సినిమాతో చెడుగుడు!

ABN , First Publish Date - 2021-09-12T05:46:31+05:30 IST

‘కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు?’ అని అంటారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ఆన్‌లైన్‌ బుకింగ్‌ మొత్తాన్ని ప్రభుత్వమే నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయడంపై సినీపరిశ్రమ ప్రముఖులు నోరు విప్పకపోయినా ప్రేక్షకులు మాత్రం గింజుకుంటున్నారు....

సినిమాతో చెడుగుడు!

‘కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు?’ అని అంటారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ఆన్‌లైన్‌ బుకింగ్‌ మొత్తాన్ని ప్రభుత్వమే నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయడంపై సినీపరిశ్రమ ప్రముఖులు నోరు విప్పకపోయినా ప్రేక్షకులు మాత్రం గింజుకుంటున్నారు. ఈ పరిస్థితిపై అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాసరావు పెట్టిన పోస్టు చాలా మందికి నచ్చుతుంది. ‘‘విభజన గాయాలను, అమరావతి విధ్వంసాన్ని, ఆర్థిక విధ్వంసాన్ని, దిక్కులేక విలపిస్తున్న విశాఖ ఉక్కును.. ఇలా దేన్నీ పట్టించుకోని, దేనికీ పనికిరాని కులాల్లో పుట్టిన కుర్రాళ్లు అభిమాన సంఘాలై ఆదరిస్తే బతికేస్తున్న సినిమా వాళ్ల గురించి, వాళ్లకు సినిమా చూపిస్తున్న జగన్‌ గురించి బాధపడటం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అవసరమా? చంద్రబాబును ఓడించడం కోసం జగన్‌ వెనుక నిలబడ్డ వాళ్లు ఇప్పుడు జగన్‌ ముందు చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఒక ప్రేక్షకుడిగా ఐ లైక్‌ దిస్‌ సీన్‌’’ అని కొలికపూడి వ్యాఖ్యానించారు. ఈయనే మరో సందర్భంలో ఇంకో పోస్ట్‌ పెట్టారు. ‘‘రాజధాని లేదన్న బాధ లేదు, పరిశ్రమలు రావు, ఉద్యోగాలు రావన్న దిగులు లేదు. తల్లిదండ్రులు అప్పులు చేసి చదివిస్తుంటే వాలంటరీ ఉద్యోగాలతో జీవితంలో ఎలా ఎదగాలి అన్న దిగులే లేదు. అయినా పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు, మోక్షజ్ఞ పుట్టినరోజని క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా ఉన్నారు. అమ్మా నాన్న జన్మనిచ్చారు.. అంబానీ జియో ఇచ్చాడు బతికేస్తున్నారు’’ అని ఆయన తన ఆవేదనను వ్యంగ్యంగా వ్యక్తపరిచారు. సినిమానటులను హీరోలుగా ఆరాధించే సంస్కృతిని తమిళనాడు నుంచి ఆంధ్రప్రజలు దిగుమతి చేసుకున్నారు. తెలంగాణలో మాత్రం ఈ సంస్కృతి లేదు. కులాలవారీగా విడిపోయి సినీనటులను హీరోలుగా ఆరాధిస్తూ నెత్తిన పెట్టుకుని ఊరేగడం ఆంధ్ర యువతకు ఉన్న అదనపు అర్హత. దీంతో తాము నిజంగానే హీరోలమని, డెమీ గాడ్స్‌ అనీ ఆయా నటులు భావిస్తూ వచ్చారు. ప్రభుత్వాలపై ఆధిపత్యం చలాయిస్తూ వచ్చారు. ఉమ్మడిరాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారందరూ సినీనటులను అదేవిధంగా గౌరవించేవారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడైతే వారికి మరీ భయపడిపోయేవారు. అయితే తెలుగు సినీనటులు, ఇతర ప్రముఖులకు అంత సీన్‌ లేదని, వారిని లొంగదీసుకోవడం ఎలాగో తెలుసుకున్న ముఖ్యమంత్రులు ఇద్దరే అని ఇటీవల జరిగిన పరిణామాలు చెబుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మాత్రం సినీనటుల బలహీనతలను ఔపోసన పట్టి వారిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. సినీనటులకు కోపం వస్తే తాము రాజకీయంగా ఎక్కడ నష్టపోతామో అన్న భయంతో ఇప్పటివరకు మనల్ని పరిపాలించిన ముఖ్యమంత్రులు వారి కోరికలన్నీ తీర్చేవారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ర్టాలలో ఈ పరిస్థితికి ఫుల్‌స్టాప్‌ పడింది. 


సీన్‌ రివర్స్‌!

నిన్నటి వరకు సినీపరిశ్రమకు అది కావాలి, ఇది కావాలి అంటూ పెద్దలు నానా యాగీ చేసేవారు. ఇప్పుడు తమకు ఏం కావాలో కూడా అడగడానికి వారికి నోరు రావడం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నంది అవార్డులపై ఎంత రభస జరిగిందో చూశాం. అవార్డుల ప్రకటనలో పక్షపాతం చోటుచేసుకుందని చిందులేశారు. దీంతో ప్రకటించిన నందులను కూడా చంద్రబాబు రద్దు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం ‘నంది లేదు.. పంది లేదు’ అని అన్నప్పటికీ ఒక్క గొంతు కూడా పెగల్లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన కొత్తలోనే జేసీబీలను తరలించడం ద్వారా తాను ఏమిటో రుజువు చేసుకున్నారు కేసీఆర్‌. అప్పటి నుంచి సినీప్రముఖులు అందరూ కుక్కినపేనుల్లా పడి ఉన్నారు. ఎందుకంటే సినీ పరిశ్రమకు చెందిన 90 శాతం మందికి ఆంధ్ర మూలాలే ఉన్నాయి. స్థానబలం, కులబలం కూడా లేదు. తెలంగాణ ప్రజలు కూడా వారిని ఆంధ్ర వారి వలె ఆరాధించరు. అన్నిటికంటే ముఖ్యంగా వారందరి ఆస్తులూ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఇంకేముందీ, కేసీఆర్‌ పాలనను పొగడడానికి పోటీపడ్డారు. మొత్తానికి సంధి కుదిరింది. జేసీబీలు షెడ్డుకు వెళ్లిపోయాయి. ఒకప్పుడు కడప జిల్లా బాలకృష్ణ అభిమానుల సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన జగన్మోహన్‌ రెడ్డి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయ్యారు. సినీనటుల బలహీనతలను ఔపోసన పట్టిన ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చుక్కలు చూపిస్తున్నారు. అంతకుముందు పెద్ద సినిమాలు రిలీజైనప్పుడు ఇష్టం వచ్చినన్ని షోలు వేసుకోవడానికి, టికెట్ల ధరలను ఇష్టానుసారం పెంచడానికి అనుమతి పొందేవారు. జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అలాంటి పప్పులు ఉడకవు అని తేల్చి చెప్పారు. దీంతో కొంతమంది పెద్ద తలకాయలు సైతం తమ సినిమాల విడుదల సందర్భంగా ప్రత్యేక అనుమతి కోసం కుటుంబసమేతంగా ఆయన దర్శనం చేసుకోవలసి వచ్చింది. ఇది గమనించిన జగన్‌రెడ్డి సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. ఇప్పుడు ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ను ప్రభుత్వపరం చేశారు. సినీపరిశ్రమ పెద్దలను సంప్రదించకుండా అలా ఎలా చేస్తారు? అని ఒక్క గొంతు కూడా పెగల్లేదు. ఆస్తుల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వానికి లొంగిపోయిన వాళ్లు కదా మరి. ఆంధ్ర ప్రజల్లో ఉన్న సినిమా పిచ్చిని ఉపయోగించుకుని డబ్బు చేసుకోవడం మినహా వారి వల్ల ఆంధ్రప్రదేశ్‌కు ఉపయోగం ఏమిటి? అని జగన్‌రెడ్డి భావించి ఉంటారు. అందుకనే వారితో ఆడుకుంటున్నారు. సినిమా ఫంక్షన్లన్నీ దాదాపు హైదరాబాద్‌లోనే జరుగుతాయి. అమాయక అభిమానులు మాత్రం వ్యయప్రయాసలకోర్చి ఆంధ్ర నుంచి హైదరాబాద్‌ వస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో పెద్దగా షూటింగులు కూడా జరగవు. అలాంటప్పుడు టికెట్‌ అమ్మకంపై లభించే పన్ను ఆదాయం మినహా రాష్ర్టానికి వచ్చేది ఏమీ లేనప్పుడు సినిమావాళ్లకు ఎందుకు పెద్దపీట వేయాలని జగన్‌రెడ్డి భావించి ఉంటారేమో. ఈ నేపథ్యంలో ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే అలాంటి వారి సినిమాలకు ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసుకున్న వారిని గుర్తించి వారికి పెన్షన్లు, ఇతర సదుపాయాలు నిలిపివేస్తామని జగన్‌ సర్కార్‌ హెచ్చరించే అవకాశం లేకపోలేదు! అయితే సినిమా వసూళ్లలో అధికభాగం ఆంధ్రప్రదేశ్‌ నుంచే లభిస్తాయి. తెలంగాణలో హైదరాబాద్‌లో లభించే వసూళ్లే ప్రధానం. ఈ కారణంగా సినీనిర్మాతలు బతికి బట్టకట్టాలంటే రెండు తెలుగు రాష్ర్టాల సహకారం అవసరం. సినీపరిశ్రమ ముఖ్యులు తనను ముఖ్యమంత్రిగా గుర్తించడం లేదని జగన్‌రెడ్డి భావిస్తున్నారు. ఆ మధ్య చిరంజీవి నాయకత్వంలో తనను కలసిన ప్రముఖుల వద్ద ఆయన ఈ విషయం ప్రస్తావించినట్టు తెలుస్తోంది. సినీపరిశ్రమలో అధికులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటారన్న కోపం కూడా జగన్‌రెడ్డిలో ఉందని చెబుతున్నారు. గత ఎన్నికలలో కొంతమంది సినీనటులు వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసినా జగన్‌రెడ్డి అభిప్రాయం మారలేదు. సినీపరిశ్రమలో ప్రస్తుతం రెండు మూడు వర్గాలున్నాయి. ప్రధానవర్గం చిరంజీవి నాయకత్వంలో ఉంది. నాగార్జున వంటి వారు చిరంజీవితో చేతులు కలిపారు. మిగతావారికి ఎవరు నాయకత్వం వహిస్తారో తెలియదు గానీ బాలకృష్ణ వంటి వారు అప్పుడప్పుడూ గొంతు ఎత్తుతారు. చిరంజీవి సోదరుడు పవన్‌కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నారు. ఈ కారణంగా ఆయన సినిమాలకు ప్రత్యేక షోలకు గానీ, టికెట్ల ధర పెంచుకోవడానికి గానీ అనుమతి లభించడం లేదు. ముఖ్యమంత్రితో సఖ్యత పెంచుకోవడం కోసం చిరంజీవి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. జగన్‌రెడ్డితో సమావేశం ఏర్పాటు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్‌ మంత్రి పేర్ని నాని కొంత చొరవ తీసుకున్నారు. దీంతో గతంలో దాసరి నారాయణరావు నిర్వహించిన పాత్రను పోషించాలనుకుంటున్న చిరంజీవి సినీప్రముఖులతో తన ఇంట్లో సమావేశం ఏర్పాటుచేసి ముఖ్యమంత్రితో జరగబోయే సమావేశం ఎజెండా గురించి చర్చించినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇంతలో ఏం జరిగిందో తెలియదు గానీ సినీ పరిశ్రమకు, ముఖ్యంగా ఎగ్జిబిటర్లకు పిడుగులాంటి నిర్ణయాన్ని జగన్‌ ప్రభుత్వం తీసుకుంది. పేర్ని నాని తలపెట్టిన సమావేశం కూడా జరగలేదు. ప్రభుత్వమే సినిమా టికెట్లు విక్రయించాలనుకోవడంపై సోషల్‌ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు చెలరేగాయి. అదే సమయంలో మాంసం విక్రయకేంద్రాలను కూడా ప్రభుత్వం ప్రారంభించబోతున్నట్టు జగన్‌రెడ్డి సొంత పత్రికలో ఒక వార్త వచ్చింది. దీంతో ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి? చేస్తున్నది ఏమిటి? అని నెటిజన్లు మండిపడ్డారు. బార్బర్‌షాపులు, మసాజ్‌సెంటర్లు కూడా ప్రభుత్వమే నిర్వహిస్తే పోలా? అని చలోక్తులు విసురుతున్నారు. మొత్తంమీద ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుండగా సినీపరిశ్రమ ప్రతినిధులు మాత్రం మౌనవ్రతం పాటిస్తున్నారు. ‘పేదవాడి కోపం పెదవికి చేటు’ అని వారికి తెలుసు గనుక తమ భావాలను వ్యక్తంచేయడానికి కూడా సాహసించడం లేదు. అందుకే జగన్‌ ముందు సినీనటులు చేతులు కట్టుకుని నిలబడ్డారని కొలికపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యానించి ఉంటారు. 


కరోనా పుణ్యాన...

నిజానికి కరోనా మహమ్మారి కారణంగా సినిమా పరిశ్రమ కుదేలైంది. ఏడాదిన్నరగా పెద్దనటుల సినిమాలు విడుదల చేయలేని పరిస్థితి. నెలల తరబడి షూటింగులు నిలిచిపోవడంతో పరిశ్రమపై ఆధారపడి జీవించేవారు ఉపాధి కోల్పోయారు. కులాలను అడ్డుపెట్టుకుని బడానటులుగా చలామణి అవుతున్న వారికి మార్కెట్‌ లేకుండా పోయింది. కరోనాకు ముందు హీరోలుగా వెలిగిన కొంతమంది ఒక్క సినిమాలో నటించడానికే 20 కోట్లకు పైగా పారితోషికాన్ని డిమాండ్‌ చేసేవారు. సినిమా నిర్మాణ వ్యయంపై అదుపు లేకుండా పోయింది. నిర్మాతల గురించి ఆలోచించే తీరిక ఎవరికీ లేకుండా పోయింది. నోటికొచ్చిన పారితోషికాన్ని డిమాండ్‌ చేసిన వారు సైతం కరోనా పుణ్యమా అని మెత్తబడ్డారు. ఎందుకంటే వారికి ఇప్పుడు చేయడానికి సినిమాలు లేవు. నిర్మాణాలు పూర్తిచేసుకున్న సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఓటీటీ ప్లాట్‌ఫాం విస్తరించింది. థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే అలవాటుకు ప్రేక్షకులు దూరమవుతున్నారన్న భయం మరోవైపు. మొత్తానికి కరోనా వైరస్‌ సినిమా పరిశ్రమకు కొంత మంచి చేయగా, ఇంకొంత చెడు చేసింది. హీరోలు అనబడేవారు నేల మీదకు దిగివచ్చారు. బాలీవుడ్‌లో అద్భుత నటులు ఉన్నారు. అమితాబచ్చన్‌ వంటి వారిని కూడా సినిమా నటుడిగానే పిలుస్తారు. హీరో అమితాబ్‌ అని ఆయన కూడా చెప్పుకోరు. తమిళ సంస్కృతి పుణ్యమా అని మన దగ్గరే ఈ జాడ్యం. వెండితెరపై కథానాయకుడి పాత్ర పోషించిన వారు నిజజీవితంలో హీరోలుగా ఉండగలుగుతున్నారా? అంటే అదీ లేదు. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తామే అసలైన హీరోలమని రుజువు చేసుకున్నారు. సినిమావాళ్లతో ఎలా ఆడుకోవచ్చో ఈ ఇరువురు ముఖ్యమంత్రులకు తెలిసిపోయింది కనుక భవిష్యత్తులో ముఖ్యమంత్రులుగా వచ్చే వాళ్లు సైతం ఇలాగే వ్యవహరించే అవకాశం లేకపోలేదు. సినీప్రముఖులను అదుపు చేయడం ఇంత సులువా? అని ఇప్పుడు అందరికీ తెలిసొచ్చింది! తాము ఎంతటి బలహీనులో సినిమావాళ్లకు తెలిసివచ్చిందో లేదో తెలియదు. సినిమానటుడిగా ఉండి రాజకీయాల్లో రాణించింది ఒక్క ఎన్టీఆర్‌ మాత్రమే. అప్పుడు రాష్ర్టాన్ని పాలిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి మరో ప్రత్యామ్నాయం లేనందున ఎన్టీఆర్‌ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగలిగింది. ఆ తర్వాత రెండున్నర దశాబ్దాలకు చిరంజీవి రాజకీయ అరంగేట్రం చేసి వివిధ కారణాల వల్ల అధికారంలోకి రాలేకపోయారు. ఇప్పుడు ఆయన సోదరుడు పవన్‌కల్యాణ్‌ జనసేన పార్టీని నడుపుతున్నారు. గత ఎన్నికలలో పొత్తులు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగిన ఆయన రెండు స్థానాల్లో పోటీ చేసి కూడా ఓడిపోయారు. ఆ పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పంచన చేరారు. దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. సినిమానటులను చూడటానికి, వారి సభలకు జనం ఎగబడవచ్చును గానీ ఓటు మాత్రం ఎవరికి వేయాలో వారికే వేస్తారు. ఈ సూక్ష్మాన్ని కేసీఆర్‌, జగన్‌రెడ్డి తెలుసుకున్నారు. మొత్తంమీద సినిమావాళ్లకు పెద్దకష్టమే వచ్చింది. తమకు వచ్చిన కష్టం గురించి నోరు తెరిచి చెప్పుకోలేకపోవడం ఇంకెంత కష్టమో కదా!


చీకటి ఒప్పందాలు!

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల విషయానికి వద్దాం. సినిమావాళ్లతో చెడుగుడు ఆడుకుంటున్నట్టుగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో కూడా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఆడుకుంటున్నారు. అప్పుల కోసం తిప్పలు పడుతున్న ఆయన మధ్య మధ్యలో ఆటవిడుపు కోసం ప్రత్యర్థులను తిప్పలు పెడుతున్నారు. అప్పులు చేయడంలోనే కాదు, గిట్టనివారికి చుక్కలు చూపించడంలో కూడా జగన్‌ ఆలోచనలు ‘న భూతో న భవిష్యత్‌’.. ‘నెవర్‌ బిఫోర్‌ ఎవర్‌ ఆఫ్టర్‌’ అన్నట్టుగా ఉంటున్నాయి. ఓటుబ్యాంకులను సుస్థిరం చేసుకోవడం కోసం వినూత్నమార్గాల్లో అప్పులు చేస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టుపెట్టి అప్పు చేయవచ్చునన్న అద్భుత ఆలోచనలు జగన్‌ ప్రభుత్వానికి మాత్రమే వస్తున్నాయి. సినిమావాళ్లను అదుపులో పెట్టుకోవడం కోసం ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ను ప్రభుత్వపరం చేసినట్టుగానే రాజకీయ ప్రత్యర్థులపై వింత వింత కేసులు, ఆంక్షలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో అభివృద్ధి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే విరుచుకుపడుతున్నారు. రెండున్నరేళ్ల క్రితం చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఇప్పుడు ఇలా ఉందన్న తెంపరి సమాధానాలు చెబుతున్నారు. రాజకీయాల్లో జగన్‌రెడ్డి అనుసరిస్తున్న పోకడను గతంలోనే కాదు భవిష్యత్తులోనూ ఎవరూ అనుసరించలేరు. ప్రజలకు డబ్బులు పంచుతూ, తెర వెనుక తాను డబ్బు చేసుకోవడం ఆయనకే సాధ్యం. గతంలో తనపై మోపిన అవినీతి కేసుల్లో విచారణ ముంచుకొస్తున్నప్పటికీ ఏమాత్రం వెరపు లేకుండా డబ్బు సంపాదనపైనే జగన్‌రెడ్డి దృష్టి కేంద్రీకరించారు. కంపెనీలు చేతులు మారినా, కొత్తగా ఎవరైనా ప్రతిపాదనలతో ముందుకు వచ్చినా ‘నాకేంటి?’ అని ఆయన మొహమాటం లేకుండా అడుగుతున్నారని విపరీతంగా ప్రచారం జరుగుతోంది. నిజానికి జగన్‌రెడ్డికి అంతులేని సంపద ఉంది. ముఖ్యమంత్రిగా ఆయనకు అపూర్వ అవకాశం కూడా లభించింది. ఈ నేపథ్యంలో జగన్‌ స్థానంలో మరెవరు ఉన్నా డబ్బు ఆశించకుండా ఆదర్శపాలన అందించడానికే ప్రయత్నం చేసేవారు. విచిత్రమేమిటంటే జగన్‌తో పాటు అవినీతి కేసులలో నిందితులుగా ఉన్న ఐఏఎస్‌ అధికారులు, పారిశ్రామిక, వ్యాపారవేత్తలు కూడా గతాన్ని గుణపాఠంగా తీసుకోకుండా ఇప్పటికీ జగన్‌రెడ్డి బాటలోనే పయనించడానికి ఉత్సాహపడుతున్నారు. ఇదొక అసాధారణ లక్షణమని చెప్పవచ్చు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం జగన్‌తో పాటు సహ నిందితులుగా ఉన్న ఐదుగురు పారిశ్రామికవేత్తలు జగన్‌తో చేతులు కలిపి చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాలకు గతంలో నిందితులుగా సీబీఐ పేర్కొన్న కొంతమంది ఐఏఎస్‌ అధికారులతో పాటు కొత్తగా మరికొంతమంది ఐఏఎస్‌లు సహకరిస్తున్నారు. ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నవారు అది మరచిపోయి మళ్లీ తప్పులు చేయడానికి వెరవకపోవడం ఆశ్చర్యంగా ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారే పరిస్థితులు ఏర్పడితే కనీసం పాతిక మంది ఐఏఎస్‌ అధికారులు ఢిల్లీకి డెప్యుటేషన్‌పై వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటారని ఒక అధికారి చమత్కరించారు. చాలామంది తెలిసో తెలియకో, లేకపోతే బలహీనతల కారణంగానో తప్పులు చేస్తారు. మొదటి తప్పు చేసినవాళ్లు చాలామంది పరివర్తన చెందడం చూశాం. జగన్‌ అండ్‌ కోలో మాత్రం ఇటువంటి పరివర్తన ఈషణ్మాత్రం కూడా కనిపించడం లేదు. అవినీతి కేసులలో తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో వారు అలా ప్రవర్తిస్తూ ఉండవచ్చు. ‘‘మా మీద నమోదు చేసిన కేసులు నిలబడవు. నిలబడి శిక్ష పడినా బెయిలుపై బయటికొచ్చేస్తాం’’ అని ఒక కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి వ్యాఖ్యానించాడంటే వారిలో బరితెగింపు ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఎన్నో వ్యాపారాలు చేస్తున్న జగన్‌రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక మరెన్నో వ్యాపారాల్లో వాటా పొందారు. ఇందులో కొన్నింటిలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్‌ వాటాలు పొందారు. అయితే రాజశేఖర రెడ్డి మరణానంతరం ఇలాంటి బినామీ వ్యవహారాల్లో కొంతమంది ముఖం చాటేశారు. ఇప్పుడు అధికారం చేతికి రావడంతో వాళ్లను పిలిపించుకుని ఇంతకాలం ముఖం చాటేసినందుకు శిక్షగా తనకు ఉన్న బినామీ వాటాను పెంచుకుంటున్నారు. ఇవికాకుండా కొత్త వ్యాపారాల్లో వాటాలు పొందుతున్నారు. రాష్ట్రంలో అవినీతి పూర్తిగా కేంద్రీకృతం అయింది. లాభసాటి వ్యాపారాలలో, ముఖ్యంగా గనులలో వాటాలు చేతులు మారాయి. గనులు ప్రభుత్వ పెద్దలకు బంగారుబాతులుగా మారాయి. ఈ దందాలన్నింటిపై భవిష్యత్తులో విచారణ జరిగే ప్రమాదం ఉంది కదా? అని చీకటి ఒప్పందాలతో సంబంధం ఉన్న ఒకరిని ప్రశ్నించగా, దశాబ్దం క్రితం తమపై పెట్టిన కేసులలో ఏం జరుగుతున్నదో భవిష్యత్తులో కూడా అదే జరుగుతుందని ఆయన తేలికగా తీసిపారేశారు. వార్షిక లాభం వేలకోట్లు ఉండే కంపెనీలు సైతం చేసిన తప్పులే మళ్లీ చేస్తున్నాయి. ప్రభుత్వంలో జరుగుతున్న దందాల గురించి వింటే జగన్‌రెడ్డిలో అసాధారణ ప్రతిభాపాటవాలు ఉన్నాయని అంగీకరించక తప్పదు. అయితే అవేవీ రాష్ర్టాభివృద్ధికి ఉపయోగపడకపోవడం బాధాకరం. 


మంచో చెడో తండ్రి హయాంలో సంపాదించిన సొమ్ముతో సంతృప్తిపడకుండా ఇంకా ఇంకా అంటూ ఆరాటపడుతున్న వ్యక్తిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. అంతులేని ధనదాహం ఉండటం ఒకరకంగా మానసికజాడ్యమనే చెప్పవచ్చు. ఈ జాడ్యం ఒక జగన్‌రెడ్డికే కాకుండా ఆయన చుట్టూ తిరిగే అధికారులు, వ్యాపారవేత్తలకు కూడా పాకింది. లేనిపక్షంలో తెలంగాణకు చెందిన ఒక ఫార్మా కంపెనీ అధిపతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఒక చీకటి ఒప్పందంలో భాగం కావడానికి ఎందుకు సిద్ధమవుతారు? ఈయన గారు ఇప్పటికే జగన్‌పై ఉన్న కేసులలో సహ నిందితుడిగా ఉన్నారు. జయలలిత పరిస్థితి చూసిన తర్వాతైనా జగన్‌ అండ్‌ కో వంటి వారు ఎందుకు మారరో అర్థం కాని విషయం. అధికారంలో ఉన్నవారు అది శాశ్వతం కాదని ఒప్పుకోరు. అందుకే తప్పులు చేస్తారు, తిప్పలు పడుతుంటారు!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2021-09-12T05:46:31+05:30 IST