దాహం తీరేనా!

ABN , First Publish Date - 2020-02-14T09:14:11+05:30 IST

‘ఇంటింటికీ రక్షిత మంచినీటిని సరఫరా చేస్తాం. లేదంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడగం’ ఇది .స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గతంలో చేసిన ప్రకటన. ఈ ప్రకటన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు

దాహం తీరేనా!

ఇంకా పూర్తికాని మిషన్‌ భగీరథ పనులు

అస్తవ్యస్తంగా అంతర్గత పైపులైన్‌ వ్యవస్థ

ఇళ్లకు నల్లాల బిగింపు ఇంకా పెండింగ్‌లోనే

మార్చి 31లోగా పూర్తికి సీఎం ఆదేశం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ‘ఇంటింటికీ రక్షిత మంచినీటిని సరఫరా చేస్తాం. లేదంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడగం’ ఇది .స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గతంలో చేసిన ప్రకటన. ఈ ప్రకటన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి.. మళ్లీ ప్రభుత్వం ఏర్పడింది. కొత్త ప్రభుత్వానికి ఏడాది కాలం కూడా గడిచింది. అయినా.. ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఇప్పటికీ అమల్లోకి రాలేదు. ఈ నేపథ్యంలో సీఎం మరో గడువును నిర్దేశించారు. వచ్చే మార్చి 31వ తేదీ నాటికి అన్ని గ్రామాల్లో మిషన్‌ భగీరథ పనులు పూర్తి చేయడంతోపాటు, ఇంటింటికీ నల్లా ద్వారా నీరందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో సీఎం ఆదేశాలు ఈసారైనా అమల్లోకి వస్తాయా, తమ దాహం తీరుతుందా.. అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు క్రమంగా ఎక్కువవుతున్నాయి. ఫిబ్రవరి నుంచే వేసవి పరిస్థితి కనిపిస్తోంది. దాంతో నీటి కొరత తలెత్తుతోంది. రానున్న రోజుల్లో ఈ సమస్య మరింత తీవ్రం కానుంది. దీనిని అధిగమించాలంటే సీఎం విధించిన మార్చి 31 గడువులోపు మిషన్‌ భగీరథ పనుల్ని పూర్తి చేయాల్సి ఉంటుంది.


కానీ, ఆ పనులకు సంబంధించి ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తే.. గడువులోపు పూర్తి చేసే అవకాశం కనిపించడం లేదు. ఎక్కడ చూసినా చిన్న చిన్న పనులు పెండింగ్‌లో ఉన్నాయి. పలు గ్రామాల్లో ఇంకా అంతర్గత పైపులైన్లు వేయనే లేదు. వేసిన చోట నల్లాలు బిగించలేదు. మిషన్‌ భగీరథలో 90ు ప నులను పూర్తి చేసినట్టు అధికారులు చెబుతున్నా.. మిగిలిన పనులు ఎప్పటికి పూర్తి చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. వాటిని పూర్తి చేస్తేనే.. ప్రజల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ నల్లా ద్వారా నీరందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేల కోట్ల అంచనా వ్యయంతో మిషన్‌ భగీరథను చేపట్టిన విషయం తెలిసిందే. కానీ, పనులు మాత్రం పూర్తికాక పోతుండటంతో ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువును ఎప్పటికప్పుడు పొడిగించాల్సి వస్తోంది. 2017 చివరి నాటికే ప్రధాన పనులు పూర్తి చేసి, తదుపరి మూడు-నాలుగు నెలల్లోనే ప్రతి ఇంటికీ నల్లా ద్వారా నీరివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. అనుకున్నట్టు పనులు జరగలేదు. దాంతో భగీరథ ప్రయోజనాలు పూర్తిగా అందుబాటులోకి రాలేదు. చివరి దశలో ఉన్న పనులు పూర్తి చేస్తే నీటి సరఫరాకు ఇబ్బంది ఉండదు. ఒకవేళ పనులు పూర్తి కాకపోతే అనివార్యంగా ప్రత్యామ్నాయ పద్ధతిలో తాగునీటిని అందించాల్సిన పరిస్థితులు నెలకొననున్నాయి. 


మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 873 ఆవాసాలకుగాను 817 ఆవాసాలకు భగీరథ నీరందుతోంది. 25,934 గ్రామాలకు మార్చిలోగా కనెక్షన్‌లు ఇచ్చి నీటిని సరఫరా చేస్తామని చెబుతున్నారు. 

సంగారెడ్డి జిల్లాలోని 951 ఆవాసాలకుగాను 907 ట్యాంకులు మంజూరు చేయగా 904 ట్యాంకుల నిర్మాణం పూర్తయింది. సింగూరులో నీరులేని కారణంగా పూర్తి స్థాయిలో నీటిని సరఫరా చేయలేకపోతున్నారు. అత్యవరమైతే ట్యాంకర్ల ద్వారా నీరందిస్తామని అధికారులు చెబుతున్నారు. 

నారాయణపేట జిల్లాలో 435 ట్యాంకులకుగాను 390 ట్యాంకులు పూర్తయ్యాయి. మిగతావి పురోగతిలో ఉన్నాయి. 421 ఆవాపాలకుగాను 214 గ్రామాల్లోనే అంతర్గత పెపులైన్‌ పనులు పూర్తయ్యాయి. నారాయణపేటలో ట్యాంకుల నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. 

ఆదిలాబాద్‌ జిల్లాలో 941 ట్యాంకులకుగాను 900 ట్యాంకుల నిర్మాణం పూర్తయింది. 

జోగులాంబ గద్వాల జిల్లాలో 96 శాతం పనులు జరిగాయి. గద్వాల, వడ్డేపల్లి, ఐజ, అలంపూర్‌ పట్టణాలకు కూడా భగీరథ నీరందుతోంది. 


జిల్లాల్లో పరిస్థితులు ఇవీ..

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 2.40 లక్షల కుటుంబాలకు నీటి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉండగా 93 వేల కుటుంబాలకే ఇచ్చారు. 706 ట్యాంకులకుగాను 573 ట్యాంకులకే నీరు చేరుతోంది. మిగతావి నిర్మాణంలో ఉన్నాయి. 

పెద్దపల్లి జిల్లాలోని అనేక గ్రామాల్లో పైపులైన్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. నల్లాలు బిగించలేదు. జిల్లాలో 1.40 లక్షల నల్లా కనెక్షన్‌లు ఇచ్చినట్లు చెబుతున్నారు. పెద్దపల్లి పట్టణంలో అంతర్గత పనులను కాంట్రాక్టర్‌ అర్ధాంతరంగా వదిలేశారు. 

నిజామాబాద్‌ జిల్లాలో సింగూరులో నీరు లేకపోవడంతో కొన్ని చోట్ల భగీరథ నీరు సరఫరా కావడం లేదు. 

 జగిత్యాల జిల్లాలో వందకు పైగా ఆవాసాలకు భగీరథ నీరు రావడం లేదు. 80 గ్రామాల్లో అంతర్గత పైపులైన్‌ పనులు పూర్తి కాలేదు. 16 ట్యాంకుల నిర్మాణం పురోగతిలో ఉంది. 

సూర్యాపేట జిల్లాలో 85 శాతం పనులు పూర్తయ్యాయి. 857 ఆవాసాలకుగాను 806 ఆవాసాలకు నీరు సరఫరా అవుతోంది. 515 ట్యాంకులకు 435 పూర్తయ్యాయి. కోదాడ, హుజూర్‌నగర్‌ పట్టణాల్లో సగం మంది ప్రజలకు భగీరథ నీరు రాకపోవడంతో మినరల్‌ వాటర్‌ తెచ్చుకుంటున్నారు. 

కామారెడ్డిలో 2,44,673 ఇళ్లకు నల్లా కనెక్షన్‌లు ఇవ్వాల్సి ఉండగా 1,82,120 ఇళ్లకు ఇచ్చారు. సింగూరులో నీరు లేకపోవడంతో బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గాల్లో 313 గ్రామాలకు నీరు రావడంలేదు.  

రంగారెడ్డి జిల్లాలో 2,54,482 నల్లా కనెక్షన్‌లకుగాను 2,44,606 ఇళ్లకు కనెక్షన్‌లు ఇచ్చారు. 842 ట్యాంకులకు 761 పూర్తయ్యాయి.  

ఖమ్మం జిల్లాలో 971 గ్రామాలకుగాను 960 గ్రామాలకు నీరందుతోంది. 920 ట్యాంకులగాకు 21 ట్యాంకుల నిర్మాణమే జరగాల్సి ఉంది. 

నాగర్‌కర్నూలు జిల్లాలో 702 ఆవాసాలకుగాను 640 ఆవాసాలకు నీరందుతోంది. 291 ట్యాంకులకుగాను 240 పూర్తయ్యాయి. కొల్లాపూర్‌, అచ్చంపేట, కల్వకుర్తి పట్టణాల్లో అంతర్గత పైప్‌లైన్‌ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. 

మెదక్‌ మునిసిపాలిటీ మినహా జిల్లా అంతటికీ భగీరథ నీరందుతోంది. 

సిద్ధిపేట జిల్లాలో 90% పనులు పూర్తయ్యా యి. మిగతా పనులు పురోగతిలో ఉన్నాయి.

వన పర్తి జిల్లాలోని 392 గ్రామాలకు 340 గ్రామాలకు నీరందుతోంది.  

మంచిర్యాల జిల్లాలలో 60 శాతం పనులే పూర్తయ్యాయి. 48 వేల నల్లా కనెక్షన్‌లు ఇచ్చారు. ఇంకా, 1.50 లక్షల కనెక్షన్‌లు ఇవ్వాలి. 

వరంగల్‌ రూరల్‌ జిల్లాల్లో పనులు జరుగుతున్నాయి. 520 ట్యాంకులకు 514 పూర్తయ్యాయి.  

సిరిసిల్ల జిల్లాలో 80% పనులు పూర్తయ్యాయి. పలు చోట్ల పనులు అస్తవ్యస్థంగా ఉన్నాయి. 

నల్లగొండ జిల్లాలో 1400 ట్యాంకుల నిర్మాణం పూర్తవగా మరో 150 ట్యాంకులు నిర్మించాలి.

వికారాబాద్‌ జిల్లాలో 80 శాతం పనులు జరిగాయి. 869 ట్యాంకులకు 794 పూర్తయ్యాయి.


కానీ, ఆ పనులకు సంబంధించి ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తే.. గడువులోపు పూర్తి చేసే అవకాశం కనిపించడం లేదు. ఎక్కడ చూసినా చిన్న చిన్న పనులు పెండింగ్‌లో ఉన్నాయి. పలు గ్రామాల్లో ఇంకా అంతర్గత పైపులైన్లు వేయనే లేదు. వేసిన చోట నల్లాలు బిగించలేదు. 

Updated Date - 2020-02-14T09:14:11+05:30 IST