బెయిలు నేతలు జైలుకే..!

ABN , First Publish Date - 2021-12-29T08:33:12+05:30 IST

బెయిలు నేతలు జైలుకే..!

బెయిలు నేతలు జైలుకే..!

ప్రకాశ్‌ జావడేకర్‌ సంచలన వ్యాఖ్యలు’

జగన్‌ సర్కారుపై బీజేపీ నేతల నిప్పులు

రాష్ట్రంలో విధ్వంసకర పాలన.. అందర్నీ జగన్‌ వంచించారు

మోదీ నిధులతో జగనన్న కాలనీలా?.. ఆయన ట్రిపుల్‌ స్టిక్కర్‌ సీఎం

పుష్ప సినిమాలో చూపినట్లుగా ఎర్రచందనం దోపిడీ

తెలుగు ప్రజలను వైసీపీ, టీడీపీ, టీఆర్‌ఎస్‌ మోసగించాయి

రాష్ట్రానికి మేలు చేసేది బీజేపీయే.. మమ్మల్నే ఆశీర్వదించండి

బీజేపీ ప్రజా ఆగ్రహ సభలో కేంద్ర మాజీ మంత్రి అభ్యర్థన

ఆటవిక పాలన కంటే అధ్వానం.. అప్పుల ఊబిలో రాష్ట్రం

ఆర్థిక ఎమర్జెన్సీతో ఎప్పుడైనా రాష్ట్రపతి పాలన: సుజనా


మోదీ ఇస్తున్న నిధులతో నిర్మించేవి మోదీ కాలనీలే! అవి జగనన్న కాలనీలు కావు. కేంద్రం సమగ్ర శిక్షా అభియాన్‌ కింద ఇస్తున్న నిధులతో అమలు చేసే పథకానికి ‘జగనన్న కానుక’ అని పేరు ఎలా పెడతారు? ఉపాధి నిధులతో చేపట్టిన నిర్మాణాలకూ జగన్‌ పేరు పెట్టుకోవడం ట్రిపుల్‌ స్టిక్కర్‌కు నిదర్శనం.

- కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌


అమరావతి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో బెయిలుపై ఉన్న నేతలు ఎప్పుడైనా జైలుకు వెళ్లొచ్చని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత ప్రకాశ్‌ జావడేకర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతోందని, ఇచ్చిన హామీలేవీ సీఎం జగన్మోహన్‌రెడ్డి నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. ప్రాంతీయ పార్టీలకు కుటుంబ ప్రయోజనాలు, అవినీతి తప్ప.. అభివృద్ధి పట్టదన్నారు. టీడీపీ, వైసీపీతోపాటు తెలంగాణలోని టీఆర్‌ఎస్‌ తెలుగు ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు. రాష్ట్రానికి మేలు చేసేది బీజేపీ మాత్రమేనని, ప్రత్యామ్నాయంగా తమను ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగన్‌ అరాచక పాలన, వైఫల్యాలపై బీజేపీ మంగళవారం విజయవాడలో నిర్వహించిన ‘ప్రజా ఆగ్రహ సభ’లో జావడేకర్‌ ప్రసంగించారు. విభజిత రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకరమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి.. తాను కేంద్ర పర్యావరణ మంత్రిగా 2014లోనే అనుమతిస్తే టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఇప్పటికీ ప్రాజెక్టు నుంచి నీరందించలేక పోయాయని ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతి కోసం అటవీ భూములను బదిలీ చేశామని.. ఇక్కడి రెండు పార్టీలు రాజధాని ఎక్కడ అనే దానికోసం కొట్టుకుంటున్నాయని అన్నారు. ‘సంపూర్ణ మద్య నిషేధమని మాటిచ్చిన జగన్‌.. ప్రజలను మోసగించారు. ఓట్ల కోసం ఇచ్చిన హామీని అధికారం దక్కగానే మరచిపోయి మడమ తిప్పేశారు. మద్యంపై వస్తున్న డబ్బుతోనే ఖజానా నింపుకొంటున్నారు. కేంద్ర పథకాలకు తన పేరు పెట్టుకుంటున్నారు. కేంద్రం ఇస్తున్న నిధులతో తన స్టిక్కర్లు వేసుకుంటున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై) కింద ఇళ్ల నిర్మాణానికి ఒక్కో లబ్ధిదారుడికి కేంద్రం రూ.1.60 లక్షలు ఇస్తోంటే ఆ కాలనీలకు జగన్‌ పేరు పెట్టడం ఏంటి? మోదీ ఇస్తున్న నిధులతో నిర్మించేవి మోదీ కాలనీలు తప్ప జగనన్న కాలనీలు కాబోవు. సమగ్ర శిక్ష అభియాన్‌ పేరుతో కేంద్రం ఇస్తున్న నిధులతో జగనన్న కానుక అని పేరు ఎలా పెడతారు? పంచాయతీల నిధులను సైతం మళ్లించి ఉపాధి నిధులతో చేపట్టిన నిర్మాణాలకు జగన్‌ పేరు పెట్టుకోవడం ట్రిపుల్‌ స్టిక్కర్‌కు నిదర్శనం’ అని మండిపడ్డారు. పోలీసు, ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ, కాంట్రాక్ట్‌ లేబర్‌ పర్మినెంట్‌, రైతులకు క్రాప్‌ ఇన్సూరెన్స్‌ ఇలా చెబుతూ పోతే అన్నింటా మడమ తిప్పడమేనన్నారు. ఈ సభకు వస్తున్నప్పుడు దారిలో ‘పుష్ప’ సినిమా పోస్టర్‌ చూశానని, ఎర్రచందనం స్మగ్లింగ్‌ అరికట్టేందుకు తాను కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి రాష్ట్ర(టీడీపీ) ప్రభుత్వం స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎస్‌టీఎఫ్‌) వేసిందని జావడేకర్‌ గుర్తు చేశారు. అయితే ఇప్పుడు జగన్‌ విధ్వంసానికి ప్రాధాన్యమిస్తూ.. ఎస్‌టీఎ్‌ఫను రద్దు చేశారని ఆక్షేపించారు. ఆంధ్రప్రదేశ్‌తో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని, ఇక్కడి ప్రజలన్నా.. వంటలన్నా తనకు ఎంతో ఇష్టమన్నారు. మోదీ ప్రధాని అయ్యాక ప్రపంచంలో భారతీయులు ఎక్కడికెళ్లినా గౌరవం లభిస్తోందని.. అయోధ్య, కాశీ, ఛార్‌ధామ్‌ తరహాలో దేశమంతా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి రథాన్ని తగుల బెట్టడం, రామతీర్థంలో స్వామివారి విగ్రహ శిరచ్ఛేదం ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.


టీడీపీ కనుమరుగు

‘మోదీని విమర్శించడం వల్లే 2019లో టీడీపీ ఓటమి పాలైంది. ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీనే.. టీడీపీ కనుమరుగైనట్లే..’ అని జావడేకర్‌ అన్నారు. ఏపీ ప్రజలు ఇప్పటికైనా ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలని, మోదీ నేతృత్వంలోని బీజేపీనే ఏపీ ప్రగతికి సరైన పార్టీ అని వ్యాఖ్యానించారు. అరాచక పాలనకు చరమగీతం పాడి సుపరిపాలన కోసం బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు.



Updated Date - 2021-12-29T08:33:12+05:30 IST