అజీమ్‌ 1,125 కోట్ల విరాళం

ABN , First Publish Date - 2020-04-02T07:01:03+05:30 IST

కరోనాపై పోరుకు విప్రో అధినేత అజీమ్‌ ప్రేమ్‌జీ రూ.1125 కోట్ల విరాళం ప్రకటించారు. అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ ద్వారా రూ.1000 కోట్లు, విప్రో లిమిటెడ్‌ ద్వారా రూ.100 కోట్లు, విప్రో ఎంటర్‌ప్రైజెస్‌

అజీమ్‌ 1,125 కోట్ల విరాళం

  • రూ. 100 కోట్లు ప్రకటించిన లక్ష్మీ మిత్తల్‌
  • పుణెలో ఆస్పత్రిని నిర్మిస్తామన్న మెర్సిడెజ్‌ బెంజ్‌
  • రూ. 27 కోట్లు ఇచ్చిన ఎరువుల కంపెనీలు 


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 1: కరోనాపై పోరుకు విప్రో అధినేత  అజీమ్‌ ప్రేమ్‌జీ రూ.1125 కోట్ల విరాళం ప్రకటించారు. అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ ద్వారా రూ.1000 కోట్లు, విప్రో లిమిటెడ్‌ ద్వారా రూ.100 కోట్లు, విప్రో ఎంటర్‌ప్రైజెస్‌ ద్వారా రూ.25 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. విప్రో ప్రతి ఏట సీఎ్‌సఆర్‌ ఫండ్‌ కింద కేటాయించే మొత్తం కాకుండా అదనంగా ఈ విరాళాన్ని ఇచ్చారు. ఎన్నారై బిలియనీర్‌ లక్ష్మీ మిత్తల్‌ కరోనాపై పోరుకు తన వంతుగా రూ.100 కోట్లు విరాళమిచ్చారు. పుణెలో కరోనా బాధితులకు కోసం 1500 బెడ్లతో కూడిన తాత్కాలిక ఆస్పత్రిని నిర్మిస్తామని మెర్సిడెజ్‌ బెంజ్‌ ఇండియా ప్రకటించింది. అంతే కాకుండా సంస్థలో ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని మహారాష్ట్ర సీఎం సహాయ నిధికి ఇవ్వనున్నట్లు పేర్కొంది. వైద్య పరికరాల కోసం 100 కోట్ల రూపాయల విరాళం అందించిన విషయం తెలిసిందే. వైద్య సిబ్బందికి అవసరమైన రక్షణ సూట్లు, మాస్క్‌లను అందించేందుకు టిక్‌టాక్‌ యాప్‌ ముందుకొచ్చింది.


రూ.100 కోట్ల విలువైన 4 లక్షల ప్రొటెక్టివ్‌ సూట్లు, మాస్క్‌లను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు అందించడంతో పాటుగా రెండు లక్షల మాస్క్‌లను ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలకు అందించామని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. మధ్యప్రదేశ్‌లో 82 ఏళ్ల శలభా ఉస్కర్‌ అనే ఓ రిటైర్డ్‌ ఉద్యోగిని కరోనా సహాయ  కార్యక్రమాల కోసం తన పెన్షన్‌ నుంచి రూ.లక్ష విరాళంగా ప్రకటించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు నారాయణమూర్తి, సుధామూర్తి కుటుంబీకులు అక్షయపాత్ర ఫౌండేషన్‌కు రూ.10 కోట్ల విరాళం ప్రకటించారు. ఇన్ఫోసిస్‌ ఇప్పటికే రూ. 100 కోట్ల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. 


  • పీఎం కేర్స్‌ ఫండ్‌కు ఇండియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ రూ.25 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. 
  • దేశవ్యాప్తంగా ఉన్న ఎరువుల కంపెనీలు రూ. 27 కోట్లు విరాళమిచ్చాయి. 
  • బీడీఎల్‌ రూ.9.02 కోట్ల విరాళం ఇచ్చింది.
  • ప్రభుత్వ రంగ సంస్థ బెల్‌ రూ.15.72 కోట్ల విరాళాన్ని ఇచ్చింది.
  • జెమ్స్‌, జువెల్లరీ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ రూ. 21 కోట్ల విరాళం ఇవ్వనున్నట్లు బుధవారం ప్రకటించింది. జిందాల్‌ అల్యూమీనియం రూ. 5 కోట్లు ఇచ్చింది. 
  • సీజేఐ సహా సుప్రీంకోర్టు జడ్జిలందరూ తలో  50 వేలను విరాళమిచ్చారు. 
  • లోక్‌సభ సచివాలయ సిబ్బంది ఒక రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. 


విరాళాల సేకరణకు సంగీత కచేరీ

కరోనా సహాయ కార్యక్రమాలకు విరాళాలు సేకరించేందుకు సినీ గాయకులు, సంగీత కళాకారులు కేర్‌ కాన్సెర్ట్‌ పేరుతో డిజిటల్‌ కచేరీని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా వారంతా తమ ఇళ్లలో నుంచే ప్రదర్శనలిస్తారు. ఈ కచేరీ ఈ నెల 11న జరగనుంది. దీన్ని టీ సిరీస్‌ 93.5 రెడ్‌ ఎఫ్‌ఎం, యూట్యూబ్‌ ప్రసారం చేస్తాయి.

Updated Date - 2020-04-02T07:01:03+05:30 IST