ఆ తర్వాతి ఓవర్‌లో పటీదార్‌ మరో 4,6 కొట్టడంతో.. 10 ఓవర్లకు బెంగళూరు 95/3తో మెరుగ్గానే కనిపించింది. కానీ, 104 స్కోరు వద్ద పటీదార్‌, మ్యాక్సీ వికెట్లను చేజార్చుకున్న రాయల్‌ చాలెంజర్స్‌ ఓటమి దిశగా సాగింది. పటీదార్‌ను చాహర్‌ అవుట్‌ చేయగా.. మ్యాక్స్‌వెల్‌ను హర్‌ప్రీత్‌ పెవిలియన్‌ చేర్చాడు. ఫుల్‌ఫామ్‌లో ఉన్న దినేష్‌ కార్తీక్‌ (11)ను అర్ష్‌దీప్‌ వెనక్కిపంపాడు. చివరి 30 బంతుల్లో 90 పరుగుల కావాల్సి ఉండగా.. షాబాజ్‌ (9), హసరంగ (1), హర్షల్‌ (11) వికెట్లను చేజార్చుకున్న బెంగళూరు 35 రన్స్‌ మాత్రమే చేసింది. 


పరుగుల వరద..:

పవర్‌ప్లేలో బెయిర్‌స్టో వీర విహారం.. ఆ తర్వాత లివింగ్‌స్టోన్‌ విధ్వంసంతో పంజాబ్‌ భారీ స్కోరు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్‌కు ఓపెనర్లు బెయిర్‌స్టో, ధవన్‌ (21).. తొలి వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యంతో ధనాధన్‌ ఆరంభాన్నిచ్చారు. ముఖ్యంగా బెయిర్‌స్టో బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడడంతో.. ఈ సీజన్‌ పవర్‌ప్లేలో పంజాబ్‌ 83/1తో అత్యధిక స్కోరు నమోదు చేసింది. ధవన్‌ను మ్యాక్స్‌వెల్‌ బౌల్డ్‌ చేసినా.. సిరాజ్‌ వేసిన 6వ ఓవర్‌లో జానీ ఫోర్‌, మూడు సిక్సర్లతో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, రాజపక్సే (1)ను హసరంగ వెనక్కిపంపగా.. టీమ్‌ స్కోరును సెంచరీ దాటించిన బెయిర్‌స్టోను షాబాజ్‌ 10వ ఓవర్‌లో పెవిలియన్‌ చేర్చాడు. ఈ దశలో లివింగ్‌స్టోన్‌, మయాంక్‌ (19).. 4వ వికెట్‌కు 51 పరుగులతో జోరు కొనసాగించారు. కానీ, మయాంక్‌, జితేష్‌ (9), హర్‌ప్రీత్‌ (7) కొద్ది తేడాతో అవుటయ్యారు. హాజెల్‌వుడ్‌ వేసిన 19వ ఓవర్‌లో 24 పరుగులు రాబట్టిన లివింగ్‌స్టోన్‌.. పంజాబ్‌ స్కోరును డబుల్‌ సెంచరీ దాటించాడు. కానీ, ఆఖరి ఓవర్‌లో లివింగ్‌స్టోన్‌, రిషి (7)ని అవుట్‌ చేసిన హర్షల్‌.. 4 పరుగులే ఇచ్చాడు. 


స్కోరుబోర్డు

పంజాబ్‌:

బెయిర్‌స్టో (సి) సిరాజ్‌ (బి) షాబాజ్‌ 66, శిఖర్‌ ధవన్‌ (బి) మాక్స్‌వెల్‌ 21, రాజపక్స (సి) హర్షల్‌ (బి) డిసిల్వా 1, లివింగ్‌స్టోన్‌ (సి) కార్తీక్‌ (బి) హర్షల్‌ 70, మయాంక్‌ (సి) డిసిల్వా (బి) హర్షల్‌ 19, జితేష్‌ (బి) డిసిల్వా 9, హర్‌ప్రీత్‌ (సి) కార్తీక్‌, (బి) పటేల్‌ 7, రిషి ధవన్‌ (సి) మాక్స్‌వెల్‌ (బి) పటేల్‌ 7, రాహుల్‌ చాహర్‌ (రనౌట్‌) మాక్స్‌వెల్‌/కార్తీక్‌ 2, రబాడ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 20 ఓవర్లలో 209/9. వికెట్ల పతనం: 1-60, 2-85, 3-101, 4-152, 5-164, 6-173, 7-206, 8-207, 9-209; బౌలింగ్‌: మ్యాక్స్‌వెల్‌ 2-0-17-1, హాజెల్‌వుడ్‌ 4-0-64-0, సిరాజ్‌ 2-0-36-0, హసరంగ 4-0-15-2, షాబాజ్‌ 4-0-40-1, హర్షల్‌ పటేల్‌ 4-0-34-4. 


బెంగళూరు:

కోహ్లీ (సి) చాహర్‌ (బి) రబాడ 20, డుప్లెసి (సి) జితేష్‌ (బి) రిషి ధవన్‌ 10, రజత్‌ పటీదార్‌ (సి) శిఖర్‌ ధవన్‌ (బి) చాహర్‌ 26,  మహిపాల్‌ (సి) శిఖర్‌ ధవన్‌ (బి) రిషి ధవన్‌ 6, మ్యాక్స్‌వెల్‌ (సి) అర్ష్‌దీప్‌ (బి) హర్‌ప్రీత్‌ 35, దినేష్‌ కార్తీక్‌ (సి) రాజపక్స (బి) అర్ష్‌దీప్‌ 11, షాబాజ్‌ (సి) రాజపక్స (బి) రబాడ 9, హర్షల్‌ (సి) మయాంక్‌ (బి) రబాడ 11, హసరంగ (సి) హర్‌ప్రీత్‌ (బి) చాహర్‌ 1, సిరాజ్‌ (నాటౌట్‌) 9, హాజెల్‌వుడ్‌ (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 10, మొత్తం: 20 ఓవర్లలో 155/9; వికెట్ల పతనం: 1-33, 2-34, 3-40, 4-104, 5-104, 6-120, 7-124, 8-137, 9-142; బౌలింగ్‌: హర్‌ప్రీత్‌ 4-0-33-1, అర్ష్‌దీప్‌ 4-0-27-1, రబాడ 4-0-21-3, రిషీ ధవన్‌ 4-0-36-2, రాహుల్‌ చాహర్‌ 4-0-37-2. 

Read more