ముంబైకి బేబీ ఏబీ.. అన్‌సోల్డ్ ఆటగాళ్లు వీరే..

ABN , First Publish Date - 2022-02-13T02:12:39+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగావేలం కొనసాగుతోంది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజెల్‌వుడ్‌ను

ముంబైకి బేబీ ఏబీ.. అన్‌సోల్డ్ ఆటగాళ్లు వీరే..

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగావేలం కొనసాగుతోంది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజెల్‌వుడ్‌ను బెంగళూరు ఫ్రాంచైజీ రూ. 7.75 కోట్లకు కొనుగోలు చేసింది. హేజెల్‌వుడ్ గతేడాది చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడాడు. ఆస్ట్రేలియా తొలి టీ20 ప్రపంచకప్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. 


ఇంగ్లండ్ పేసర్ మార్క్‌వుడ్‌ కోసం లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ పోటీ పడగా లక్నో రూ. 7.5 కోట్లతో మార్క్‌వుడ్‌ను దక్కించుకుంది. టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ. 4.2 కోట్లకు సొంతం చేసుకుంది. శార్దూల్ ఠాకూర్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్ రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. శార్దూల్ కోసం పంజాబ్ కింగ్స్ పోటీ పడినప్పటికీ ఢిల్లీదే పైచేయి అయింది. అలాగే, బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను కూడా ఢిల్లీ కొనుగోలు చేసింది. అతడి కోసం ఢిల్లీ రూ. 2 కోట్లు వెచ్చించింది. ఈ లెఫ్టార్మ్ పేసర్ కోసం మరెవరూ పోటీ పడకపోవడం గమనార్హం. 


టీమిండియా లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఢిల్లీ కేపిటల్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. రాహుల్ చాహర్ కోసం ఢిల్లీ కేపటిల్స్, ముంబై ఇండియన్స్ పోటీ పడగా చివరికి పంజాబ్ కింగ్స్ రూ. 5.25 కోట్లకు లాగేసుకుంది. యుజ్వేంద్ర చాహల్‌ను ఈసారి కొత్త జట్టు సొంతం చేసుకుంది. గతంలో బెంగళూరుకు ఆడిన ఈ లెగ్‌స్పిన్నర్‌ను ఈసారి రాజస్థాన్ రాయల్స్ రూ. 6.5 కోట్లకు కొనుగోలు చేసింది. అండర్-19 జట్టు మాజీ కెప్టెన్ ప్రియం గార్గ్‌ను రూ. 20కు హైదరాబాద్ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. అన్‌క్యాప్‌డ్ ఆటగాడు అభినవ్ సదరంగానీని గుజరాత్ టైటాన్స్ రూ. 2.60 కోట్లకు కొనుగోలు చేసింది. 


బేబీ ఏబీ డెవాల్డ్ బ్రెవిస్ ముంబై ఇండియన్స్ జట్టులో చేరాడు. ముంబై అతడిని రూ. 3 కోట్లకు తీసుకుంది. అశ్విన్ హెబ్బార్‌ను ఢిల్లీ కేపిటల్స్ రూ. 20 లక్షలకు తీసుకోగా, అన్‌క్యాప్‌డ్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠీ కోసం హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ. 8.5 కోట్లు వెచ్చించింది. అస్సాం ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ. 3.8 కోట్లకు కొనుగోలు చేసింది.


అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే..

అఫ్ఘనిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ ముజీబుర్ రెహ్మాన్‌ను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇంగ్లండ్ క్రికెటర్ అదిల్ రషీద్‌ కూడా అన్‌సోల్డ్‌గానే మిగిలిపోయాడు. దక్షిణాఫ్రికా వెటరన్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ కూడా అమ్ముడుపోలేదు. గతంలో అతడు ప్రాతినిధ్యం వహించిన చెన్నై సూపర్ కింగ్స్‌ కూడా అతడిని తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు.


ఆస్ట్రేలియన్ స్పిన్నర్ ఆడం జంపాను కూడా ఎవరూ కొనుగోలు చేయలేదు. అమిత్ మిశ్రా కూడా అన్‌సోల్డ్‌గానే మిగిలిపోయాడు. రూ. 1.5 కోట్ల బేస్‌ప్రైస్‌లో ఉన్న మిశ్రాను తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అలాగే, రజత్ పటీదార్ కూడా ఇదే జాబితాలో మిగిలిపోయాడు.

Updated Date - 2022-02-13T02:12:39+05:30 IST