బాబోయ్‌ పని ఒత్తిడి!

ABN , First Publish Date - 2022-08-04T09:56:04+05:30 IST

క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది సరిగా లేకపోవడంతో మండలాల్లో రెవెన్యూ వ్యవస్థ కార్యకలాపాలు అత్యంత మందకొడిగా సాగుతున్నాయి

బాబోయ్‌ పని ఒత్తిడి!

  • గగ్గోలు పెడుతున్న తహసీల్దార్లు
  • రెవెన్యూ సమస్యలపై కుప్పలుగా దరఖాస్తులు
  • సమ్మెల్లో వీఆర్‌ఏలు.. ఇతర శాఖలకు వీఆర్వోలు
  • క్షేత్రస్థాయిలో సిబ్బంది లేక తట్టుకోలేనంత పని భారం
  • అర్జీల పరిష్కారానికి మరింత గడువు ఇవ్వండి
  • కలెక్టర్లకు తహసీల్దార్ల మొర.. లేఖలు, వినతిపత్రాలు
  • రద్దయిన పోస్టులు పునరుద్ధరించాలని.. 
  • అదనపు సిబ్బందిని నియమించాలని ట్రెసా డిమాండ్‌ 


హైదరాబాద్‌, అగస్టు 3 (ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది సరిగా లేకపోవడంతో మండలాల్లో రెవెన్యూ వ్యవస్థ కార్యకలాపాలు అత్యంత మందకొడిగా సాగుతున్నాయి. వివిధ సమస్యలపై తహసీల్దార్‌ కార్యాలయానికి దరఖాస్తులు వెల్లువెత్తుతుండగా వాటిని పరిష్కరించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దరఖాస్తులను ఎప్పుడు పరిష్కరిస్తారు? అంటూ అర్జీదారులు ప్రశ్నిస్తుంటే... సరిపడా సిబ్బంది లేరంటూ తహసీల్దార్లు అశక్తత వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఓటర్లుగా కొత్తవారి పేర్ల నమోదుకు దరఖాస్తుల స్వీకరణ.. మరణాలు, ఇతర కారణాలతో కొందరి పేర్ల తొలగింపునకు పరిశీలన రూపంలో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం జరుగుతోంది. ధరణి సహా పలు సమస్యలపై రైతులు.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ధ్రువీకరణ పత్రాలివ్వాల కోసం లబ్ధిదారులు.. వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం విద్యార్థులు తహసీల్దార్‌ కార్యాలయాలకు నిత్యం పోటెత్తుతున్నారు. అయితే సరైన సిబ్బంది లేకపోవడంతో తహసీల్దార్లపై పని భారం పెరిగింది. క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరించే వీఆర్వోలు, వీఆర్‌ఏల సేవలు అందుబాటులో లేవు. కారణం.. ప్రస్తుతం వీఆర్‌ఏలు సమ్మె చేస్తుంటే, వీఆర్వోలను ఎప్పుడో సర్కారు ఇతర శాఖలకు బదలాయించింది. ధరణి పరంగా జీఎల్‌ఎం, పీవోబీ, టీఎం 33 మాడ్యూల్స్‌ నమోదుకు దరఖాస్తులు, కోర్టు కేసులకు సంబంధించినవి, సక్సెషన్‌ కోసం వచ్చిన దరఖాస్తులపై సిబ్బంది క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించి ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. 


తాము చేయాల్సిన పనులతో పాటు వీఆర్వోలు, వీఆర్‌ఏలు చేయాల్సిన పనులునూ చేయాల్సి వస్తోందని.. జిల్లా అధికారులు కోరే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేయాల్సి ఉంటుందని.. ఆ రకంగా తమపై పని భారం పెరిగిందని తహసీల్దార్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే అర్జీల పరిష్కారానికి మరింత గడువు ఇవ్వాలని మొరపెట్టుకుంటున్నారు. ఇప్పటికే ఆర్‌ఐలు (రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు) ఆయా డివిజన్‌ పరిధిలోని ఆర్డీవోలకు వినతి పత్రాలు ఇచ్చారు. రెండు రోజుల నుంచి తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు.. జిల్లా ఉన్నతాధికారులకు లేఖలు రాస్తూ, వినతిపత్రాలు అందజేస్తున్నారు. షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి లాంటి దరఖాస్తులకు ధ్రువీకరణ పత్రాలు అవసరమవుతాయని, వీటిని గడువు లోపు పరిష్కరించాలంటూ తమపై ఒత్తిడి తీసుకురావద్దని తహసీల్దార్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి అర్జీలను పరిష్కరించేందుకు గతంలో వీఆర్వోల సహకారం ఉండటంతో కొంత వెసులుబాటు ఉండేదని.. వీఆర్‌ఏలు కూడా గత నెల 25 నుంచి సమ్మెలో ఉన్నారని, ఫలితంగా వారి సేవలూ కోల్పోతున్నామని గుర్తుచేస్తున్నారు. బుధవారం మహబూబాబాద్‌, వికారాబాద్‌, కామారెడ్డి, కరీంనగర్‌, మేడ్చల్‌, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాలోని తహసీల్దార్లలో కొందరు కలెక్టర్లకు లేఖలు రాయగా ఇంకొందరు ప్రత్యక్షంగా వినతిపత్రాలను సమర్పించారు.


ఈ పనుల్లో సమస్యలు

ధరణి సమస్యల పరిష్కారానికి  క్షేత్రస్థాయి నివేదికలు తప్పని సరిగా కావాలి. ముఖ్యంగా జీఎల్‌ఎం, పీవోబీ, టీఎం 33 మాడ్యూల్స్‌ నమోదు చేసుకునే దరఖాస్తులు, కోర్టు కేసులకు సంబంధించినవి, సక్సెషన్‌ కోసం వచ్చిన దరఖాస్తులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి ధ్రువీకరించుకోవాలి.

ఎన్నికల్లో బూత్‌లెవల్‌ అఽధికారుల విధులు, ఎస్‌ఆర్‌వో పనులు, ల్యాండ్‌ ఎంక్వైరీ, విపత్తుల సమయంలో సమచారం  ఇచ్చేందుకు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ ఇలా వివిధ కార్యక్రమాలు, విధులు వీఆర్వోలు, వీఆర్‌ఏలే నిర్వహిస్తారు. వీరు అందుబాటులో లేకపోవడంతో ఈ పనులప్నీ తామే నిర్వహించాల్సి వస్తోందని తహశీల్దారులు లేఖలో పేర్కొన్నారు.గ


రద్దయినపోస్టులను పునరుద్ధరించాలి 

వీఆర్వోలను ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేయడంతో రెవెన్యూ శాఖలో రద్దైన 6,874 పోస్టులను పునరుద్దరించాలి. వీఆర్వో వ్యవస్థ రద్దు, వీఆర్‌ఏల సమ్మెతో తీవ్ర పని ఒత్తిడి పెరిగింది. భూ సంబంధిత పనులతో పాటు సాధారణ పరిపాలన వంటి కీలక అంశాలకు సంబంధించిన నివేదికల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. అదనపు సిబ్బందిని నియమిస్తే పనులు సాగుతాయి.

- గౌతమ్‌ కుమార్‌,  ట్రెసా ప్రధాన కార్యదర్శి 

Updated Date - 2022-08-04T09:56:04+05:30 IST