Sep 23 2021 @ 01:13AM

బాబాయ్‌... అబ్బాయ్‌... రానా నాయుడు!

రానా దగ్గుబాటి హీరోగా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’లోని పాటలో వెంకటేశ్‌ కనిపించారు. కానీ... బాబాయ్‌-అబ్బాయ్‌ కలిసి సినిమా ఏదీ చేయలేదు. ఇన్నాళ్లకు ఇద్దరూ కలిసి ఓ ప్రాజెక్ట్‌ చేయబోతున్నారు. అయితే... సినిమా కాదది! నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ కోసం రూపొందుతోన్న వెబ్‌ సిరీస్‌! హాలీవుడ్‌ సిరీస్‌ ‘రే డోనోవన్‌’ స్ఫూర్తితో తెరకెక్కించనున్న ‘రానా నాయుడు’లో వెంకటేశ్‌, రానా దగ్గుబాటి నటించనున్నారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభించనున్నారు. సాయం కోరుతూ హిందీ సినిమా తారలు ఎవరైనా ఫోన్‌ చేస్తే... ఎటువంటి సమస్యనైనా ‘రానా నాయుడు’ సత్వరమే పరిష్కరిస్తాడని నెట్‌ఫ్లిక్స్‌ ప్రతినిధులు చెబుతున్నారు. లోకో మోటివ్‌ గ్లోబల్‌ ఇంక్‌ నిర్మిస్తోన్న ఈ డ్రామా సిరీస్‌కు కరణ్‌ అన్షుమన్‌, సుపర్ణ్‌ వర్మ దర్శకులు.