బ్రేకుల్లేకుండా బాదుడు.. అయినా డొక్కుబస్సులే!

ABN , First Publish Date - 2022-07-07T08:25:44+05:30 IST

బ్రేకుల్లేకుండా బాదుడు.. అయినా డొక్కుబస్సులే!

బ్రేకుల్లేకుండా బాదుడు.. అయినా డొక్కుబస్సులే!

మూడు నెలలుగా వరుస వడ్డింపులు

ప్రయాణికులపై నెలకు 120 కోట్ల అదనపు భారం

ఆ డబ్బులతో వెయ్యి బస్సులు కొనొచ్చు

కాలంచెల్లిన బస్సులు, గోతులు పడ్డ రోడ్లు

పక్క ఊరు వెళ్లాలంటే కూసాలు కదలాల్సిందే


అద్దె బస్సుల టెండర్లకు స్పందన నిల్‌

ఆర్టీసీ అగచాట్లు


అమరావతి, జూలై 6(ఆంధ్రజ్యోతి): ప్రయాణికులపై రెండున్నర నెలల్లో రోజుకు నాలుగు కోట్ల రూపాయల వరకూ బాదిన జగన్‌ ప్రభుత్వం... ప్రయాణాల్లో మాత్రం నరకం చూపిస్తోంది. మూడు నెలల్లో డీజిల్‌ ధరలు తగ్గినా ఆర్టీసీ టికెట్‌ ధరలు విపరీతంగా పెంచేశారు. అయితే.. అందుకు తగ్గట్టు ప్రయాణికులకు సౌకర్యాలు మాత్రం కల్పించడంలేదు. ఎర్ర బస్సులో సుఖవంతమైన ప్రయాణం చదువుకోవడానికి తప్ప వాస్తవంలో కనిపించడంలేదు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కొత్త బస్సులు కొనుగోలు చేయకపోవడంతో డొక్కు సర్వీసులతో ప్రయాణికుల ఒళ్లు హూనం అవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లన్నీ గోతుల మయమవడంతో పక్క ఊరి ప్రయాణానికే కూసాలు కదిలి పోతున్నాయి. మూడు నెలల క్రితంతో పోలిస్తే ప్రతి నెల సరాసరి రూ.120కోట్ల మేర ఆదాయం ప్రజా రవాణా సంస్థ సంపాదిస్తోంది. ఆ డబ్బుతో కొత్త బస్సులు కొనకుండా ప్రయాణికుల సహనానికి కఠిన పరీక్ష పెడుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 11వేల ఆర్టీసీ బస్సుల్లో ప్రతి రోజూ 45లక్షల నుంచి 48లక్షలమంది గమ్యస్థానాలకు చేరుతున్నారు. ఈ ఏడాది మార్చిలో ప్రజా రవాణా సంస్థకు టికెట్ల ఆదాయం రోజుకు సరాసరి రూ.12.78కోట్లు వచ్చింది. డీజిల్‌ ధరల భారం భరించడం కష్టంగా ఉందని, డీజిల్‌పై సెస్‌ వేయక తప్పడంలేదంటూ సంస్థ ఎండీతో కలిసి ఆర్టీసీ ఛైర్మన్‌ మల్లికార్జున రెడ్డి (సీఎం చిన్నాన్న) ప్రజలపై ఏటా రూ.720కోట్ల మేర భారం వేస్తున్నట్లు ఏప్రిల్‌ రెండో వారంలో పిడుగు లాంటి వార్త చెప్పారు. గ్రామీణ, సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ప్రధాన రవాణా ఆర్టీసీనే కావడంతో భారమైనా తప్పక భరిస్తున్నారు. ఏప్రిల్‌ 13న ఆర్టీసీ చార్జీల పెంపు ప్రకటన చేసినప్పుడు రాష్ట్రంలో డీజిల్‌ ధర లీటరుకు రూ.107. దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్‌ ప్రభుత్వం అదనపు సెస్‌ విధించడంతో పొరుగు రాష్ట్రాల కన్నా మన రాష్ట్రం డీజిల్‌ ధరలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ భారాన్ని తగ్గించుకోవడానికి రిటైల్‌లో డీజిల్‌ పట్టిస్తున్నామని, బల్క్‌తో పోలిస్తే బంకుల్లోనే ధర తక్కువగా ఉందని ఎండీ తిరుమలరావు వివరణ ఇచ్చారు. ఏపీఎ్‌సఆర్టీసీ బస్సులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లినప్పుడు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలలో బంకుల వద్దకెళ్లి డీజిల్‌ కొట్టించాయి. ఇదిలాఉండగా రెండున్నర నెలలు తిరక్కుండానే జూన్‌ చివరి వారంలో మరోసారి జగనన్న ప్రభుత్వం సామాన్య, మధ్య తరగతి ప్రయాణికులపై మరో 500కోట్ల రూపాయల భారం మోపింది. డీజిల్‌పై మరోసారి సెస్‌ పెంచుతూ ఆర్టీసీ చైర్మన్‌, ఎండీ గత గురువారం ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. జూన్‌ 30న రాష్ట్రంలో డీజిల్‌ ధరలు రూ.99.45 మాత్రమే. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పది రూపాయలు తగ్గించడంతో కొంతమేర ఉపశమనం లభించింది. ఈ విషయాన్ని బయటికి చెప్పకుండా బల్క్‌ ధరలు ఎక్కువగా ఉన్నాయని, అందుకే పెంచాల్సి వస్తోందని ఆర్టీసీ తెలివిగా ప్రకటన విడుదల చేసింది. అవాక్కయిన రాష్ట్ర ప్రజలు, ఆర్టీసీ ప్రయాణీకులు ‘జగనన్నా.. ఇదేమి విశ్వసనీయత’ అంటూ సోషల్‌ మీడియా ద్వారా ప్రశ్నించారు. బ్రేకుల్లేకుండా బాదేస్తున్నారు.. కనీసం డొక్కు బస్సుల నుంచి విముక్తి కల్పించి కొత్త బస్సులైనా అందుబాటులోకి తీసుకురండి.. రేషన్‌ డిపోలకు వెళ్లే కార్డుదారులు అడగక పోయినా మీ బొమ్మ వేసుకుని వాహనాలు తిప్పుతున్నారు.. మేం డబ్బులు పెట్టి టికెట్‌ కొనుగోలు చేస్తున్నాం.. కనీసం అర్థం చేసుకోండి అని కోరారు. ఎవరు చెప్పినా వినని నైజం ఉన్న జగన్‌ ప్రభుత్వం కొత్త బస్సుల కొనుగోలుకు ఆర్టీసీకి అనుమతివ్వలేదు. దీంతో అద్దె బస్సులైనా కొత్తవేగా అంటూ ఆర్టీసీ యాజమాన్యం 998బస్సుల కోసం టెండర్లు ఆహ్వానిస్తే కనీసం మూడో వంతు కూడా రాలేదు. గోతుల మయమైన రోడ్లు.. ఆర్టీసీ కండీషన్లు మా వల్ల కాదంటూ ప్రైవేటు బస్సుల యజమానులు దండం పెట్టేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సొంతంగా కొత్త బస్సులు కొనుగోలు చేయాలంటే ప్రతి నెలా అదనంగా ప్రయాణీకుల నుంచి పిండేస్తోన్న రూ.120కోట్లతో సుమారు 350 బస్సుల చొప్పున కొనుగోలు చేయవచ్చు. అంటే మూడు నెలల్లోనే వెయ్యికి పైగా అదనపు బాదుడుతోనే సమకూర్చుకోవచ్చు. అందుకు జగన్‌ సర్కారు సిగ్నలిస్తుందా.? కోట్లాది మంది సమాన్య ప్రజల ప్రయాణంలో పడుతోన్న బాధలను తీరుస్తుందా.? అబ్బాయ్‌(సీఎం)తో బాబాయ్‌(ఆర్టీసీ చైర్మన్‌) అనుమతి తీసుకొస్తారా.? అనేది జగనన్న దయ, ప్రయాణీకుల ప్రాప్తం అన్నట్లు తయారైంది. 


అద్దె బస్సుల కోసం ఆర్టీసీ అగచాట్లు

గుంతల మయమైన రోడ్లు.. కష్టతరమైన కండీషన్లతో ఆర్టీసీ యాజమాన్యం పిలుస్తోన్న అద్దె బస్సు టెండర్లకు ప్రైవేటు బస్సుల యజమానులు దూరంగా ఉంటున్నారు. లక్షలాది రూపాయల ఖర్చుతో బస్సు కొనుగోలు చేసి గోతుల మయమైన రోడ్లపై నడపలేమని వెనుకడుగు వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 998 అద్దె బస్సుల కోసం ఆర్టీసీ నాలుగు నెలలుగా ప్రయాస పడుతోంది. మార్చిలో టెండర్లు ఆహ్వానిస్తే ఏ మాత్రం స్పందన కనిపించలేదు. గడువు పొడిగించినా అంతంతమాత్రంగానే ఉండటంతో కొందరు అధికారులు ప్రైవేటు ఆపరేటర్లతో మాట్లాడి టెండర్లు వేయించినట్లు ప్రచారం జరిగింది. అయినా 339మాత్రమే రావడంతో తాజాగా మరోసారి 659అద్దె బస్సుల కోసం ఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది. జిల్లాలవారీగా ఏ జిల్లాకు ఎన్నికావాలో వివరిస్తూ ఆపరేషన్స్‌ విభాగం ఈడీ కేఎ్‌సబీ రెడ్డి బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఏసీ స్లీపర్‌ 9, నాన్‌ ఏసీ స్లీపర్‌ 47, ఇంద్ర ఏసీ 6, సూపర్‌ లగ్జరీ 46, అలా్ట్ర డీలక్స్‌ 22, ఎక్స్‌ప్రెస్‌ 70, అలా్ట్ర పల్లె వెలుగు 208, పల్లె వెలుగు 203, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ 39, సిటీ ఆర్డినరీ 9 బస్సులకు ఎంఎ్‌సటీసీ ఈ పోర్టల్‌ ద్వారా టెండర్లు దాఖలు చేయాలని కోరారు. ఈ నెల 27వరకూ టెండర్లు స్వీకరించి ఆగస్టు 5, 6న రివర్స్‌ ఆక్షన్‌ నిర్వహిస్తామని ఈడీ వివరించారు. మరిన్ని వివరాలకు ఆర్టీసీ వెబ్‌సైట్‌  http://apsrtc.ap.gov.in లో చూడవచ్చన్నారు.  


ఏపీఎస్ ఆర్టీసీకి రోజువారీ ఆదాయం..

మార్చి 2022లో రూ.12.78కోట్లు

మే 2022లో రూ. 15.87కోట్లు

జూలై 2022లో రూ.16.74కోట్లు


రాష్ట్రంలో లీటరు/డీజిల్‌ ధర..

మార్చి 2022లో రూ.106-107మధ్యలో..

మే నెలలో రూ.107-108మధ్యలో..

జూలైలో రూ.99- 99.50మధ్యలో

Updated Date - 2022-07-07T08:25:44+05:30 IST