ముంచేస్తున్న మొండి బకాయిలు

ABN , First Publish Date - 2020-07-19T06:18:21+05:30 IST

గత ఏడాది (2019)తో ముగిసిన ఆరేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.5,48,734 కోట్ల మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు-ఎన్‌పీఏ)ను రద్దు చేశాయి. ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (ఏఐబీఈఏ) డేటా ప్రకారం...

ముంచేస్తున్న మొండి బకాయిలు

  • ఆరేళ్లలో రూ.5.5 లక్షల కోట్లు 
  • రైటాఫ్‌ చేసిన  ప్రభుత్వ రంగ బ్యాంకులు
  • వెల్లడించిన ఏఐబీఈఏ 

గత ఏడాది (2019)తో ముగిసిన ఆరేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.5,48,734 కోట్ల మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు-ఎన్‌పీఏ)ను రద్దు చేశాయి. ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (ఏఐబీఈఏ) డేటా ప్రకారం.. అంతక్రితం ఆరేళ్లలో కొట్టేసిన ఎన్‌పీఏలతో పోలిస్తే 6 రెట్లు అధికం. 2008-13 మధ్యకాలంలో ప్రభుత్వ బ్యాంకులు రూ.86,528 కోట్ల మొండి పద్దులను రద్దు చేశాయి. ‘‘అన్ని బ్యాంకులతో పాటు ఆర్‌బీఐ నుంచి సేకరించిన గణాంకాలను విశ్లేషించడం జరిగింది. బ్యాంకులు ఎన్‌పీఏలను భారీగా రైటాఫ్‌ చేస్తూ వచ్చాయి. ఏటేటా భారీగా పెరుగుతూ వచ్చాయి. అందులో అధికభాగం కార్పొరేట్‌ రుణాలే’’నని ఏఐబీఈఏ జనరల్‌ సెక్రటరీ సీహెచ్‌ వెంకటాచలం అన్నారు. అంతిమంగా ఈ భారం మోయాల్సింది పన్ను చెల్లింపుదారులు, బ్యాంక్‌ ఖాతాదారులేనని ఆయన పేర్కొన్నారు. ఏఐబీఈఏ దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం. 




బ్యాంకుల్లో మొండి బకాయిల రద్దు నిత్యం జరిగే ప్రక్రియే. సాధారణ కార్యకలాపాల ద్వారా వసూలు కావని భావించే రాని బాకీలను బ్యాంకులు తమ ఖాతాల్లోంచి కొట్టేస్తాయి. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. బ్యాంకులు రైటాఫ్‌ చేయాలనుకున్న మొండిపద్దుకు ముందుగానే పూర్తి కేటాయింపులు చేపట్టాల్సి ఉంటుంది. అంటే, ఆ బకాయికి సమానమైన నిధులను పక్కన పెట్టాలి. గడిచిన దశాబ్ద కాలం (2010-19)లో బ్యాంకులు రూ.6.2 లక్షల కోట్ల ఎన్‌పీఏలను రైటాఫ్‌ చేశాయి. అంతక్రితం దశాబ్దం (2001-09)లో రైటా్‌ఫలు రూ.73,760 కోట్లుగా ఉన్నాయి. 




ఎస్‌బీఐలోనే అధికం

దేశంలోనే అతిపెద్ద బ్యాంకైన ఎస్‌బీఐ.. మొండి బకాయిల రద్దులోనూ అగ్రస్థానంలో ఉంది. గడిచిన నాలుగేళ్లలో ఎస్‌బీఐ రూ.1.79 లక్షల కోట్లు రైటాఫ్‌ చేసింది. అందులో రూ.52,387 కోట్ల బకాయిలను గత ఆర్థిక సంవత్సరం (2019-20)లోనే కొట్టివేసింది. 2018-19లో రూ.58,905 కోట్లు, 2017-18లో రూ.40,196 కోట్లు రైటాఫ్‌ చేసింది. 


కరోనా దెబ్బకు మళ్లీ జఠిలం

ప్రభుత్వ రంగ బ్యాంకులను మొండి బకాయిల సమస్య వదలనంటోంది. సమస్య పునరావృతమవుతోందే తప్ప అదుపులోకి రావడం లేదు. ఆర్థిక మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను కరోనా పూర్తిగా స్తంభింపజేసింది. గడిచిన 2-3 ఏళ్లలో కాస్త తగ్గుముఖం పట్టిన ఎన్‌పీఏల సమస్య.. కరోనా సంక్షోభంతో మళ్లీ జఠిలం కావచ్చని బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి. 2018 మార్చి చివరి నాటికి 11.6 శాతానికి ఎగబాకిన బ్యాంకింగ్‌ రంగ ఎన్‌పీఏలు.. 2020 మార్చి నాటికి 8.5 శాతానికి తగ్గాయి. కొవిడ్‌ ఎఫెక్ట్‌తో 2021 మార్చి నాటికి 13-14 శాతానికి పెరగవచ్చని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ఎస్‌ అండ్‌ పీ హెచ్చరించింది. కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో మొండి బకాయిల రికవరీ ఆశలూ సన్నగిల్లాయి. దీంతో మున్ముందు కాలంలో బ్యాంకులు మరిన్ని ఎన్‌పీఏలను రైటాఫ్‌ చేయాల్సి రావచ్చు. 


2,426 మంది.. రూ.1.47 లక్షల కోట్ల ఎగవేత 

ఈ నెల 19న బ్యాంకుల జాతీయీకరణ దినోత్సవం సందర్భంగా ఏఐబీఈఏ భారీగా రుణ ఎగవేతలకు పాల్పడిన వారి వివరాలు వెల్లడించింది. 17 ప్రభుత్వ రంగ బ్యాంకులకు 2,426 మంది రూ.1,47,350 కోట్లు ఎగవేసినట్లు తెలిపింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎ్‌సబీఐ) 685 మంది రూ.43,887 కోట్లు ఎగవేశారు. మరిన్ని వివరాలు.. 



మారటోరియంతో ముప్పు తగ్గేనా..? 

ప్రస్తుతం రుణగ్రహీతలకు ఆర్‌బీఐ కల్పించిన మారటోరియం (ఈఎంఐ చెల్లింపులకు విరామం) గడువు ఆగస్టు 31తో ముగియనుంది. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా దీన్ని డిసెంబరు చివరి వరకు పొడిగించాలని బ్యాంకర్ల నుంచి డిమాండ్‌ వ్యక్తమవుతోంది.  కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో కొన్ని రాష్ట్రాలు మళ్లీ లాక్‌డౌన్‌లు విధిస్తున్నాయి. మే నుంచి క్రమంగా తెరుచుకుంటూ వచ్చిన వ్యాపారాలు తత్ఫలితంగా మళ్లీ మూసివేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మారటోరియం గడువును పెంచకుంటే ఈఎంఐ డిఫాల్ట్‌లు ఒక్కసారిగా పెరగవచ్చని, చాలా రుణ ఖాతాలు మొండి బకాయిలుగా మారే ప్రమాదం ఉందని బ్యాంకింగ్‌ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మారటోరియాన్ని డిసెంబరు వరకు పొడిగిస్తే, రుణగ్రహీత డిఫాల్ట్‌ అయినప్పటికీ 2021 మార్చి ముగిశాకే ఆ రుణ ఖాతా రాని బాకీగా మారుతుందని, తద్వారా ఎన్‌పీఏ ప్రొవిజనింగ్‌కు కొంత సమయం లభిస్తుందని వారంటున్నారు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. డిఫాల్ట్‌ అయిన 90 రోజుల తర్వాత బ్యాంకులు ఆ రుణ ఖాతాను మొండిపద్దుల జాబితాలో చేరుస్తాయి.

Updated Date - 2020-07-19T06:18:21+05:30 IST