బైజూస్‌ చేతికి ఎపిక్‌

ABN , First Publish Date - 2021-07-22T06:07:34+05:30 IST

విద్యారంగంలోని స్టార్టప్‌ కంపెనీ బైజూస్‌ మరో కంపెనీని కొనుగోలు చేసింది. అమెరికా కేంద్రంగా పనిచేసే డిజిటల్‌ రీడింగ్‌ ప్లాట్‌ఫాం ‘ఎపిక్‌’ తాజాగా బైజూస్‌ గూటికి చేరింది.

బైజూస్‌ చేతికి ఎపిక్‌

డీల్‌ విలువ  రూ.3,729.8 కోట్లు

న్యూఢిల్లీ: విద్యారంగంలోని  స్టార్టప్‌ కంపెనీ బైజూస్‌ మరో కంపెనీని కొనుగోలు చేసింది. అమెరికా కేంద్రంగా పనిచేసే డిజిటల్‌ రీడింగ్‌ ప్లాట్‌ఫాం ‘ఎపిక్‌’  తాజాగా బైజూస్‌ గూటికి చేరింది. ఇందుకోసం కంపెనీ 50 కోట్ల డాల ర్లు  (సుమారు రూ.3,729.8 కోట్లు) చెల్లించింది. ఉత్తర అమెరికా దేశాల్లో ఎపిక్‌ కార్యకలాపాలను మరింత విస్తృతం చేసేందుకు కొత్తగా 100 కోట్ల డాలర్లు  (రూ.7500 కోట్లు) ఖర్చు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ దేశాల్లోని 12 ఏళ్ల లోపు పిల్లలు డిజిటల్‌ రీడింగ్‌ కోసం ఎక్కువగా ఎపిక్‌ను ఉపయోగిస్తారు. ఎపిక్‌ను ఇప్పటికే 20 లక్షల మంది ఉపాధ్యాయులు, అయిదు కోట్ల మంది పిల్లలు ఉపయోగిస్తున్నారు. బైజూస్‌ ఇటీవలే 100 కోట్ల డాలర్లతో మన దేశానికి చెందిన ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ కంపెనీని కొనుగోలు చేసింది. ఆ తర్వాత కంపెనీకి అతి పెద్ద కొనుగోలు ఇదే. ఈ కొనుగోలు తర్వాత కూడా ఎపిక్‌ సీఈఓ సురేశ్‌ మార్కోసియన్‌, సహ వ్యవస్థాపకుడు కెవిన్‌ డొనాహ్యు తమ పదవుల్లో కొనసాగుతారని బైజూస్‌ తెలిపింది. 


విస్తృత లైబ్రరీ: ఎపిక్‌ డిజిటల్‌ లైబ్రరీలో 40 వేలకు పైగా పుస్తకాలు, ఆడియో బుక్స్‌, వీడియోలు ఉన్నాయి. పిల్లలకు అత్యంత ఇష్టమైన వీటిని ఎపిక్‌, ప్రపంచంలోని 250కిపైగా పబ్లిషింగ్‌ సంస్థల నుంచి సేకరించింది. ఉపాధ్యాయులు ఉచితంగా ఈ డిజిటల్‌  లైబ్రరీని ఉపయోగించుకోవచ్చు. తమ తరగతుల్లో పిల్లలకు ఈ డిజిటల్‌ రీడింగ్‌ బుక్స్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు 20 లక్షల మంది ఉపాధ్యాయులు ఇప్పటికే ఎపిక్‌లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. బైజూస్‌ ఒక డిజిటల్‌ రీడింగ్‌ కంపెనీని కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి.

Updated Date - 2021-07-22T06:07:34+05:30 IST