డబ్బుల కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు...

ABN , First Publish Date - 2022-01-22T04:44:12+05:30 IST

అప్పు ఇవ్వాల్సిన వ్యక్తి నుంచి డబ్బులు తీసుకువచ్చేందుకు వెళ్లి.. నాలుగురోజులైనా ఇంటికి తిరిగి రాలేదు.

డబ్బుల కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు...
అందెల వెంకురెడ్డి (ఫైల్‌)

మనుబోలు వ్యక్తి అత్తిలిలో మృతి

హత్యచేసి ఉంటారని బంధువుల అనుమానం


మనుబోలు, జనవరి 21: అప్పు ఇవ్వాల్సిన వ్యక్తి నుంచి డబ్బులు తీసుకువచ్చేందుకు వెళ్లి.. నాలుగురోజులైనా ఇంటికి తిరిగి రాలేదు. శుక్రవారం తెల్లవారేసరికి చనిపోయాడన్న వార్త తెలిసేసరికి బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు తెల్లబోయారు. తమ కుమారుడ్ని హత్యచేసి ఉంటారని బోరున విలపిస్తున్న ఘటన మనుబోలులో చోటుచేసుకుంది. బంధువుల కథనం మేరకు.. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో పరిచయం ఉన్న ఓ వ్యక్తికి అప్పుగా మనుబోలు తూర్పువీధికి చెందిన అందెల వెంకురెడ్డి (44) డబ్బులు ఇచ్చి ఉన్నాడు. దీంతో అప్పు తీసుకున్న వ్యక్తి డబ్బులు ఇస్తానని చెప్పడంతో పండుగకు ఇంటికొచ్చిన పెద్దకుమార్తెను వెంటబెట్టుకుని సోమవారం ఇంటి నుంచి వెళ్లారు. కుమార్తెను విజయవాడలో ఓ ప్రైవేట్‌ పాఠశాలలో వదిలిపెట్టి, డబ్బుల కోసం వెళ్లాడు.  గురువారం సాయంత్రం అత్తిలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ నీటిగుంటలో మృతదేహం లభ్యమైందని పోలీసులకు సమాచారం రాగా.. అక్కడికి వెళ్లి ఘటనాస్థలిని పరిశీలించారు. మృతుడి గురించి ఆరా తీయగా.. మనుబోలుకు చెందిన అందెల వెంకురెడ్డిగా ఆధార్‌కార్డు ద్వారా నిర్ధారించారు. దీంతో నీటిగుంటలో పడి చనిపోయాడని అత్తిలి పోలీసులు బంధువులకు తెలియజేశారు. బంధువులు మాత్రం వెంకురెడ్డిని డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తే హత్యచేసి, నీళ్లలో పడేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై శనివారం అత్తిలి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వెంకురెడ్డి మృతితో మనుబోలులో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

 

Updated Date - 2022-01-22T04:44:12+05:30 IST