బాచుపల్లి పోలీసులు.. మనసున్న మారాజులు

ABN , First Publish Date - 2020-03-29T19:51:46+05:30 IST

బాచుపల్లి: ఖాకీల కాఠిన్యం.. కనిపించని మానవత్వం.. ఇవి తరుచుగా వినిపించే మాటలు. కానీ ఆ

బాచుపల్లి పోలీసులు.. మనసున్న మారాజులు

బాచుపల్లి: ఖాకీల కాఠిన్యం.. కనిపించని మానవత్వం.. ఇవి పోలీసుల గురించి తరుచుగా వినిపించే మాటలు. కానీ ఆ ఖాకీ బట్టల వెనక ఉండే కరుణను కురిపించే హృదయాలను చాలా తక్కువ మందే చూస్తుంటారు. పోలీసుల్లోని మానవీయ కోణాన్ని చూసినప్పుడు సలాం కొట్టకుండా ఉండలేరు. విధి నిర్వహణలో ఎంత కఠినంగా ఉన్నా.. సాటి మనిషికి సాయం చేయడంలోనూ అంతే స్థాయిలో స్పందిస్తారు. ఆ కోవకు చెందిన వారే బాచుపల్లి పోలీసులు. వివరాల్లోకి వెళితే..   మెదక్ జిల్లాలోని కాజీపల్లి  పరిధిలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న శ్రీశైలం(45) గత వారం కల్తీ కల్లు తాగి కనిపించకుండా పోయాడు. ఇవాళ బాచుపల్లి పీఎస్ పరిధిలో అచేతనంగా కనిపించాడు. రేణుకా ఏల్లమ్మ కాలనీలో స్పృహలేని స్థితిలో ఉన్న అతన్ని స్థానికంగా ఉండే న్యాయవాది సురేశ్ చూశారు. వెంటనే బాచుపల్లి పోలీసులకు సమాచారమందించారు. దీంతో అక్కడికి చేరుకున్న సీఐ జగదీశ్వర్, ఇతర పోలీస్ సిబ్బంది శ్రీశైలాన్ని మేల్కొలిపి.. స్నానం చేయించారు. ఆ తర్వాత భోజనం అందించారు. అనంతరం వివరాలు కనుక్కొని కాజీపల్లిలోని కాంట్రాక్టర్ మాల్యాద్రికి కబురందించారు. 



ఇదిలా ఉంటే.. మరో ఘటనలో ఓ దివ్యాంగుడిని బాచుపల్లి సీఐ ఆదుకున్నారు. మియాపూర్‌లోని గుడిసెలలో నివాసం ఉండే హనుమంతుకు ఓ కాలు లేదు. దివ్యాంగుడైన హనుమంతు.. చిత్తుకాగితాలు సేకరిస్తూ జీవనం సాగిస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా తినడానికి తిండి లేని పరిస్థితి ఏర్పడింది. అతను బాచుపల్లిలో స్పృహ కోల్పోయి రోడ్డు మీద పడిపోయాడు. అతన్ని గమనించిన సీఐ జగదీశ్వర్ అండ్ టీమ్ మళ్లీ రంగంలోకి దిగారు. కడుపు నిండా అన్నం పెట్టి..  ఓ‌ ప్రైవేటు వాహనంలో మియాపూర్‌కు తరలించారు. పోలీసుల ఔన్నత్యాన్ని పలువురు అభినందిస్తున్నారు. మరికొందరు తాము సైతం అంటూ ముందుకు వస్తున్నారు. పలువురిలో స్ఫూర్తి నింపుతున్న సీఐ జగదీశ్వర్ అండ్ టీమ్‌కు హ్యాట్సాఫ్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 

Updated Date - 2020-03-29T19:51:46+05:30 IST