శిఖర్ ధవన్ రికార్డును బద్దలుగొట్టి.. ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించిన ఏబీడీ 2.0

ABN , First Publish Date - 2022-02-05T01:11:33+05:30 IST

జూనియర్ ఏబీగా, డివిలియర్స్ 2.0గా, బేబీ ఏబీగా, పేరు సంపాదించుకున్న దక్షిణాఫ్రికా యువ క్రికెటర్ డేవాల్డ్ బ్రెవిస్ తిరుగులేని..

శిఖర్ ధవన్ రికార్డును బద్దలుగొట్టి.. ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించిన ఏబీడీ 2.0

ట్రినిడాడ్: జూనియర్ ఏబీగా, డివిలియర్స్ 2.0గా, బేబీ ఏబీగా పేరు సంపాదించుకున్న దక్షిణాఫ్రికా యువ క్రికెటర్ డేవాల్డ్ బ్రెవిస్ తిరుగులేని ఆటతీరుతో క్రికెట్ ప్రపంచం దృష్టిని మరోమారు ఆకర్షించాడు. అండర్-19 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న బేబీ ఏబీ పరుగుల వరద పారిస్తున్నాడు. అండర్-19 ప్రపంచకప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ పేరిట ఉన్న రికార్డును బద్దలుగొట్టాడు. 


అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా ఏడో స్థానం కోసం గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత శతకంతో చెలరేగాడు. 130 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో 138 పరుగులు సాధించాడు. ఫలితంగా ఈ టోర్నీలో మొత్తంగా 84.33 సగటుతో 506 పరుగులు సాధించి ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సాధించిన యువ క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.


దీంతో ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ రెండో స్థానానికి దిగజారాడు. ధవన్ 2004 అండర్-19 ప్రపంచకప్‌లో 84.16 సగటుతో 505 పరుగులు చేశాడు. ఇప్పుడు బేబీ ఏబీ ఒకే ఒక్క పరుగు తేడాతో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. బ్రెవిస్ సాధించిన 506 పరుగుల్లో రెండు శతకాలు, మూడు అర్ధ శతకాలు ఉన్నాయి.


ఇక, ఈ జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన బ్రెట్ విలియమ్స్ 1988లో 52.33 సగటుతో 471 పరుగులు సాధించగా, ఆస్ట్రేలియాకే చెందిన కేమెరాన్ వైట్ 2002 ఎడిషన్‌లో 70.5 సగటుతో 423 పరుగులు, అదే ఎడిషన్‌లో డోనోవాన్ పాగన్ 70.16 సగటుతో 421 పరుగులు చేసి ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.


ఏబీడీకి పెద్ద బ్రెవిస్ పెద్ద అభిమాని కూడా. ఇద్దరూ ఒకే స్కూలుకు ఆడడం మరో విశేషం. ఆఫ్రికానీస్ హోయెర్ సీన్ స్కూల్ (ఆఫీస్)కు ఆడారు. ఏబీలానే బ్రెవిస్ కూడా 17వ నంబరు జెర్సీ ధరిస్తాడు. ఐపీఎల్ వేలం కోసం బీసీసీఐ ఇటీవల విడుదల చేసిన తుది జాబితాలో బేబీ ఏబీ కూడా చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడు మరో రికార్డు సాధించి ఫ్రాంచైజీల దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.

Updated Date - 2022-02-05T01:11:33+05:30 IST