రైతన్నపై బ(ఎ)రువు

ABN , First Publish Date - 2022-01-05T05:57:12+05:30 IST

వరి సాగు వద్దని ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా యాసంగి సీజన్‌లో ఎరువుల ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది.

రైతన్నపై బ(ఎ)రువు

డీఏపీ మినహా అన్నిరకాల ఎరువుల ధరల పెంపు

ఉమ్మడి జిల్లా రైతులపై రూ.30కోట్ల అదనపు భారం


మోత్కూరు, జనవరి 4: వరి సాగు వద్దని ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా యాసంగి సీజన్‌లో ఎరువుల ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. డీఏపీ ధర పెరగనప్పటికీ సరఫరా లేక మార్కెట్లో దొరకడం లేదు. అప్పుడప్పుడు ఇంపోర్టెడ్‌ డీఏపీ వస్తుండగా, అది నల్లగా ఉండటంతో కొనుగోలుకు రైతులు ఆసక్తి చూపడంలేదు. ఇప్పటికే వానాకాలం ధాన్యం అకాల వర్షాలకు తడవడంతోపాటు, మద్దతు ధర లభించలేదు. తడిసిన ధాన్యానికి రూ.1200 నుంచి రూ.1300 వరకే వ్యాపారులు కొనుగోలుచేయడంతో రైతులు నష్టపోయారు. ఈ నేపథ్యంలో ఎరువుల ధర పెంచడంతో రైతులు యాసంగి సాగుకు ఆందోళన చెందుతున్నారు. వానాకాలంలో  సీజన్‌ సమయంలో డీఏపీపై సబ్సిడీ పెంచడంతో రూ.1250 ఉన్న బస్తా ధర రూ.1200కు తగ్గించింది. ఇక మిగతా ఎరువుల ధరలు రెండు పర్యాయాలు పెంచింది. తాజాగా, యాసంగిలో మరోసారి ధరలను పెంచింది. 20-20-0-13 కాంప్లెక్స్‌ ఎరువుపై స్వల్పంగా, మిగతా ఎరువుల ధరలు భారీగా పెంచింది. ధరలు పెరగడంతో దుకాణాల యజమానులు అన్నిరకాల ఎరువులను దిగుమతి చేసుకోకపోవడంతో మార్కెట్‌లో కొరత ఏర్పడింది. పెరిగిన ధరలతో ఒక లోడు ఎరువు దిగుమతి చేసుకునేందుకు సుమారు రూ.12లక్షలు ఖర్చు అవుతుంది. అంత పెట్టుబడిపెట్టి ఎరువులు తెస్తే అమ్ముడుపోకుంటే వడ్డీ భారం మీదపడుతుందనే భయంతో ఎరువుల దుకాణాల యజమానులు 20-20-0-13 మినహా మిగతా ఎరువులను దిగుమతి చేసుకోవడం లేదు. దీంతో రైతు ఎరువుల కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పురుగు మందుల ధరలు కూడా 10 నుంచి 15శాతం మేర పెరిగాయి.


రూ.30కోట్ల అదనపు భారం

ప్రభుత్వం వరి సాగు వద్దని చెప్పినా మరోదారి లేక రైతులు యాసంగిలో వరికే మొగ్గు చూపారు. ప్రస్తుత యాసంగిలో ఉమ్మడి జిల్లాలో ఆరుతడి పంటలకు తోడు సుమారు 5లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అనధికారికంగా అంచనా. కేవలం వరి సాగునే లెక్కలోకి తీసుకున్నా ఎకరాకు రెండు బస్తాల కాంప్లెక్స్‌ ఎరువు అవసరం. ఒక్కో ఎరువు బస్తాపై రూ.300 నుంచి రూ.500 వరకు ధర పెరిగింది. ఎరువుల ధర సగటున రూ.300 పెరిగిందని లెక్కించినా ఉమ్మడి జిల్లా రైతులపై సుమారు రూ.30కోట్ల అదనపు భారం పడనుంది. ఆరుతడి పంటలకు సైతం ఎరువుల వినియోగం ఉండటంతో ఈ భారం మరింత పెరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.


పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలి : బద్దం స్వామిరెడ్డి, రైతు,ఆరెగూడెం

ఏటా సీజన్‌ సీజన్‌కు ఎరువుల ధరలు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం అందుకనుగుణంగా పంటలకు కనీస మద్దతు ధర పెంచడం లేదు. ఇప్పటికే వ్యవసాయం గిట్టుబాటుకాకపోయినా మరో పని చేయలేక పంటలు సాగుచేస్తున్నాం. గత వానాకాలం లో రెండు పర్యాయాలు ఎరువుల ధరలు పెంచిన ప్రభుత్వం ఇప్పుడు యాసంగిలోనూ మరోసారి విపరీతంగా ధరలు పెంచింది. ఒక్కో ఎరువు బస్తాపై నాలుగైదు వందలు ధర పెంచితే ఎలా? వెంటనే పెంచిన ధరలను తగ్గించాలి.



ఎరువుల ధర పెరుగుదల ఇలా..

కాంప్లెక్స్‌ 2020 యాసంగి 2021 వానాకాలం 2021యాసంగి

డీఏపీ         రూ.1250 రూ.1200 రూ.1200  

14-35-14 రూ.1275 రూ.1365-1500 రూ.1900

28-28-0 రూ.1275 రూ.1475-1500 రూ.1900

20-20-0-13 రూ.950 రూ.1150-1225 రూ.1325

24-24-0-8         రూ.1200 రూ.1400-1500 రూ.1800

పొటాష్‌         రూ.950 రూ.1000-1200 రూ.1700

Updated Date - 2022-01-05T05:57:12+05:30 IST