Abn logo
Sep 27 2021 @ 00:59AM

బాబోయ్‌ పోర్టు రోడ్డు!

కాన్వెంట్‌ జంక్షన్‌-షీలానగర్‌ మార్గంలో తరచూ ప్రమాదాలు

పోర్టుకి రాకపోకలు సాగించే వాహనాల నుంచి జారిపడుతున్న రసాయనాలు

చెమ్మ, వర్షానికి జిడ్డుగా మారుతున్న రోడ్డు

అదుపుతప్పి జారిపోతున్న వాహనాలు

ఒకే రోజు ఇద్దరు యువకులు మృతి



(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖ పోర్టు నుంచి షీలానగర్‌కు వెళ్లే రహదారి ప్రమాదాలకు చిరునామాగా మారింది. వర్షాకాలం ప్రారంభం నుంచి తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో ఆ రోడ్డుపై ప్రయాణించాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాలుగు రోజుల్లోనే రెండు ప్రమాదాలు జరగ్గా, ఇద్దరు మృతిచెందారు. దీంతో ఆ రోడ్డుపై ప్రయాణమంటే ద్విచక్రవాహనదారులు భయపడుతున్నారు.

నగరంలో అత్యంత కీలకమైన  రహదారుల్లో కాన్వెంట్‌ జంక్షన్‌ నుంచి షీలానగర్‌కు వెళ్లే రోడ్డు ఒకటి. పోర్టుకి నిత్యం వందలాది లారీలు, కంటెయినర్లు వచ్చిపోతుండడంతో ఆ రోడ్డు రద్దీగా ఉంటుంది. అంతేకాకుండా స్టీల్‌ప్లాంట్‌, హెచ్‌పీసీఎల్‌ పరిశ్రమలకు వెళ్లే ఉద్యోగులు కూడా ఇదే రోడ్డుని వినియోగిస్తుంటారు. దీనికితోడు నగరం నుంచి గాజువాక, షీలానగర్‌వైపు వెళ్లేవారు, అటువైపు నుంచి వచ్చేవారు కూడా జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ కారణంగా ఇదే రోడ్డును వినియోగిస్తుంటారు. దీంతో కాన్వెంట్‌ జంక్షన్‌ నుంచి షీలానగర్‌ రోడ్డుపై పోర్టుకి వచ్చిపోయే వాహనాలతోపాటు ఇతర ప్రైవేటు వాహనాల తాకిడి కూడా ఎక్కువగా ఉంటోంది. అయితే పోర్టుకి వచ్చి పోయే వాహనాలన్నీ బొగ్గు, ఎరువులు, ఇతర రసాయనాల లోడు కలిగినవే కావడంతో వాటిలోని బొగ్గు, ఎరువులు, రసాయానాలు వంటివి రోడ్డుపై పడుతుంటాయి. ఇటువంటి సమయంలో చిన్నపాటి వర్షం కురిసినా, తేమ తగిలినా రోడ్డుపై పడిన రసాయనాలు జిగురుగా మారిపోతున్నాయి. దీంతో వాహనాలు అదుపుతప్పి జారిపోతున్నాయి. నాలుగు రోజుల క్రితం షీలానగర్‌ నుంచి కాన్వెంట్‌ జంక్షన్‌వైపు ద్విచక్రవాహనంపై వస్తున్న ఇద్దరు యువకులు మారుతీ సర్కిల్‌ వద్ద అదుపుతప్పి, ముందువెళుతున్న వాహనాన్ని ఢీకొట్టారు. ఆ ప్రమాదంలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. రెండు రోజుల కిందట అదే రోడ్డులో వెళుతున్న కంటైనర్‌.. ఎస్‌ఆర్‌ కంపెనీ డౌన్‌ వద్దకు వచ్చేసరికి రోడ్డుపై మడ్డి కారణంగా అదుపు తప్పి బోల్తాపడింది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉంటాయని, పోర్టు అధికారులు మాత్రం రోడ్డుని శుభ్రం చేయడంపై పూర్తిస్థాయిలో శ్రద్ధ వహించడంలేదని వాహనచోదకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై నగర ట్రాఫిక్‌ ఏడీసీపీ సీహెచ్‌ ఆదినారాయణ వద్ద ప్రస్తావించగా, ఆ రోడ్డు నిర్వహణను పోర్టు యాజమాన్యమే చూసుకుంటుందని, రోడ్డుపై వేగనియంత్రణ హెచ్చరిక బోర్డులు తాము ఏర్పాటు చేశామని తెలిపారు. గతంతో పోల్చితే  ప్రమాదాలు తగ్గాయన్నారు.