కరోనాకు చెక్‌ పెట్టే బాహుబలి వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-06-24T11:18:10+05:30 IST

‘వెన్ను చూపని వీరులను ఎన్నుకొని మరీ పంపించు షేర్‌ఖాన్‌’ అంటాడు ‘మగధీర’ సినిమాలో హీరో రామ్‌చరణ్‌. ఒక్కడే వంద మందితో పోరాడి వారిని సంహరిస్తాడు. అచ్చం అలాగే.. సార్స్‌, మెర్స్‌, సార్స్‌-కొవ్‌-2.. ఇ

కరోనాకు చెక్‌ పెట్టే బాహుబలి వ్యాక్సిన్‌

ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీతో రూపొందించిన ఉత్తర కరొలినా వర్సిటీ పరిశోధకులు

ఎలుకలపై ప్రయోగాల్లో మంచి ఫలితాలు

వాషింగ్టన్‌, జూన్‌ 23: ‘వెన్ను చూపని వీరులను ఎన్నుకొని మరీ పంపించు షేర్‌ఖాన్‌’ అంటాడు ‘మగధీర’ సినిమాలో హీరో రామ్‌చరణ్‌. ఒక్కడే వంద మందితో పోరాడి వారిని సంహరిస్తాడు. అచ్చం అలాగే.. సార్స్‌, మెర్స్‌, సార్స్‌-కొవ్‌-2.. ఇలా రకరకాల రూపాల్లో మానవాళిపై విరుచుకుపడుతున్న కరోనా వైర్‌సలన్నింటిపైనా పనిచేసే సూపర్‌ వాక్సిన్‌ అందుబాటులోకి వస్తే? ‘బాహుబలి’ లాంటి ప్యాన్‌ఇండియన్‌ సినిమాలాగా.. కరోనా కుటుంబానికి చెందిన వైర్‌సలన్నింటి పని పట్టే ‘ప్యాన్‌ కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌’ తయారైతే? ఆ ఊహే అద్భుతంగా ఉంది కదూ. అమెరికా శాస్త్రజ్ఞులకు అలాంటి ఐడియానే వచ్చింది. ఇంకేముందీ.. వెంటనే రంగంలోకి దిగి అలాంటి ఓ ‘యూనివర్సల్‌ టీకా’ను రూపొందించారు. ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో ఈ టీకా మంచి ఫలితాలను చూపిందట. ఎలుకలకు ఒక్క కొవిడ్‌-19 నుంచే కాక, ఇతర కరోనా వైర్‌సల నుంచి కూడా రక్షణ లభించేలా రోగనిరోధక వ్యవస్థను అప్రమత్తం చేసిందట. యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ కరొలినా వర్సిటీ శాస్త్రజ్ఞులు ఈ టీకా తయారీకి శ్రీకారం చుట్టారు.


ఇలా తయారు చేశారు..

సూపర్‌ వ్యాక్సిన్‌ తయారీకోసం శాస్త్రజ్ఞులు సరికొత్త పరిజ్ఞానమైన ఎంఆర్‌ఎన్‌ఏ విధానాన్నే ఆశ్రయించారు. అంటే.. ఫైజర్‌, మోడెర్నా టీకాల తయారీకి వాడిన టెక్నాలజీ. ఎంఆర్‌ఎన్‌ఏ టీకాల్లో ఉండే సింథటిక్‌ మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏలు.. టీకాలు వేయించుకున్నవారి శరీరాల్లోకి వెళ్లి, కరోనా స్పైక్‌ ప్రొటీన్‌ను వారి శరీర కణాలే తయారుచేసేలా ప్రేరేపిస్తాయి.


అయితే.. ఆ టీకాల తయారీలో కొవిడ్‌-19ను కట్టడి చేసే జన్యుకోడ్‌ను మాత్రమే చొప్పించారు. వాటికి భిన్నంగా సూపర్‌ టీకా కోసం... శాస్త్రజ్ఞులు రకరకాల కరోనా వైర్‌సలకు సంబంధించిన జన్యుకోడ్‌ను మెసెంజెర్‌ ఆర్‌ఎన్‌ఏల్లోకి చొప్పించారు. అలా అభివృద్ధి చేసిన ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ను ఎలుకలకు ఇవ్వగా రకరకాల వైర్‌సలకు సంబంధించిన స్పైక్‌ ప్రొటీన్లను నిర్వీర్యం చేసే యాంటీబాడీలు వాటిలో ఉత్పత్తి అయ్యాయి. దక్షిణాఫ్రికా వేరియంట్‌పై సైతం ఈ సూపర్‌వ్యాక్సిన్‌ బాగా పనిచేస్తున్నట్టు పరిశోధకులు తెలిపారు. వచ్చే ఏడాది హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ (మానవులపై ప్రయోగాలు) చేసే యోచనలో ఉన్నామని వెల్లడించారు. 


చైనా వ్యాక్సిన్లపై ఆధారపడ్డ దేశాల్లో కరోనా విజృంభణ

కరోనా కట్టడికి చైనా వ్యాక్సిన్లపై ఆధారపడ్డ మంగోలియా, సేషెల్స్‌, బహ్రెయిన్‌, చిలీ వంటి దేశాల్లో ఇప్పుడు కొవిడ్‌ విజృంభిస్తోంది. చైనాకు చెందిన కరోనా వ్యాక్సిన్లు తీసుకున్న దేశాల్లో అధ్యయనం చేసిన ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ పలు వివరాలు తెలిపింది. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో చైనా వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేయట్లేవని పేర్కొంది. కొత్త వేరియంట్లపై ఆ దేశ వ్యాక్సిన్ల ప్రభావశీలత అతి తక్కువగా ఉందని తెలిపింది. మంగోలియా, సేషెల్స్‌, బహ్రెయిన్‌, చిలీలో 50-68 శాతం మంది ప్రజలు చైనా వ్యాక్సిన్లు వేయించుకున్నప్పటికీ ఆయా దేశాల్లో కొన్ని రోజులుగా కరోనా విజృంభిస్తోంది.


Updated Date - 2021-06-24T11:18:10+05:30 IST