బహుశా నేను మరణించాను

ABN , First Publish Date - 2020-08-24T06:27:42+05:30 IST

ఇంద్రధనుస్సు వంతెనల మీదికి నా కళ్ళు ఎగబాకక ముందే నా కాళ్ళు నల్లరేగడి మట్టిలో నడిచాయి రంగు గురించి గ్రామం నాకు తొలి పాఠం నేర్పింది...

బహుశా నేను మరణించాను

ఇంద్రధనుస్సు వంతెనల మీదికి నా కళ్ళు ఎగబాకక ముందే

నా కాళ్ళు నల్లరేగడి మట్టిలో నడిచాయి

రంగు గురించి గ్రామం నాకు తొలి పాఠం నేర్పింది


చిన్నప్పుడు కందిలి పరిచిన వెలుతురే కాదు

చుట్టూరా అల్లుకున్న నిశీధి సైతం

నా చదువుల అక్షరాల్లో కలిసిపోయి నాలోకి చేరింది


రాత్రి వేళ వూళ్ళో ఆరుబయట ఆటల్లో ఉప్పొంగినపుడు

ఆకాశం రాల్చిన నల్లని పుప్పొడి ఇప్పటికీ

నా ఒంటికి మెత్తని మెరుపునిస్తూనే వుంది


పిల్లలిద్దరి కళ్ల వాకిళ్ళ దగ్గర ఆవిడ ఇష్టంగా

తల్లితనాన్ని రంగరించి కాటుకగా అద్దినపుడు

వెల్వడిన కాంతి నా లోపలి గదుల్నీ ఇవాళ్టికీ వెలిగిస్తున్నది


నల్లని దృఢత్వాల సాహసాల మనుగడ యాత్రలు

నాగరికతకిచ్చిన కొత్త కొత్త వెల్తురు బాటల్ని

చరిత్ర అద్దం చూపినపుడల్లా నా చూపు ఉత్తేజితమయింది


పొలాల్లో కర్మాగారాల్లో చీకటి గనుల్లో చిక్కటి వనాల్లో 

చెమటోడ్చే నల్లని నిబ్బరపు ఊపిరి గాల్లోకి లేచి

నా దాకా వీచి నా శ్వాసను బతికిస్తూనే వుంది


వేల వేల రాత్రుల్లో యాత్రిస్తూ రక్తాన్నీ స్వేదాన్నీ 

అపుడపుడూ కురిసే సుగంధ వర్షాన్నీ అక్షరాల్లో

కూర్చుతున్నపుడు చీకటి నిద్రకాచి నాకు తోడుగా కూర్చుంది


ఇవాళ మాత్రం ఆ దూరతీరాన ఒక తెల్లని క్రూరపు అహంకార కాయం

ఒక నల్లని గొంతుని నేలకేసి నొక్కి చిదిమిన దృశ్యం చూసి

నా కనుపాప చితికిపోయింది, బహుశా ఇపుడు 

  నేను మరణించాను!

దర్భశయనం శ్రీనివాసాచార్య

94404 19039

Updated Date - 2020-08-24T06:27:42+05:30 IST