బడంగ్‌పేట్‌ ‘నవయుగ’లో 125 ఇళ్లు మునక

ABN , First Publish Date - 2020-09-30T09:22:51+05:30 IST

బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లోని నవయుగ ఎన్‌క్లేవ్‌ కాలనీ వాసుల బాధలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి.

బడంగ్‌పేట్‌ ‘నవయుగ’లో 125 ఇళ్లు మునక

ఖాళీ చేసిన నివాసితులు    

నాలుగైదు ఇళ్లల్లోనే యజమానులు     

మీర్‌పేట్‌ పెద్దచెరువు నిండిపోవడంతో  బాధితుల అవస్థలు


సరూర్‌నగర్‌, సెప్టెంబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లోని నవయుగ ఎన్‌క్లేవ్‌ కాలనీ వాసుల బాధలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. మీర్‌పేట్‌ పెద్దచెరువుకు ఎగువ భాగాన ఉన్న ఈ కాలనీలో దాదాపు 200 పైచిలుకు నివాస గృహాలు ఉండగా, ఇటీవల కురిసిన వానలకు కాలనీలోని సుమారు 125 ఇళ్లు ముంపునకు గురయ్యాయి. పెద్ద చెరువు నిండుగా ఉంది. ఈ నీళ్లు చెరువులోకి వెళ్లాలంటే చెరువు నుంచి నీటిని వదలాలి. అయితే పెద్దచెరువు నుంచి ఎక్కువ నీటిని విడుదల చేస్తే దిగువన గల మీర్‌పేట్‌ పరిధిలోని కాలనీలు ముంపునకు గురవుతాయని అధికారులు అంటున్నారు. దాంతో నవయుగ కాలనీవాసుల పరిస్థితి ఎటూ పాలుపోని విధంగా తయారయింది.


ఇళ్ల చుట్టూ నాచుతో కూడిన పచ్చని నీరు..

 బడంగ్‌పేట్‌ 1వ వార్డు పరిధి నవయుగ కాలనీలోని రోడ్డు నంబర్‌.7,8,9,10,11లలోని నివాస గృహాలన్నీ నీట మునిగాయి. కొందరు ఎలాగోలా వాటిలోనే ఉంటూ కాలం గడుపుతుండగా, పాములు, ఇతర క్రిమికీటకాలు ఇళ్లలోకి వస్తుండడంతో అనేక మంది ఇళ్లు ఖాళీ చేసి తాళాలు వేసి కట్టుబట్టలతో బయటకు వెళ్లిపోయారు. పరిచయస్తుల ఇళ్లలో కొందరు, బంధువుల ఇళ్లలో మరి కొందరు, అద్దె ఇళ్లలో ఇంకొందరు తలదాచుకున్నారు. కాలనీలో ఎటు చూసినా పచ్చని నాచు పరుచుకున్న వరద నీరే దర్శనమిస్తోంది. ఐదారు ఇళ్లలోని యజమానులు కింది పోర్షన్‌ను ఖాళీ చేసి రెండో పోర్షన్‌లో నివసిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాలంటే మాత్రం మోకాలిలోతు నీళ్లలో నడుచుకుంటూ రావాల్సిందే... అదీ ఓ కర్ర సాయంతో..! ఇక ఇదే కాలనీని ఆనుకుని ఉన్న సీతాహోమ్స్‌లో మరో 25 నివాస గృహాలు, సాయిబాలాజీ కాలనీలోని ఇంకో 25 దాకా నివాస గృహాలు నీటిలోనే ఉన్నాయి. ఆయా ఇళ్లలో నివసించే వారు సైతం వాటిని ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. ప్రస్తు తం అక్కడ పగటి పూట వెళ్తేనే పరిస్థితి భయానకంగా కనిపిస్తోంది. ఇక రాత్రి పూట ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, పెద్దచెరువు నీటిని దిగువకు ఎక్కువ పరిమాణంలో విడుదల చేసి తమ ఇళ్లను గట్టున పడేయాలని నవయుగ వాసులు వేడుకుంటున్నారు. 

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాం..

మా నివాస గృహాలన్నీ నీటిలో మునిగిపోయాయి. దాదాపు అందరూ ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఎగువ నుంచి ఇంకా వరద నీరు, మురుగు వస్తూనే ఉంది. దాంతో ముంపు ఇంకా ఎక్కువవుతోంది. నీటిలో మునిగిన ఇళ్లలో నాలుగైదు ఇళ్లలో ఉంటున్న కొంత మందిమి భయంతో గడుపుతున్నాం. మాకు వేరే ప్రత్యామ్నాయం లేనందున ఇక్కడే ఉంటున్నాం. పెద్దచెరువులో నుంచి ఎక్కువ నీటిని కిందకు వదలాలి. అప్పుడే మేము ఉండగలుగుతాం. 

- డేవిడ్‌, మాజీ బీఎ్‌సఎఫ్‌ జవాన్‌, నవయుగ ఎన్‌క్లేవ్‌

ముంపు నివారణకు ప్రయత్నిస్తున్నాం... 

నవయుగ ఎన్‌క్లేవ్‌, సీతాహోమ్స్‌, సాయిబాలాజీ కాలనీల్లో చాలామటుకు ఇళ్లు మునిగిపోయిన మాట వాస్తవమే. మీర్‌పేట్‌ పెద్దచెరువు నుంచి కొంత మేర దిగువకు నీరు వెళ్తోంది. మంత్రి సబితారెడ్డి సూచన మేరకు ఇంకొంత పరిమాణం పెంచడానికి ప్రయత్నిస్తున్నాం. దానికి గజ ఈతగాళ్ల అవసరం ఉంది. మామూలు వ్యక్తులు తూము వద్దకు వెళ్తే నీటి సుడులకు తూములోకి కొట్టుకుపోయే ప్రమాదముంది. ఈ దృష్ట్యా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుని ముంపు నివారణకు ప్రయత్నిస్తున్నాం. మరీ ఎక్కువగా నీరు విడుదల చేస్తే మీర్‌పేట్‌లోని దిగువ కాలనీలు ముంపునకు గురయ్యే ప్రమాదముంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకన్నా ఎక్కువగా ఏమీ చేయలేం. ప్రజలు కూడా పరిస్థితిని అర్థం చేసుకోవాలి.

  - టి.కృష్ణమోహన్‌రెడ్డి, కమిషనర్‌, బడంగ్‌పేట్‌

Updated Date - 2020-09-30T09:22:51+05:30 IST