Abn logo
Dec 1 2020 @ 03:14AM

బీఏసీ భేటీలో.. మాటల తూటాలు

కరోనావల్లే సమావేశాల కుదింపు: జగన్‌

పెద్ద పెద్ద ర్యాలీలు చేసినప్పుడు గుర్తులేదా: అచ్చెన్న

సమావేశాలు ఐదు రోజులు జరపాలని నిర్ణయం


అమరావతి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ సభా వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశంలో అధికార... ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి... టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమావేశాల అజెండా ఖరారు నిమిత్తం స్పీకర్‌ తమ్మినేని సీతారాం చాంబర్లో సోమవారం ఈ సమావేశం జరిగింది. అధికార పక్షం తరపున సీఎం, సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మంత్రి కన్నబాబు, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, టీడీపీ తరపున అచ్చెన్నాయుడు హాజరయ్యారు. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై చర్చ నడిచింది. కరోనా కారణంగా ఎక్కువ రోజులు నిర్వహించలే మని సీఎం, మంత్రులు అన్నప్పుడు... అచ్చెన్న వారి వాదనలను తిప్పికొట్టారు.


వరదలతోపాటు ఇసుక కొరతపైనా చర్చించాలని కోరారు. ఇసుక కొరత తీవ్రంగా ఉండి దానిపై ఆధారపడిన కూలీలు బాగా దెబ్బతిన్నారని.. మచిలీపట్నం, విశాఖలో మంత్రులపై దాడులు కూడా జరిగాయని చెప్పారు. మంత్రి పేర్ని నానిపై టీడీపీ వ్యక్తి దాడి చేశారని, అది రాజకీయ దాడి అని సీఎం ఆరోపించారు. దాడి చేసిన వ్యక్తి తన అనుచరుడేనని మంత్రి స్వయంగా చెప్పారని, ఇసుక కొరతతో పనులు దొరక్క దాడి చేశానని ఆ వ్యక్తి చెప్పాడని అచ్చెన్న పేర్కొన్నారు. అదంతా టీడీపీ స్ర్కిప్ట్‌ అని సీఎం వ్యాఖ్యానించారు. వరదలపై టీడీపీ కోరిక మేరకే అసెంబ్లీలో తొలి రోజు చర్చ చేపడుతున్నామని చెప్పారు. అసెంబ్లీలో వరదలపై చర్చ ఉంటుందని తెల్లవారుజామునే సీఎం టీవీలో చెప్పారని, నిర్ణయం ముందే తీసుకుని ఇప్పుడు తమను ఉబ్బించే ప్రయత్నం చేస్తున్నారని అచ్చెన్న అన్నారు. దళితులపై దాడుల అంశం కూడా చర్చించాలని కోరగా.. తమ ఎంపీ నందిగం సురేశ్‌, మంత్రి పేర్ని నాని వంటివారిపై టీడీపీ వారే దాడి చేశారని, మళ్లీ వారే దాడుల గురించి గగ్గోలు పెడుతున్నారని జగన్‌ విమర్శించారు. సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళపై అచ్చెన్న దాడి చేశారని, ఇంకా ఆయనేం మాట్లాడతారని సీఎం చెప్పారు. ఈ మాట ఇప్పటికి పదిసార్లు అన్నారని, చర్చ పెడితే అన్నీ బయటకు వస్తాయని, తానేమిటో జిల్లాలో అందరికీ తెలుసని అచ్చెన్న బదులిచ్చారు.


అసెంబ్లీ సమావేశాలకు రాకుండా కొన్ని మీడియా సంస్ధలపై ఆంక్షలు పెట్టారని, ఇదేం పద్ధతని అచ్చెన్న ప్రశ్నించారు. కొన్ని మీడియా సంస్థలు తప్పు చేశాయని, అందుకే వాటిని రానివ్వకూడదని స్పీకర్‌ నిర్ణయించారని జగన్‌ చెప్పారు. అచ్చెన్నాయుడు స్మార్ట్‌గా లావుగా బాగుంటాడని, అందుకే ఆయన్ను ఎక్కువ చూపిస్తుంటారని నవ్వుతూ అన్నారు.  కాగా, స్పీకర్‌కు, అచ్చెన్నకు మధ్య కూడా వాగ్వివాదం జరిగింది. తమకు మైక్‌ ఇచ్చి ఆ వెంటనే స్పీకర్‌ బెల్‌ కొట్టి మాట్లాడుతున్నారని.. తమను రెండు నిమిషాలైనా మాట్లాడనివ్వడం లేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. రాజకీయం చేయాలని చూస్తే తాను బెల్‌ కొట్టక తప్పదని స్పీకర్‌ చెప్పారు. చివరకు ఐదు రోజులపాటు సభను నడపాలని నిర్ణయించారు.


మీడియా పాయింట్‌పై మండలి బీఏసీలో చర్చ

అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్‌ను తొలగించడంపై శాసనమండలి బీఏసీ సమావేశంలో చర్చ జరిగింది. చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ చాంబర్లో జరిగిన ఈ భేటీలో.. మంగళవారం కల్లా దీనిని పునరుద్ధరించాలని అన్ని పార్టీల సభ్యులు పట్టుబట్టారు. కరోనా వల్ల తొలగించామని బుగ్గన ఇచ్చిన వివరణ వారిని సంతృప్తిపరచలేదు. మీడియాను అనుమతించడంపైనా చర్చ జరిగింది. దీనిపై తనకు సమాచారం లేదని, తెలుసుకుని చెబుతానని మంత్రి అన్నారు. 


ఎన్ని రోజులు!?

అచ్చెన్న: అనేక సమస్యలు చర్చించాల్సి ఉన్నందువల్ల అసెంబ్లీ సమావేశాలు 10రోజులు నిర్వహించాలి. 

సీఎం: కరోనా తీవ్రంగా ఉన్నందువల్ల ఎక్కువ రోజులు జరపలేకపోతున్నాం. 5 రోజులే జరపాలని నిర్ణయించాం. 

బుగ్గన: ఎమ్మెల్యేల్లో పెద్ద వయసువారు చాలా మంది ఉన్నారు కాబట్టే వారి ఆరోగ్యం దృష్ట్యా కుదించాం (ఏ వయసు వారు ఎంత మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారో జాబితాను చదివి వినిపించారు). 

అచ్చెన్న: అదే నిజమైతే ఈ మధ్య అన్ని నియోజకవర్గాల్లో పెద్ద పెద్ద ర్యాలీలు ఎలా జరిపారు? అప్పుడు కరోనా గుర్తుకు రాలేదా?

బుగ్గన: అధికారులు ఇబ్బంది పడుతున్నారు. వారి కోణంలో ఆలోచిస్తున్నాం.

అచ్చెన్న: ఆ మాట ముందే చెబితే బాగుండేది.

బుగ్గన: పార్లమెంటు సమావేశాలు, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను కూడా కుదించారు. నిబంధనల రీత్యా తప్పనిసరి కావడం వల్ల పెట్టాం తప్ప.. లేకపోతే అసెంబ్లీ సమావేశాలు పెట్టే పరిస్థితి కాదు.

కన్నబాబు: కరోనా ఉందని చంద్రబాబు కూడా హైదరాబాద్‌ నుంచి రావడానికి భయపడుతున్నారు.

అచ్చెన్న: కరోనా లేనప్పుడు కూడా అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్‌ హైదరాబాద్‌లోనే ఉన్నారు. మమ్మల్ని అనేముందు వెనక్కి తిరిగి చూసుకోవాలి.

స్పీకర్‌: జగన్‌ హైదరాబాద్‌లో ఉన్నా ఏ సమస్య వచ్చినా వెంటనే వచ్చేవారు. సమస్య ఎక్కడుంటే ఆయన అక్కడ ఉన్నారు.

అచ్చెన్న: మేం మాత్రం లేమా? ప్రతి సమస్యను మేం అందుకుంటున్నాం. పనిచేస్తున్నాం. ప్రజల్లోకి వెళ్తున్నాం. మేం బయటకు అడుగుపెడితే కేసులు పెట్టి మీరు వేధిస్తున్నారు. కేసులు మానేయండి.. ఏమిటో తెలుస్తుంది.

కన్నబాబు: మేం పెడుతున్న కేసుల కంటే టీడీపీ హయాంలో మాపై పెట్టిన కేసులు ఎక్కువ.

అచ్చెన్న: ఎవరి హయాంలో ఎన్ని కేసులు పెట్టారో లెక్కలు తీద్దాం. అవి చూస్తే విషయం తెలుస్తుంది.

Advertisement
Advertisement
Advertisement