West Bengal: బాబుల్ సుప్రియోకు మమత కేబినెట్‌లో మంత్రి పదవి దక్కే అవకాశం!

ABN , First Publish Date - 2022-08-03T02:29:10+05:30 IST

పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి మమత బెనర్జీ

West Bengal: బాబుల్ సుప్రియోకు మమత కేబినెట్‌లో మంత్రి పదవి దక్కే అవకాశం!

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి మమత బెనర్జీ (Mamata Banerjee) బుధవారం తన మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారు. తన మంత్రివర్గంలోకి యువ రక్తాన్ని ఎక్కించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. మాజీ బీజేపీ ఎంపీ, ప్రస్తుత టీఎంసీ నేత బాబుల్ సుప్రియో (Babul Supriyo)కు మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ మంత్రివర్గ విస్తరణలో పదవులు దక్కించుకునే అవకాశం ఉన్నవారిలో బాబుల్ సుప్రియోతోపాటు స్నేహశీష్ చక్రబర్తి, పార్థ భౌమిక్, ఉదయన్ గుహ, ప్రదీప్ మజుందార్, బిప్లబ్ రాయ్ చౌదరి, తజ్ముల్ హుస్సేన్, సత్యజిత్ బర్మన్ ఉన్నారు. ప్రస్తుతం సహాయ మంత్రిగా ఉన్న బిర్బహ హన్సదకు స్వతంత్ర హోదా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. 


ఎంతో విరక్తి... అంతలోనే... 

ఇదిలావుండగా, 2021 శాసన సభ ఎన్నికల్లో పరాజయం ఎదురవడంతో బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. తాను రాజకీయాల నుంచి వైదొలగుతానని ప్రకటించారు. లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే 2021 సెప్టెంబరులో టీఎంసీలో చేరారు. బల్లిగుంజే శాసన సభ నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి సుబ్రత ముఖర్జీ మరణించడంతో ఆ స్థానం నుంచి బాబుల్ పోటీ చేసి, విజయం సాధించారు. ఆయనకు మంత్రి పదవి లభిస్తుందని అప్పట్లోనే చాలా మంది జోస్యం చెప్పారు. 


టీఎంసీ సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ, యువ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని మమత బెనర్జీ కోరుకుంటున్నారని చెప్పారు. అందుకే యువ నేతలైన బాబుల్ సుప్రియో, భౌమిక్, చక్రబర్తి వంటివారిని చేర్చుకునే అవకాశం ఉందని తెలిపారు. 


Updated Date - 2022-08-03T02:29:10+05:30 IST