చలితో బహన్‌ బయటికే రావట్లేదు: అమిత్ షా సెటైర్లు

ABN , First Publish Date - 2022-01-01T02:50:42+05:30 IST

చలికి భయపడి బహన్‌ (మాయావతి) బయటికే రావట్లేదు. బహన్‌జీ.. ఎన్నికల మైదానంలోకి రండి. మళ్లీ మీరు ఓడిపోయాక మేం ప్రచారమే చేయలేదు, అందుకే ఓడిపోయామని బుకాయించొద్దు..

చలితో బహన్‌ బయటికే రావట్లేదు: అమిత్ షా సెటైర్లు

లఖ్‌నవూ: చలికి భయపడి మాయావతి (బహన్) బయటికే రావట్లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సెటైర్లు వేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎస్పీ, ఎస్పీలపై విరుచుకుపడ్డారు. ఎస్పీ, బీఎస్పీ పాలనలో ఉత్తరప్రదేశ్ వెనుకబడిందని యోగి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తమ ప్రదేశ్‌గా అవతరించిందని అమిత్ షా అన్నారు.


‘‘చలికి భయపడి బహన్‌ (మాయావతి) బయటికే రావట్లేదు. బహన్‌జీ.. ఎన్నికల మైదానంలోకి రండి. మళ్లీ మీరు ఓడిపోయాక మేం ప్రచారమే చేయలేదు, అందుకే ఓడిపోయామని బుకాయించొద్దు’’ అని అమిత్ షా అన్నారు. ఇక అఖిలేష్ విజయయాత్ర గురించి మాట్లాడుతూ ‘‘అభివృద్ధి బబువా (అఖిలేష్) బస్సు యాత్ర కాదు. అభివృద్ధి అంటే బీజేపీ.. బీజేపీ అంటే అభివృద్ధి. అఖిలేష్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూపీ గూండా రాజ్యంగా ఉండేది. మేం అధికారంలోకి వచ్చాక గూండా రాజ్యం నుంచి యూపీ ప్రజలకు విముక్తి లభించింది’’ అని అన్నారు. ఇక ప్రియాంక గాంధీ వాద్రాపై సైతం అమిత్ షా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ సీట్లు వస్తే ఎక్కువ అని ఎద్దేవా చేశారు. బువా (మాయావతి), బబువా (అఖిలేష్), బహన్ (ప్రియాంక) ముగ్గురు కలిసి పోరాడినా బీజేపీని ఓడించలేరని అమిత్ షా అన్నారు.

Updated Date - 2022-01-01T02:50:42+05:30 IST