వ్యాక్సిన్‌ వికటించి పసికందు మృతి ?

ABN , First Publish Date - 2022-07-04T05:12:30+05:30 IST

పుట్టిన మూడు నెలలకే ఆ పసికందుకు నూరేళ్లు నిం డాయి. వ్యాక్సిన్‌ వేయడంతో తమ బిడ్డ మృతిచెందిందిన తల్లిదండ్రులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వ్యాక్సిన్‌ వికటించి పసికందు మృతి ?
మృత్యువాతపడ్డ పసికందు

పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు

 వ్యాక్సిన్‌ కారణం కాకపోవచ్చన్న వైద్యులు

మనుబోలు, జూలై 3: పుట్టిన మూడు నెలలకే ఆ పసికందుకు నూరేళ్లు నిం డాయి. వ్యాక్సిన్‌ వేయడంతో తమ బిడ్డ మృతిచెందిందిన తల్లిదండ్రులు  ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యాక్సిన్‌ కారణం కాకపోవచ్చునని వైద్యులు చెబుతున్నారు. మండలంలోని గొట్లపాళెం గిరిజన కాలనీలో ఆదివారం వేకువన ఈ సంఘటన జరిగింది. పసికందు తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల కథనం మేరకు.. గొట్లపాళెం గిరిజన కాలనీలో నల్లి కోటయ్య, నరసమ్మ దంపతులు. వారికి బాబు, పాప. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. నరసమ్మకు మూడు నెలల క్రితం ఆడ బిడ్డ పుట్టింది. పాప బలహీనంగా ఉందని మొదటి నెలలో వైద్యసిబ్బంది వ్యాక్సిన్‌ వేయలేదు. రెండున్నరనెలలు కావడంతో వ్యాక్సిన్‌  వేయాలని శనివారం ఆశాకార్యకర్త, సచివాలయం  ఏఎన్‌ఎం కనకదుర్గ ఇంటికెళ్లారు. ఇంకా బలహీనంగా ఉన్నందున వ్యాక్సిన్‌ వేయొద్దని తల్లిదండ్రులు చెప్పారు.  వేయకపోతే ఆరోగ్య ఇబ్బందులు వస్తాయంటూ  పెంటా ఫస్ట్‌ డోసు పీసీవో, ఓపీవో, రోటా వ్యాక్సిన్లు వేశారు. పాప రాత్రికి వాంతులు, విరోచనాలు చేసుకుంది.  వేకువజామున పాలుతాగే సమయంలో గుటక  వేయలేదు.  భ యంతో తల్లిదండ్రులు 108కు సమాచారం ఇచ్చారు. వారు పాపను పరీక్షించి చనిపోయిందని నిర్ధారించారు. దాంతో తల్లిదండ్రులు తీవ్రంగా రోదించారు. వ్యాక్సిన్‌ వేయడం వల్లే పాప చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీందో ఎస్‌ఐ. ముత్యాలరావు కేసు నమోదు చేసుకుని పాపను శవపరీక్షకు గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పాప మృతిపై స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు సుబ్బరాజును వివరణ కోరగా పాప చనిపోవడానికి వ్యాక్సిన్‌ కారణం కాకపోవచ్చునని భావిస్తున్నామన్నారు. వ్యాక్సిన్‌ లోపమైతే 3నుంచి 4గంటల్లోనే తెలిసిపోతుందన్నారు.  పాలు గ్లాసు ద్వారా తాగించడం ద్వారా న్యూమోనియా యాస్ప్‌రేషన్‌ప్రభావం ఉండవచ్చునని తెలిపారు. పొట్టలో అవయవాల నమూనాలను ల్యాబ్‌కు పంపామని, పీఎం రిపోర్టులో పూర్తివివరాలు తెలియాల్సి ఉందని బదులిచ్చారు. 

Updated Date - 2022-07-04T05:12:30+05:30 IST