Jul 22 2021 @ 00:19AM

బ్యాక్‌ టు ఇండియా!

ప్రభాస్‌ ఇండియాకు వచ్చారు. హైదరాబాద్‌లో బుధవారం ఉదయం అడుగుపెట్టారు. కొన్ని రోజుల క్రితం ఆయన ఇటలీ వెళ్లారు. యూరప్‌ నేపథ్యంలో చేస్తున్న ‘రాధే శ్యామ్‌’ చిత్రీకరణ కోసమే వెళ్లారని వినిపించినా దర్శక-నిర్మాతలు అధికారికంగా ఏ విషయమూ చెప్పలేదు. ప్రభాస్‌ రాకతో ఆయనతో పనిచేస్తున్న ఇతర సినిమాల దర్శక-నిర్మాతలు చిత్రీకరణలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. బుధవారం ‘ఆదిపురుష్‌’ సెట్‌లో కెమెరాను ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో దర్శకుడు ఓం రౌత్‌ పోస్ట్‌ చేశారు. కొన్ని రోజులుగా ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. త్వరలో ప్రభాస్‌ కూడా పాల్గొంటారని సమాచారం. ఇప్పటివరకూ ఇతర నటీనటులపై సన్నివేశాలను తెరకెక్కించినట్టు తెలిసింది. ప్రభాస్‌, కృతీ ససన్‌పై ఈ నెలాఖరు నుంచి కీలక సన్నివేశాలను తెరకెక్కించడానికి ఓం రౌత్‌ సన్నాహాలు చేస్తున్నారట. ‘ఆదిపురుష్‌’ కాకుండా ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న మరో సినిమా ‘సలార్‌’ సైతం సెట్స్‌ మీదుంది. ‘ఆదిపురుష్‌’ తాజా షెడ్యూల్‌ పూర్తయిన తర్వాత ఆ సినిమా కొత్త షెడ్యూల్‌ మొదలు కానుందని తెలుస్తోంది.