Abn logo
Sep 20 2021 @ 16:37PM

కళ్లముందే రూ.1448 కోట్లు కనిపిస్తున్నా వాడుకోలేని పరిస్థితి.. 74 ఏళ్ల వృద్ధుడికి వింత కష్టం.. ఎడతెగని పోరాటం..!

ఇంటర్నెట్ డెస్క్: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 1448 కోట్ల రూపాయల ఆస్తికి ఆయన ఓనర్ . కానీ అందులో ఒక్క రూపాయిని కూడా తాకలేరు.. చూడలేరు.  ఇటువంటి విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్న ఆయన పేరు బాబూ జార్జ్ వలావీ(74). ఆయన కేరళలోని కొచ్చి నగర వాస్తవ్యుడు. రియల్ ఎస్టేట్ ఆస్తులను ఒకరికి తెలియకుండా మరొకరు కొనడం చివరికి కోర్టుకు వెళ్లడం మనం చూశాం. వీటితో సరితూగే ఘటన ఒకటి ఓ కంపెనీ విషయంలోనూ జరిగింది. ఫలితం.. వందల కోట్ల విలువైన షేర్లకు జార్జ్ హక్కుదారైనప్పటికీ.. ఆ ఆస్తిని దక్కించుకోలేని స్తితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కొన్నాళ్ల క్రితం వరకూ తన పేర ఇంత ఆస్తి ఉందని ఆయనకే తెలీదు. తెలిసిన తరువాత.. ఆ ఆస్తిని సొంతం చేసుకుందామనుకుంటే జార్జ్‌కు ఊహించని అడ్డంకులు ఎదురయ్యాయి. నమ్మశక్యం కానీ ఈ కథ..1978లో ప్రారంభమైంది.  

అప్పట్లో జార్జ్ మేవార్ ఆయిల్ అండ్ జెనరల్ మిల్స్ లిమిటెడ్ అనే సంస్థకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించే వారు. అది అన్‌లిస్టెడ్ కంపెనీ. అంటే కంపెనీ స్టాక్ మార్కెట్లో నమోదు కాలేదు. ఉదయ్‌పూర్‌ కేంద్రంగా కంపెనీ తన కార్యకలాపాలు నిర్వహించేది. ఇక జార్జ్‌కి కంపెనీ అధినేత పీపీ సింఘాల్‌తో స్నేహం కూడా ఉండేది. ఈ స్నేహం కారణంగానే..ఆయన కంపెనీలో 3500 షేర్లను కొన్నారు. ఇది అప్పటి కంపెనీ విలువలో దాదాపు 2.8 శాతానికి సమానం. షేర్లు కొన్నారన్న మాటే గానీ..జార్జ్‌కు కంపెనీ నుంచి డివిడెంట్ రూపంలో చిల్లి గవ్వ కూడా అందలేదు.  ఇక ఆ సంస్థ స్టాక్ మార్కెట్‌లో అప్పటికి ఇంకా లిస్ట్ కూడా కాకపోవడంతో జార్జ్ కాలక్రమంలో తన వద్ద ఉన్న షేర్ల గురించి..ఆ కంపెనీ గురించీ పూర్తిగా మర్చిపోయారు.

ఓ రోజు పాత దస్తావేజులేవో చూస్తుంటే ఆ షేర్ల తాలుకు డాక్యుమెంట్లపై జార్జ్ దృష్టి పడింది. దీంతో..నాటి కంపెనీ ఇప్పుడేం చేస్తోందో తెలుసుకుందామనే కుతూహలం జార్జ్‌కి కలిగింది. ఈ క్రమంలో బయటపడ్డ వాస్తవాలను చూసి ఆయన ఒక్కసారిగా షాకైపోయారు. కాలక్రమంలో నాటి కంపెనీ తన పేరు మార్చుకుని పీఐ ఇండస్ట్రీస్‌గా కొత్త ప్రయాణం ప్రారంభించింది. స్టాక్ మార్కెట్లో కూడా లిస్టైంది. అంతేకాదు.. అద్భుతమైన లాభాలూ గడిస్తూ మంచి స్థితిలో ఉంది. కంపెనీ ప్రస్తుత స్థితి ప్రకారం చూస్తే.. జార్జ్ వద్ద ఉన్న షేర్ల విలువ ఏకంగా 1448 కోట్లు. ఆయన జీవితంలో ఎన్నడూ ఊహించలేని మొత్తం ఇది. 

జార్జ్ తొలుత తన షేర్లను డిమ్యాట్ రూపంలో మార్చేందుకు ఓ ఏజెన్సీని సంప్రదించారు. కానీ..ఆ ఏజెన్సీ మాత్రం నేరుగా పీఐ ఇండస్ట్రీస్‌నే సంప్రదించాలని సూచించింది. ఆ తరువాత.. పీఐ నిర్వహకులను కలిసిన జార్జ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ షేర్లు తనవి కాదని, 1989లోనే అవి ఇతరులకు బదిలీ అయిపోయాయని వారు చెప్పడంతో జార్జ్ నిర్ఘాంతపోయారు. డూప్లికేట్ డాక్యుమెంట్ల ఆధారంగా తన షేర్లు ఇతరులకు బదిలీ అయ్యాయని ఆయన భావించారు. వాస్తవానికి షేర్లకు సంబంధించి డూప్లికేట్ పత్రాలను ఆ షేర్ల అసలు ఓనర్‌కు మాత్రమే జారీ చేయాల్సి ఉంటుంది. ఇది ఎంతో సంక్లిష్టమైన ప్రక్రియ. అసలు ఇదంతా ఎలా జరిగిందో జార్జ్‌కి బోధపడలేదు. 

ఇవీ చదవండి:

బాలుడి బ్యాంకు ఖాతాలో రూ. 905కోట్లు..తండ్రి మైండ్ బ్లాంక్!

గాడిద పాలతో సబ్బుల తయారీ.. ఒక్కో సబ్బు ధర ఎంతో తెలిస్తే...


అయితే..జార్జ్‌లో అనుమాన బీజాలు నాటుకున్నాయని అర్థం చేసుకున్న పీఐ ఇండస్ట్రీస్ ఆయన్ను 2016లో చర్చల కోసం ఆహ్వానించింది. కానీ జార్జ్ మాత్రం నిర్ద్వదంగా తిరస్కరించారు. ఆ తరువాత.. కంపెనీకి చెందిన ఇద్దరు ఉన్నతహోదాలో ఉన్న ఉద్యోగులు ఆయన ఇంటికి వచ్చారు. జార్జ్ వద్ద ఉన్న డాక్యుమెంట్లను పరిశీలించి అవి అసలైనవేనని నిర్ధారించుకున్నారు. మరి ఏమైందో ఏమో కానీ నాటి నుంచి కంపెనీ ఈ విషయమై సైలెంట్ అయిపోయింది. అయితే..వలావీ ఈ విషయాన్ని సెబీ దృష్టికి కూడా తీసువెళ్లారు. ఇందుకు సంబంధించి డాక్యుమెంట్లు సమర్పించాలని సెబీ పీఐని ఆదేశించిందని కూడా జార్జ్ తెలిపారు. కానీ పీఐ ఇండస్ట్రీస్ మాత్రం సెబీ కోరిన డాక్యుమెంట్లను ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని జార్జ్ ఆరోపిస్తున్నారు. 

గతంలో తాను చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం.. ప్రస్తుతం పీఐ ఇండస్ట్రీస్‌లోని 42.8 లక్షల షేర్లు తనకు చెందాలని జార్జ్ స్థానిక మీడియాకు వివరించారు. అప్పట్లో తన షేర్లు సొంత చేసుకున్న వారు కూడా కంపెనీ ఇన్‌సైడర్లేనని, అప్పటి కంపెనీ సెక్రెటరీయే ఈ వ్యవహారం మొత్తం నడిపించారని కూడా జార్జ్ ఆరోపించారు.  మరి.. 74 ఏళ్ల ముదిమి వయసుకు చేరుకున్న జార్జ్‌కు ఎప్పటికైనా న్యాయం జరుగుతుందా..?  ఆ ఆస్తి ఆయనకు దక్కుతుందా.. అనే ప్రశ్నలకు కేవలం కాలమే సమాధానం చెప్పగలదు..! 

ప్రత్యేకంమరిన్ని...