వనమా రాఘవకు బెయిల్‌

ABN , First Publish Date - 2022-03-11T02:04:30+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచకు చెందిన మండిగ నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఏ-2గా ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే

వనమా రాఘవకు బెయిల్‌

కొత్తగూడెం: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచకు చెందిన మండిగ నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఏ-2గా ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేందర్‌రావు(రాఘవ)కు గురువారం హైకోర్టు షరుతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. వనమా రాఘవ ఆగడాలను తట్టుకోలేక పాతపాల్వంచకు చెందిన రామకృష్ణ జనవరి 3వ తేదీ అర్ధరాత్రి తన భార్య, పిల్లలపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి తానూ ఆహుతయ్యాడు. ఈ క్రమంలో రామకృష్ణ తన, తన కుటుంబం ఆత్మాహుతి అవడానికి వనమా రాఘవ తమ ఆస్తులు, కుటుంబవ్యవహారాల్లో తలదూర్చి, తమకు అన్యాయం చేయడమే కారణమని.. సెల్ఫీ వీడియోలు రికార్డు చేయడం, సూసైడ్‌ నోట్‌ రాశాడు. అవి బహిర్గతం కావడంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. నాగరామకృష్ణ బావమరిది ఎలిశెట్టి జనార్దన్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై విచారించిన అనంతరం జనవరి 8వ తేదీన ఈ కేసులో ప్రధాన నిందితుడు ఏ-2గా ఉన్న వనమా రాఘవేందర్‌రావును ఏపీ వైపునకు పారిపోతుండగా అరెస్టు చేసి కొత్తగూడెం కోర్టుకు రిమాండ్‌ చేశారు. కోర్టు రాఘవకు 14 రోజులపాటు రిమాండ్‌ విధించడంతో అతడిని తొలుత భద్రాచలం సబ్‌జైలుకు తరలించారు.


భద్రత, ఇతర కారణాల రీత్యా అతడిని అక్కడి నుంచి ఖమ్మం జిల్లా జైలుకు తరలించారు. ఆ తర్వాత మూడుసార్లు రాఘవ బెయిల్‌ పిటీషన్‌ దాఖలు చేయగా ఆ మూడుసార్లు కోర్టు తిరస్కరించింది. దాంతో 61రోజులపాటు రాఘవ ఖమ్మం జైలుల్లోనే ఉన్నాడు. తాజాగా నాలుగోసారి రాఘవ తరపు న్యాయవాది హైకోర్టులో బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేయగా వాదోపవాదాలు విన్న కోర్టు అతడికి షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. వనమా రాఘవేందర్‌రావు కొత్తగూడెం నియోజకవర్గంలో అడుగుపెట్టకుండా ఉండాలని, ప్రతీ శనివారం ఖమ్మం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో సంతకం పెట్టాలని హైకోర్టు షరతులు విధించింది.  అయితే ఈ కేసులో ఏ3గా నాగరామకృష్ణ తల్లి మండిగా సూర్యావతి, ఏ4గా ఉన్న అతడి సోదరి కొమ్మిశెట్టి లోగమాధవిలకు  ఫిబ్రవరి 10న హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. 

Updated Date - 2022-03-11T02:04:30+05:30 IST