వ్యవసాయ ఉత్పత్తులపై లభించని రుణాలు

ABN , First Publish Date - 2022-08-12T06:08:11+05:30 IST

వ్యవసాయానికి, రైతుకు భరోసా ఇస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తున్నా.., వాస్తవ పరిస్థితుల్లో పరిస్థితి అందుకు భిన్నం గా ఉంది.

వ్యవసాయ ఉత్పత్తులపై లభించని రుణాలు

తక్కువ రేట్లకు అమ్ముకుని నష్టపోతున్న రైతులు

రైతులను గుల్ల చేస్తున్న ప్రైవేటు వడ్డీ వ్యాపారులు

నిరుపయోగంగా మార్కెట్‌ కమిటీలు

గిద్దలూరు, ఆగస్టు 11 : వ్యవసాయానికి, రైతుకు భరోసా ఇస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తున్నా.., వాస్తవ పరిస్థితుల్లో పరిస్థితి అందుకు భిన్నం గా ఉంది. రైతులు పండించిన పంటలపై  బ్యాంకుల ద్వారా ఇచ్చే రుణాలను నిలిపివేయడంతో మార్కెట్‌ మా యాజాలంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మూడేళ్ల గోడౌన్లలో నిల్వ ఉన్న రైతులకు రుణాలు ఇవ్వక పోవడంతో పంట పండిన వెంటనే ఉన్న ధరకు సరుకు ను తెగనమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం  గతంలో గోడన్లలోని వ్యవసాయోత్పత్తుకు స్వల్ప కాలానికి తక్కువ వడ్డీతో రుణాలిచ్చేది. ప్రైవేటు వ్యాపారులకు చెందిన నాన్‌ఏసీ, ఏసీ గోడౌన్లలో సరుకు నిలువ ఉంచుకుంటే వాటిని తనఖాగా ఉంచుకుని బ్యాంకర్ల ద్వారా రైతులకు రుణాలు లభించేవి. గిట్టుబాటు ధర వచ్చిన తరువాత రైతులు ఈ పంటలను అమ్ముకుని లాభం పొందేవారు. అయితే రైతుల ముసుగులో వ్యాపారులు గోడౌన్లలో పంటలను నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించి ధరలు బాగా పెరిగినపుడు అమ్ముకుని లబ్దిపొందుతున్నారన్న భావనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకర్ల ద్వారా రుణాలు ఇప్పించడం పూర్తిగా ఆపివేశాయి. గతంలో రెండు మూడు ఏళ్లపాటు పంటల ధరలు పెరగకపోవడంతో ఏసీ, నాన్‌ఏసీ గోడౌన్లలో తనఖాపై ఉంచిన వ్యవసాయ ఉత్పత్తులను బ్యాంకర్లు వేలం వేసినప్పటికీ రేట్లు తగ్గిపోయి అసలు, వడ్డీ కూడా సక్రమంగా రాక బ్యాంక్‌లు కూడా నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ ఉత్పత్తులను తనఖా ఉంచుకుని రుణాలు ఇవ్వడం మూడేళ్లగా నిలిపేశారు. మార్కెట్‌ కమిటీలలో డబ్బు ఉన్నప్పటికీ రైతు బంధు పథకం ద్వారా రుణాలు ఇవ్వడాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆపివేసింది. దీంతో రైతులు తాము పండించిన పంటను చేతికందగానే ఎంత రేటు ఉంటే అంత రేటుకు అమ్ముకుని నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ పంటను భద్రపరచుకోవాలంటే వారి ఇళ్లలో అంతస్థలం లేకపోవడం, పంటకు పురుగుపట్టకుండా మందుల పిచికారి ఇళ్లలో చేసుకోలేక పోవడం, తదితర కారణాలతో రైతులు  ఉన్న రేటుకే అమ్ముకుంటూ నష్టపోతున్నారు. ప్రభుత్వాలు పంట కొనుగోలు కార్యక్రమాన్ని మార్క్‌ఫెడ్‌ లాంటి సంస్థల ద్వారా అప్పుడప్పుడూ చేపట్టినా కొద్దిపంటకు మాత్రమే కొనుగోలు అవకాశం లభిస్తుండడంతో వ్యాపారులు సిండికేట్‌గా మారి రేట్లలో హెచ్చు తగ్గులు సృష్టిస్తున్నారు. దీంతో తక్కువ రేట్లకే పంటలను అమ్ముకుంటూ రైతులు నిలువునా మునిగిపోతున్నారు. 

రైతులపై ప్రైవేటు రుణాల వల

ఏసీ, నాన్‌ఏసీ గోడౌన్లలో నిలువ ఉంచుకునే పంటలకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వడం మానివేయడంతో ప్రైవేటు వ్యక్తులు రంగప్రవేశం చేశారు. తనఖా ఉంచిన ఫారాలను(బాండ్‌) ఈ ప్రైవేటు వ్యాపారులు తమ ఆధీనంలోకి తీసుకుని రూ.1 నుంచి రూ.2 వరకు వడ్డీకి రుణాలు ఇస్తున్నారు. మార్కాపురం డివిజన్‌లో చాలా గోడౌన్లలో యజమానులే అనధికారికంగా కోట్ల రూపాయల మేర వ్యవసాయ ఉత్పత్తుల తనఖా బాండ్లను ఉంచుకుని ఆ పూచీకత్తుపై అనధికారికంగా రుణాలు ఇస్తున్నారు. ఆ వ్యవసాయ ఉత్పత్తులను రైతులు లేదా వ్యాపారులు అమ్మిన సందర్భాలలో ముందుగా వీటికి అసలు, వడ్డీ చెల్లిస్తేనే తనఖా పెట్టిన బాండ్లు వె నక్కు ఇస్తారు. రేటు పడిపోతున్న సందర్భాలలో గోడౌన్ల యజమానులే బలవంతంగా పంటలను అమ్మివేసి వడ్డీ, ఇచ్చిన మొత్తం జమ చేసుకుంటున్నారు. బ్యాంకర్లు గతం లో పంటల గిట్టుబాటు ధరపై 75 శాతం మేర రుణాలు ఇస్తుండగా వ్యాపారులు మాత్రం 50 శాతానికి మించి రుణాలు ఇవ్వడం లేదు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల అభ్యున్నతి కోసం, రైతులు పండించిన ధాన్యాన్ని తనఖా పెట్టుకుని తక్కువ రేటుకు బ్యాంకర్ల ద్వారా రుణాలు ఇప్పిస్తే రైతులకు ఉపయుక్తంగా ఉం టుంది. గిట్టుబాటు ధర లభించిన సందర్భాలలో అమ్ముకుని చేసిన కష్టానికి ప్రతిఫలం పొందే అవకాశాన్ని రైతులకు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Updated Date - 2022-08-12T06:08:11+05:30 IST