Advertisement
Advertisement
Abn logo
Advertisement

యువతిపై దుష్ప్రచారం.. పోలీసులపై బురద జల్లే ప్రయత్నం

హైదరాబాద్/బంజారాహిల్స్‌ : వ్యాపార ఒప్పందం కుదుర్చుకోలేదని ఓ కంపెనీ నిర్వాహకుడికి బెదిరింపు ఫోన్లు చేశాడు. అయినా దారికి రావడం లేదని అతడి కుమార్తెపై దుష్ప్రచారానికి తెరలేపాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్‌ పోలీసులు అక్రమంగా తనను అరెస్టు చేస్తున్నారని, వారి ద్వారా ప్రాణహానీ ఉందని సోషల్‌ మీడియాలో హై డ్రామాకు తెరలేపాడు. మాదాపూర్‌కు చెందిన అట్లూరి సురేష్‌ కొద్ది రోజుల క్రితం ఓ కంపెనీ నిర్వాహకుడిని కలిశాడు. ఓ వ్యాపారం గురించి చెప్పాడు. కంపెనీ నిర్వాహకుడు నిరాకరించాడు. తన ప్రతిపాదనను నిరాకరించాడని కసితో సురేష్‌ కంపెనీ నిర్వాహకుడిపై కక్ష పెంచుకున్నాడు. అర్ధరాత్రి సమయాల్లో ఆయనకు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. తర్వాత కంపెనీ నిర్వాహకుడి కుమార్తెపై దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ఆమెను దుర్భాషలాడుతూ మెసేజ్‌లు పంపేవాడు. 


కంపెనీ నిర్వాహకుడి బంధువులకు కూడా ఆమె గురించి చెడుగా మెసేజ్‌లు పెట్టేవాడు. విసిగిపోయిన బాధితులు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆధారాలు అందజేశారు. పోలీసులు సురేష్‌పై ఐపీసీ 354(డి), 389, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సురే్‌షను అరెస్టు చేయడానికి మాదాపూర్‌లోని అతడి నివాసానికి వెళ్లారు. సురేష్‌ లోపలే ఉండి ఇంటి బయటి నుంచి తాళం వేయించాడు. అనంతరం లాక్‌డౌన్‌ సమయంలో పోలీసులు కావాలని తనను అరెస్టు చేయడానికి వచ్చారని, వారి వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ ఓ వీడియో సోషల్‌ మీడియాలో పెట్టాడు. సురేష్‌ వ్యవహారంతో సుమారు 21 గంటల పాటు హైడ్రామా నడిచింది. చివరకు పోలీసులు సురే్‌షను గురువారం అరెస్టు చేశారు. సురేష్‌, అతడి భార్య గతంలో కూడా బంజారాహిల్స్‌ పోలీసులపై అసభ్య ఆరోపణలు చేస్తూ వీడియో పెట్టారు.

Advertisement
Advertisement