నాలుగు అంశాల్లో దుష్ప్రచారం..!

ABN , First Publish Date - 2022-06-29T05:28:19+05:30 IST

ఎలాంటి తప్పు చేయకపోయినా ప్రతిపక్ష టీడీపీతో కలిసి తనపై దుష్ప్రచారం చేసేందుకు కుట్ర పన్నారు. నాలుగు అంశాలలో నిరంతరం దుష్ప్రచారం చేస్తూ మనోవేదనకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి, ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాల కోఆర్డినేటర్‌ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు

నాలుగు అంశాల్లో దుష్ప్రచారం..!

మా అబ్బాయి ఏం తప్పుచేయలేదు

ఎక్కడో ఏదో జరిగితే నేను బాధ్యుడునా..?

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి 


ఒంగోలు(కలెక్టరేట్‌), జూన్‌ 28 : ఎలాంటి తప్పు చేయకపోయినా ప్రతిపక్ష టీడీపీతో కలిసి తనపై దుష్ప్రచారం చేసేందుకు కుట్ర పన్నారు. నాలుగు అంశాలలో నిరంతరం దుష్ప్రచారం చేస్తూ మనోవేదనకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి, ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాల కోఆర్డినేటర్‌ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలులోని ఏ1 కన్వెన్షన్‌ హాలులో మంగళవారం జరిగిన ఒంగోలు నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సమావేశానికి బాలినేని అఽధ్యక్షత వహించి మాట్లాడారు. అల్లూరుకు చెందిన కవితా అనే మహిళా ఎవరో తనకు తెలియదన్నారు. తాను ఆ గ్రామంలో గడపగడప కార్యక్రమం రోజునే ప్రతిపక్ష టీడీపీ నేతలతో కలిసి అక్కడకు వచ్చిందని, గొడవ చేసేందుకు ప్రయత్నిస్తుందని తనకు ముందుగానే సమాచారం ఉందని చెప్పారు. అయినా తాను ఏమి పట్టించుకోలేదన్నారు. కుటుంబ వ్యవహారాలను తనపై రుద్దేందుకు మా పార్టీలోని ఒక వ్యక్తితో కలిసి టీడీపీ వారు ఇటువంటి కుట్రలు చేశారని చెప్పారు. జనసేనకి చెందిన మహిళా నేతకు తాను మద్యం తాగి ఫోన్‌ చేసినట్లు ప్రచారం చేశారని, తాను టీ, కాఫీలే తాగనని అన్నారు. తాను తప్పు చేసినట్లు చూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని తెలిపారు. కానీ బాలినేని మంచోడే, వాళ్ల అబ్బాయే అంతా చేస్తున్నాడని మాట్లాడతారని, తన కుమారుడు ఏమి తప్పుచేశాడో ఒక్కటైనా చూపించగలరన్నారు. వచ్చే ఎన్నికల్లో మాగుంట కుటుంబం నుంచి ఎవరూ పోటీచేసినా తన మాదిరిగానే ఆశీర్వదించాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కోరారు. గిద్దలూరు నియోజకవర్గంలో జరుగుతున్న కుట్రలు కుంత్రాలను కూడా ఛేదిస్తామని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయని, దానిని కొంతమంది పెద్దవిగా చూసి చూపిస్తున్నారన్నారు. బాలినేనిపై ఏ విధంగా కుట్రలు చేస్తున్నారో తనపై కూడా అదేవిధంగా చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం ఎవరికి టిక్కెట్‌ ఇచ్చినా గిద్దలూరులో గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌, ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, మాజీమంత్రి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, మేయర్‌ గంగాడ సుజాత, అబ్జర్వర్‌ పిచ్చిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి అదెన్న, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి,  వైసీపీ నేతలు కాకుమాను రాజశేఖర్‌, పి మల్లికార్జునరెడ్డి, చుండూరి రవి, వేమూరి సూర్యనారాయణ, కఠారి శంకర్‌, గంటా రామానాయుడు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-29T05:28:19+05:30 IST