Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

నాకు విషం పెట్టాలని అనుకున్నవాడు.. నా కాళ్ల మీద పడి ఏడ్చాడు

twitter-iconwatsapp-iconfb-icon
నాకు విషం పెట్టాలని అనుకున్నవాడు.. నా కాళ్ల మీద పడి ఏడ్చాడు

మొద్దు ముక్కు, పిల్లి మీసం, బొగ్గు నలుపు.. చేతి సంచి పట్టుకుని హైదరాబాద్‌కు వచ్చిన ఒక మాజీ రెవెన్యూ ఉద్యోగికి ఇవే ఆస్తులు! ఎటువంటి బ్యాగ్‌గ్రౌండ్‌ లేకుండానే.. తనకంటూ ఒక పెద్ద కామిక్‌ స్టేడియాన్ని నిర్మించుకున్నాడతను. ఆ గ్రౌండ్‌లో తోటి కమెడియన్లతో కబడ్డీ ఆడాడు. గ్యాలరీలో కూర్చున్న ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచి.. ఆయాసం తెప్పించే వరకు వదల్లేదు. కొన్నాళ్లు నవ్వులకు స్మాల్‌ బ్రేక్‌ ఇచ్చి.. అదే గ్రౌండ్‌ను రాజకీయబరిగా మార్చుకుని.. మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా సీట్లో కూర్చుకున్న నటుడు ‘బాబుమోహన్‌’. ఆయన నటించిన సినిమాలను తల్చుకుంటే.. ఈ వేసవిలో అంతకంటే పెద్ద కామిక్‌ రిలీఫ్‌ మరొకటి ఉండదు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ.. 07-05-2017న ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమం కోసం.. బాబుమోహన్‌తో సంభాషించినప్పుడు.. కురిసిన నవ్వుల జల్లులు ఇవి..


ఆర్కే: రాజకీయ జీవితం బావుందా, సినిమా జీవితం బావుందా?

బాబుమోహన్‌: ఒకటి వెజిటేరియన్‌, మరొకటి నాన్‌-వెజిటేరియన్‌ అనుకుంటుంటా. వెజ్‌లో ఇష్టమైన వంటకాలు ఉన్నట్లే.. నాన్‌ వెజ్‌లోనూ ఇష్టమైన వంటకాలు ఉంటాయి. ఆ సమయంలో టేస్ట్‌ను బట్టి ఏదో ఒకటి.. వెజ్‌ లేదా నాన్‌వెజ్‌ అనుకుంటుంటా (నవ్వులు).

 

ఆర్కే: ఇంతకు ముందు చురుగ్గా ఉండేవారు.. ఇపుడు సైలెంట్‌గా ఉన్నారెందుకు..?

బాబుమోహన్‌: నా పెద్ద కొడుకు పోవటంతో సైలెంట్‌ అయ్యాను. ఆ సమయంలో జీవితం ఇక చాల్లే అనుకున్నా. సినిమాలో నటుడిగా ఓ వెలుగువెలిగాను, ప్రభుత్వ ఉద్యోగం చేశాను, మంత్రిగా చేశాను. అన్నీ అయిపోయాయి కదా.. ఈ జీవితం ఎందుకు.. చచ్చిపోతే మా బాబు దగ్గరికి పోవచ్చనిపించింది. చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలనిపించేది. ఎప్పుడూ తలుపులేసుకుని గదిలో ఉండేవాణ్ణి. ‘‘ఎంతో మందికి అన్నం పెట్టాను.. పెళ్లిళ్లు చేశాను.. సాయం చేశాను కదా!’’ అని ఓ రోజు అనిపించింది. దీంతో నేనెందుకు ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటూ.. ఒక రోజు తలుపులు తీసుకుని గది నుంచి బయటికొచ్చేశాను.

 

ఆర్కే: అలా ఎన్ని రోజులు గదిలో ఉన్నారు..?

బాబుమోహన్‌: గది నుంచి మూడునెలలు బయటికే రాలేదు. ఏడుస్తూ కూర్చుండేవాణ్ణి. లైట్లు కూడా వెలిగించేవాణ్ణి కాదు. ఈ జీవితం ఏందిరా అనిపించేది. ఇంట్లో ఎవరి గదిలో వారుండేవారు. ఓ రోజు బయటికొచ్చాను. మా ఇంటికి దగ్గరగా ఉండే ఈవీవీ సత్యనారాయణ గారు నన్నుచూసి పిలిచారు. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది కాబట్టి కాసేపు మాట్లాడాను. నన్ను చూశాక.. ‘‘నీకు ఇలాగైతే కుదరదు.. ‘ఎవడిగోలవాడిది’ షూటింగ్‌ ఉంది.. బ్యాంకాక్‌కు పోయి వద్దాం పదా’’ అన్నారు. అలా బ్యాంకాక్‌కు వెళ్లాం. అక్కడ సాయంత్రం ఆరింటికి షూటింగ్‌ ప్యాకప్‌ చెబుతూనే ‘ఉస్కో..’ అనేవారు ఈవీవీ. ఫిష్‌ తినటానికి వెళ్లేవాళ్లం. అదికూడా ఫుట్‌మసాజ్‌ చేయించుకుంటూ స్పూన్‌తో ఫిష్‌ తింటుంటే.. ఈవీవీగారు ‘బాబూ ఓకే కదా..’ అనేవారు. అలా బ్యాంకాక్‌లో 45 రోజులూ అదే పని. దీంతో మామూలు జీవితంలో కలిసిపోయాను. ఈ లోపల చిన్నబాబుకి పెళ్లి చేశాను. నేను షూటింగ్‌లతో అడపాదడపా బిజీగా ఉండేవాణ్ణి. ఆ లోపే ఎన్నికలు వచ్చాయి. నేనేమో డిప్రెషన్‌ వల్ల అంతకు ముందు నియోజకవర్గాల్లోకి వెళ్లలేదు. మళ్లీ జనాల్లోకి వెళ్లాలనుకున్నాను. నామినేషన్‌ వేయటానికి వెళ్లాను. పోటీకి నిల్చున్న ప్రత్యర్థి అందరినీ కొనేశాడు. దీంతో నాకు ఓటమి తప్పలేదు. ఇదేంటీ అనుకునేలోపే ఇంటికి మనమరాలు వచ్చింది. సరెండర్‌ అయిపోయా. ఆ మాయ అద్భుతం. మనవరాలి కేకలతో మా ఇంట్లో లైట్లు వెలిగాయి. వెలుతురు వచ్చేసింది. మా ఇంటి తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి.

 

ఆర్కే: అసలు సినిమాలకు ముందు మీరేం చేసేవారు..?

బాబుమోహన్‌: రెవిన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసేవాణ్ణి. వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు వారి మండలానికి రెవిన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశాను. ఉద్యోగంలో బిజీగా ఉన్నా నాటకాల్లో వేషాలు వేసేవాణ్ణి. మా ఆవిడ బిఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీస్‌ ఉద్యోగి. రోజూ ఆమె ‘‘మంచి ఉద్యోగం నీది. నాటకాలు వేసి జీవితం పాడు చేసుకుంటావా, కామెడీరాదు, కమేడియన్‌ అవుతావా.. నటుడిగా పనికొస్తావా?’’ అంటుండేది. నాటకాలు వేసి ఇంటికి వచ్చాక అదో యుద్ధంలేండి. పదిహేను రోజుల్లో ఆమె కోపం చల్లారిపోయేది. మళ్లీ ఈ లోపు నాటకం వచ్చేది. అలా రిహార్సల్స్‌కు ఎక్కువ వెళ్లేవాణ్ణి. అలసట వచ్చేది. ఆఫీసులో పని చాలా ఉందని చెప్పేవాణ్ణి. అయితే ఈ విషయం మా ఆవిడకి తెలిసిపోయింది. చుట్టాల దగ్గర పంచాయితీ పెట్టింది. ‘నాటకాలు వేయను’ అని ప్రమాణం చేయించింది. అలా రెండేళ్లపాటు నాటకాలు వేయలేదు. ఆ తర్వాత మా ఆవిడ హైదరాబాద్‌కి బదిలీ అయింది.

 

ఆర్కే: మరి, సినిమాల్లోకి ఎలా వచ్చారు?

బాబుమోహన్‌: కొన్నాళ్ల తర్వాత జీవితం ఏంటీ.. జీతం బస్‌ ఛార్జీలకే సరిపోతోంది అనిపించింది. భార్యతోనే కలిసి ఉంటే బావుంటుందని ఉద్యోగానికి లాంగ్‌ లీవ్‌ పెట్టి హైదరాబాద్‌కి వచ్చేశాను. సంవత్సరం తర్వాత ఓ రోజు హైదరాబాద్‌లోని సారథీ స్టూడియోకి ‘కోతలరాయుడు’ షూటింగ్‌కి వెళ్లాను. తెలీక చిరంజీవిగారి దగ్గరికెళ్లి ‘సార్‌.. ఈ సినిమాలో హీరో ఎవరు’ అని అడిగాను. ‘నేనే’ అన్నారాయన. ‘సార్‌.. సార్‌.. మీరు హ్యాండ్సమ్‌గా ఉన్నారు’ అన్నాను. ‘మీరేం చేస్తున్నారు’ అని చిరంజీవి గారు అడిగారు. ‘నేను రెవిన్యూ ఉద్యోగిని’ అంటూ పరిచయం చేసుకున్నా. ఆ సమయంలోనే ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు బదిలీపై వచ్చాను.

 

ఆర్కే: ఆ తరువాత నీ జీవితం ఎటు వెళ్లింది..?

బాబుమోహన్‌: అలాంటి టైమ్‌లో సెక్రటేరియట్‌, ఎల్‌ఐసీ, హైకోర్టు ఉద్యోగులు కలిసి ఓ నాటకాన్ని ప్లాన్‌ చేశారు. ఓ వేషం వేయమని నన్ను అడిగారు. రవీంద్రభారతిలో ఆ నాటకాన్ని ప్రదర్శించాం. రాఘవగారు నా నటనను చూశాక ‘ఓరినీ బండపడ.. అయ్యయ్య.. ఏమి యాక్టింగ్‌.. నీకాళ్లకు చక్రాలున్నాయా..’ అంటూ స్టేజ్‌పైనే నన్ను పొగిడారు. ఆ తర్వాత ‘మా సినిమాలో వేషం వేస్తావా’ అని అడిగారు. ‘వేస్తాను సార్‌’ అన్నాను. ఓ రోజు ఆఫీసుకు లీవ్‌ పెట్టి రాఘవగారి దగ్గరికి వెళ్లాను. అది ‘ఈ ప్రశ్నకు బదులేది’ షూటింగ్‌ స్పాట్‌. డైలాగ్‌ టెస్ట్‌ పెట్టారు దర్శకుడు. ఈ సినిమా అయ్యేలోపు రాజశేఖర్‌గారితో మంచి స్నేహం ఏర్పడింది. బావగారూ అని పిలుచుకునేవాళ్లం. ఆ తర్వాత రాఘవగారు, దర్శకుడికి మధ్య ఏవో గొడవలొచ్చి సినిమా ఆగిపోయింది. కోడిరామకృష్ణగారితో క్లైమాక్స్‌ చేయించాలని నిర్మాత అడిగారు. అలా ఆయన రష్‌ చూస్తున్నపుడు నన్ను చూశారు. పిలిపించి మాట్లాడారు. ఆ తర్వాత ‘ఆహుతి’ చిత్రంలో పుల్లయ్య క్యారెక్టర్‌ ఇచ్చారు. ఆ తర్వాత ‘అంకుశం’. ఆ సినిమా రిలీజ్‌ రోజున ఉద్యోగం చేస్తున్నా. మీరా టాకీస్‌ పక్కన మధ్యాహ్నం పూట డ్యూటీలో రేషన్‌ కార్డుల చెకప్‌ పనిలో పడ్డాను. ఒకడొచ్చి చూశాడు. మరొకడు వచ్చాడు ఆగి చూశాడు. ఇలా వందమంది దాకా వచ్చి గుమికూడారు. ఇందేంటని.. వెంటనే స్కూటర్‌పై ఆఫీసుకొచ్చి ‘డ్యూటీ చేయలేదు.. ఏమవుతుందో.. ఏమో’ అని తోటి ఉద్యోగులతో కంగారు పడ్డాను. ‘పిచ్చోడా.. నీ క్యారెక్టరైజేషన్‌ ఎంత బావుందో తెలుసా.. సినిమా సూపర్‌ హిట్‌’ అన్నారంతా. నాలో ఒకటే టెన్షన్‌తో కూడిన సంతోషం.

ఆర్కే : అప్పటి నుంచి సినిమాల్లో అవకాశాలు వచ్చాయా?

బాబూమోహన్‌: వారం తిరిగే లోపు పది చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. తొమ్మిది చిత్రాలకు డేట్స్‌ ఇచ్చాను. దాసరిగారు సినిమాకి డేట్స్‌ అడిగించారు. లేవన్నాను. దీంతో ఆయన పిలిపించారు. ‘ఏంటి నీ సమస్య..’ అని అడిగారు. ‘సార్‌.. తొమ్మిది సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. డైరీలో రాసుకున్నా సార్‌’ అని భయపడుతూ చెప్పా.


 ‘రోయ్‌.. నిన్నటిదాకా నీకు సినిమా కావాలి. ఇవాళ సినిమా ఇండస్ట్రీకి నువ్వు కావాలిరోయ్‌. ఆ ప్లేస్‌కి వచ్చావు. కనుక నువ్వు ఇచ్చినయే డేట్స్‌ ఉంటాయి. ఆ టైమ్‌కే షూటింగ్‌ ఉంటుంది’ అన్నారాయన. ఇలాకాదు.. నీ డైరీ అందుకో నేను చెబుతానని నవ్వారు. నాకు మూడు రోజులు డేట్స్‌ ఇస్తావా అన్నారు. గురువుగారు డేట్స్‌ ఎలా ఇవ్వాలో ట్రిక్స్‌ చెప్పారు. ముప్ఫై సినిమాల తర్వాత ‘బొబ్బిలిరాజా’ వచ్చింది. అందులో కోట శ్రీనివాసరావుగారితో కలిసి నటించే అవకాశం వచ్చింది. ఆయన తిడతాడని.. తనకి పోటీగా నటిస్తే అంతేనని.. లాంటి మాటలు వినటం వల్ల కాస్త భయపడ్డాను. షూటింగ్‌లోకి వెళ్తూనే కోటగారు ఓ చూపు చూశారు. దర్శకుడు బి.గోపాల్‌గారి దగ్గరికి వెళ్లి ‘అన్నా తిడతాడేమో కోటన్న’ అని చెప్పాను. నాతో కోటాగారు మాట్లాడేతీరును వాణిశ్రీగారు గమనించారు. ‘అతను నిన్ను టీజ్‌ చేస్తున్నాడు కదా’ అని అడిగిందామె. వెంటనే కోటా దగ్గరికి వెళ్లి అలా భయపడిస్తే ఎలా అని అడిగింది. అప్పటి నుంచీ కోటన్న ఏమీ అనలేదు. నాకు భయం పోయింది. బి.గోపాల్‌ గారు కలిసి డబ్బింగ్‌ చెప్పమన్నారు. మాది ఖమ్మం కదా.. భాష మిక్చర్‌గా ఉంటుంది. ఆ డబ్బింగ్‌ దగ్గర క్లోజయ్యాను. కోటాకు నేను పోటీ కాదని అర్థమైంది. ‘మామగారు’ చిత్రంతో ఇద్దరం బెస్ట్‌ పెయిర్‌ అయ్యాం. మాది హిట్‌ కాంబినేషన్‌ అయ్యింది. రేలంగి, రమణారెడ్డిగారిలాగా మా జోడీ కుదిరింది.

 

ఆర్కే: మొదటి చిత్రానికి రెమ్యునరేషన్‌ ఇచ్చారా..?

బాబుమోహన్‌: అవకాశం వచ్చిందే చాలనుకున్నా. డబ్బులేమీ ఇవ్వలేదు. ఓ చిన్నపాత్ర నిడివిని పెంచారని ‘ఆహుతి’ చిత్రానికి కూడా డబ్బులు తీసుకోలేదు. ‘బొబ్బిలిరాజా’ చిత్రానికి సురేష్‌ ప్రొడక్షన్‌వారు పదిహేనువేల చెక్‌ ఇచ్చారు. దాన్ని బ్యాంక్‌లో వేయకుండా రోజూ చూసుకుని మురిసిపోయేవాణ్ణి.

 

ఆర్కే: మీరు సౌందర్యతో డ్యాన్సులు వేశారు కదా..

బాబుమోహన్‌: అదంతా బాగా చెప్పాలంటే.. రెండు, మూడు ఎపిసోడ్లు కావాలి (నవ్వులు). అచ్చిరెడ్డి, క్రిష్ణారెడ్డి ఓ రోజున నా దగ్గరికి వచ్చి.. ‘‘కొంత షూటింగ్‌ మిగిలి ఉంది బాబూమోహన్‌.. రేపు మార్నింగ్‌ ఫ్లయిట్‌కి షూటింగ్‌ వచ్చేయ్‌’ అని వెళ్లిపోయారు. అక్కడికి వెళితే షూటింగ్‌లో ఒకటే కోలాహలం. వెళ్లగానే అర్జంట్‌గా మేకప్‌ వేసుకోమన్నారు. లోపలికి వెళ్లేటపుడు బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్‌ గారు.. ఇలా అందరినీ విష్‌ చేశాను. ఏంటో అన్నట్లు అందరూ చూశారంతే! ‘సౌండ్‌..’ అన్నారు. సౌందర్యతో డ్యాన్సు. ‘ఈడు సౌందర్యతో డ్యాన్సులేంటీ.. చూద్దాం’ అని అందరూ అనుకున్నారు. ఫస్ట్‌ షాట్‌ ఓకే. త్వరగా సెకండ్‌ షాట్‌ కూడా ఓకే అయ్యింది.

 

ఆర్కే: అప్పట్లో సినిమాల్లో ఉచ్చదశకు వెళ్లారు. ఆ ప్రయాణంలో అవమానాలు, చీత్కారాలు ఎదురయ్యాయా?

బాబూమోహన్‌: ఎక్కడా ఎదురవ్వలేదు. నేను అందరికీ అన్ని సినిమాల్లో చేశాను కదా! సినిమాకు ఇంతే ఇవ్వాలని డిమాండ్‌ చేసే వాణ్ణి కాదు. ఎంత అడ్వాన్స్‌ ఇస్తే అంత తీసుకోవడం.. నటించడం అంతే నా పని. కొందరు షూటింగ్‌కు రాగానే ఇస్తామనేవాళ్లు. మొదటి ఇన్‌స్టాల్‌మెంట్లు వచ్చేవి. ఆ తరువాతవి వచ్చేవి కావు. డబ్బింగ్‌ చెప్పేటప్పుడు అడిగేవాణ్ణి. వాళ్లు ఏవో సినిమా కష్టాలు చెప్పేవాళ్లు. వదిలేసేవాణ్ణి. అలా ఒక సినిమా నుంచి మరో సినిమాకు వెళ్లిపోయేవాణ్ణి. నా సినిమా ప్రయాణం అలాగే జరిగిపోయింది.

 

ఆర్కే: ఎగవేతకు గురైన డబ్బు ఎంత ఉండొచ్చు?

బాబూమోహన్‌: నేను సినిమాల్లో తీసుకున్నది పాతిక శాతమే! మిగిలిన 75 శాతం డబ్బులు రాలేదు. నేను కూడా పట్టించుకోలేదు. నాకు ఇచ్చిన చెక్కులు తోరణాలు కనక కడితే.. హైదరాబాద్‌ చుట్టూ కట్టొచ్చు. అవన్నీ బౌన్స్‌ అయిన చెక్కులు.. (నవ్వుతూ). నేను మంత్రి అయ్యే వరకు ఇంట్లో ఉండేవి. బేగంపేట నుంచి ఫిల్మ్‌నగర్‌కు షిప్ట్‌ అయినప్పుడు.. ఆ చెల్లని చెక్కులన్నీ పడేశాను.

ఆర్కే: చంద్రబాబు టైమ్‌లో మంత్రిగా చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో మంత్రిగా చేయాలని లేదా?

బాబూమోహన్‌ : ఇచ్చినా ఫర్వాలేదు, ఇవ్వకపోయినా ఫర్వాలేదు. నా పొలిటికల్‌ జీవితంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలైంది. ఏమి చేయాలో దిక్కు తెలియనప్పుడు.. కేసీఆర్‌గారు పిలిచి.. టికెట్‌ ఇచ్చారు. గెలిచాను. అది చాలు. ఆ జిల్లా నుంచే ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్నారు. నేను మంత్రి పదవి ఆశించడమే తప్పు.


ఆర్కే: జీవితంలో మీకు మిగిలిపోయిన అసంతృప్తులు ఏమైనా ఉన్నాయా?

బాబూమోహన్‌: ఉద్యోగిగా టాప్‌కు వెళ్లాను.ఇప్పటికి డిప్యూటీ కలెక్టర్‌ అయ్యేవాణ్ణి. ఇప్పుడున్నట్లు జిల్లాలు ఉంటే జాయింట్‌ కలెక్టర్‌ కూడా అయ్యేవాణ్ణి. సినిమా యాక్టర్‌గా చాలా సినిమాలు చేశాను. కామెడీలో టాప్‌కు వెళ్లాను. రాజకీయాల్లోకి వచ్చి మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి కేబినెట్‌ మంత్రిగా చేసే అవకాశం వచ్చింది. ఇంతకంటే ఏం కావాలి? ఇంకా పైకి పోవాలని నిచ్చెనలు వేసుకుంటూ వెళితే.. నిచ్చెన పడిపోద్ది (నవ్వుతూ).

 

ఆర్కే : మీ సినిమా, రాజకీయ జీవితం మీద కలిగిన భావనను ఒక్క వాక్యంలో చెప్పండి..?

బాబూమోహన్‌: దేవునికి నా మీద ఎంతో ప్రేమ ఉండబట్టే నన్ను ఆశీర్వదించాడేమో అనిపిస్తుంది.

 

ఆర్కే: మీ నాన్న ఏం చేసేవారు?

బాబూమోహన్‌: నాన్న ఓల్డ్‌ బీఏ. అప్పట్లో టీచర్‌. ముప్పయి ఎకరాల పొలం ఉండేది. ఎడ్లబండ్లలో ఇంటికి ధాన్యం వచ్చేవి. అమ్మ ప్రతి రోజు వెన్న పెట్టేది. అది తిని స్కూలుకు వెళ్లేవాణ్ణి. అప్పట్లోనే నాన్న మంచి ఇంగ్లీషు మాట్లాడేవారు. ఆయనకు ఒక సూట్‌ కూడా ఉండేది. మూడో తరగతిలో ఉన్నప్పుడే అమ్మ చనిపోయింది. నన్ను, చెల్లిని నాన్న చూసుకున్నాడు. అమ్మ చనిపోయిన వెంటనే ఆయన మానసికంగా అప్‌సెట్‌ అయ్యారు. నాన్న ఇల్లు వదిలేసి వెళ్లిపోయాడు. ఆయన ఎక్కడ ఉండేవాడో తెలిసేది కాదు. నేనే చిన్నప్పుడు జావ చేసి.. చెల్లికి ఇచ్చేదాన్ని. ఒక రోజు నాన్న ఇంటికి వచ్చి.. ‘‘ఒరే మనం ఇక్కడ ఉండొద్దు. ఖమ్మం వెళ్లిపోదాం’’ అన్నారు. దాంతో ఖమ్మం వచ్చేశాం. నాన్న ఏడాది పాటు ఉద్యోగానికి పోలేదు. నేను ఏడో తరగతికి వచ్చేశాక.. కొంత సెటిల్‌ అయ్యాం. డిగ్రీ పూర్తి చేశాను. డిగ్రీలో ఉన్నప్పుడు లవ్‌ చేసి పెళ్లి చేసుకున్నాను. కాకతీయ విశ్వవిద్యాలయంలో పీజీ చేశాక.. ఉద్యోగం వచ్చింది. ఆ తరువాత హైదరాబాద్‌ రావడం.. ఇక్కడ యాక్టర్‌ కావడం.. ఆ వెంటనే రాజకీయ జీవితం మొదలవ్వడం.. ఇలా సాగింది నా ప్రయాణం.

 

ఆర్కే: మళ్లీ మంత్రి కావాలని ఉందా?

బాబూమోహన్‌: అలాంటి ఆశే లేదు. కేసీఆర్‌గారు నాకు గాడ్‌ఫాదర్‌. ఇక, నాకు ఎందుకు మంత్రి పదవి చెప్పండి. ప్రస్తుతం - ప్రశాంత జీవితాన్ని కోరుకుంటున్నాను. అంతకుమించి ఏ కోరికా లేదు.

 

ఆర్కే: జీవితంలో మీకు ప్రశాంతత కలగాలని ఆశిద్దాం. 

--------------------------------------------- 

నాకు భరణి పాన్‌ను అలవాటు చేశారు. అది అలాగే అలవాటు అయిపోయింది. షూటింగ్‌కు వెళ్లేటప్పుడు.. ఒక డబ్బాలో పాన్‌లు తీసుకెళ్లేవాణ్ణి. మంత్రి అయిన తరువాత చంద్రబాబుగారి వద్దకు వెళ్లినప్పుడు కూడా పాన్‌ తింటూనే వెళ్లడం అలవాటైంది. రోజుకు ఇరవై ముప్పయి తినేవాణ్ణి. ఒక ఎస్పీ నాకు చెప్పాడోసారి.. ‘‘ఫలానా పాన్‌షాపులోనే మీరు పాన్‌ కొంటారట కదా! ఇప్పుడు మీరు మంత్రి కదా! ఎవరైనా ఏమైనా ఆ పాన్‌లో విషం పెడితే.. మీకు ఇబ్బంది కావొచ్చు’’ అన్నారు. దాంతో ఆ షాప్‌లో పాన్‌ కొనడం మానేశాను. ఆ తరువాత తెలిసింది.. నిజంగానే కొందరు పాన్‌లో ఏదో పెట్టాలని ప్రయత్నం చేశారని.. తెలిసింది. ఎవడైతే నాకు విషం పెట్టాలని అనుకున్నాడో.. వాడు నా కాళ్ల మీద పడి ఏడ్చాడు. ప్రత్యేర్థులే ఈ పని చేశారని.. అతన్ని వదిలేశాను.

 

ఇప్పటికీ నన్ను రాజకీయనాయకునిగా కంటే.. సినిమాల్లో హాస్య నటునిగానే జనాలు గుర్తుపెట్టుకుంటున్నారు. నేను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి.. ఎన్నేళ్లు అయ్యిందో లెక్కపెట్టుకున్నాను. నా రాజకీయ జీవితం ఇప్పటికే 23 ఏళ్లు పూర్తి చేసుకుంది. నాకే ఆశ్చర్యం వేసింది.

 

మూడు వర్గాల ప్రజలు ఉంటారని అర్థమైంది. ఒక వర్గం ఎంత డబ్బు ఖర్చు చేసైనా సరే.. ఎంత పెద్ద పనినైనా చేయించుకోగలుగుతారు. ఆ వర్గానికి ఏ పార్టీ ఉన్నా ఒక్కటే. డబ్బు పని చేసి పెడుతుంది. మరో వర్గం - ఎలాంటి పనినైనా .. రెకమెండేషన్‌తో చక్కబెట్టుకుంటారు. మూడో వర్గం - మధ్యతరగతి. ఈ వర్గం డబ్బులు పెట్టలేక.. రెకమెండేషన్‌ చేయించుకోలేక.. పని అవ్వక దిక్కులు చూస్తుంటుంది. అందుకే నేను పేదవాళ్ల పని మీదే ఫోకస్‌ పెట్టాను. ఆఫీసర్లను అడిగి.. పనులు చేయించగలిగాను.

 

నా భార్య హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి దుబాయ్‌ వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు నన్ను ఢిల్లీ దాకా రమ్మని అడిగింది. ‘సినిమా యాక్టర్‌ అయినప్పుడే ఫ్లయిట్‌ ఎక్కుతా’ అని చెప్పాను. మా ఆవిడేమో ‘సినిమా అవకాశం నీకు నడిచి వస్తుంది’ అని విసురుగా అంది. ఢిల్లీకి నేను రాలేదని.. హైదరాబాద్‌లో ఫ్లయిట్‌ ఎక్కడానికి వెళ్లే సమయంలో తను చాలా ఫీల్‌ అయింది.

 

ఖమ్మంలో వేణూ స్టూడియో ఉండేది.. అందులో స్టార్డమ్‌ ఉండే ఫొటోల దగ్గర నా ఫొటో పెట్టించాను. అది సిగరెట్‌ తాగుతుండే లుక్‌. సిగరెట్‌తో ఫొటో దిగిన ఆ ఫొటోను చూసి మా అత్తగారు ఒకటే గొడవ. ఎంతైనా సిగరెట్‌ తాగటం నేరం కదా ఆరోజుల్లో. ఈ ఫోజు ఇచ్చిన ఫొటో ‘కాబోయే నటుడు.. వర్ధమాన నటుడు’ అని పేపర్‌లో వచ్చింది. దీంతో ఆ ఫొటోను చూసి అత్తింటివారు బాధపడి.. ఆ తర్వాత నన్ను ఏకిపడేశారు. అయినా సిగరెట్‌ మానలేదు (నవ్వులు).

 

‘ఆహుతి’ చిత్రానికి చైన్నెకి వెళ్లాల్సి వచ్చింది. ఫ్లయిట్‌ టికెట్‌ పంపించారు ప్రొడక్షన్‌వారు. ఆశ్చర్యపోయాను. సరదాగా చిన్నప్పటి నుంచీ ‘యాక్టర్‌ అయితేనే ఫ్లయిట్‌ ఎక్కుతా’ అనేమాట నిజమైందని సంతోషడ్డాను.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

సినీ ప్రముఖులుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.