బాబ్రీ కేసు తీర్పు నేడే!

ABN , First Publish Date - 2020-09-30T09:11:25+05:30 IST

బాబ్రీ మసీదును నేలమట్టం చేసిన కేసులో తీర్పు బుధవారం వెలువడనుంది. దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్‌ తీర్పును ప్రకటించనున్నారు...

బాబ్రీ కేసు తీర్పు నేడే!

  • నిందితులుగా ఆడ్వాణీ, జోషి, ఉమా భారతి తదితరులు


న్యూఢిల్లీ: బాబ్రీ మసీదును నేలమట్టం చేసిన కేసులో తీర్పు బుధవారం వెలువడనుంది. దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్‌ తీర్పును ప్రకటించనున్నారు. ఈ కేసులో బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, కల్యాణ్‌ సింగ్‌, విశ్వహిందూ పరిషత్‌ నేతలు విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌, వినయ్‌ కటియార్‌, సాధ్వి రితంబర తదితరులను నిందితులుగా పేర్కొన్న విషయం తెలిసిందే. వీరిలో అశోక్‌ సింఘాల్‌, విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌ మరణించారు. మిగిలిన 32 మంది నిందితులను సెప్టెంబరు 30వ తేదీ తీర్పు సందర్భంగా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఈనెల 16వ తేదీన జడ్జి ఎస్‌కే యాదవ్‌ ఆదేశించారు. అయితే, కరోనా వైరస్‌ సోకడంతో వీరిలో ఉమా భారతి, కల్యాణ్‌ సింగ్‌ చికిత్స పొందుతున్నారు.


ఇక, ఆడ్వాణీ, జోషి కూడా కోర్టుకు హాజరు కావడం లేదు. కొవిడ్‌-19, వయసు, ఆరోగ్య కారణాలను చూపి వారు మినహాయింపు పొందారు. ఈ కేసులో దోషిగా తేలినవారికి ఐదేళ్ల వరకూ జైలుశిక్ష పడుతుందని చెబుతున్నారు. ఉరికైనా సిద్ధమని, బెయిల్‌ మాత్రం కోరనని ఉమాభారతి స్పష్టం చేశారు. ఈ తీర్పు నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రహోంశాఖ అప్రమత్తం చేసింది. 

Updated Date - 2020-09-30T09:11:25+05:30 IST