అజర్‌పై తిరుగుబాటు

ABN , First Publish Date - 2021-03-29T10:14:25+05:30 IST

హెచ్‌సీఏ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఏం) అర్ధంతరంగా ముగిసింది.

అజర్‌పై   తిరుగుబాటు

రసాభాసగా హెచ్‌సీఏ ఏజీఎం 

వచ్చేనెల 11న మరోసారి భేటీ


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హెచ్‌సీఏ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఏం) అర్ధంతరంగా ముగిసింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్‌ అజరుద్దీన్‌పై కార్యవర్గ సభ్యులు, మెజారిటీ క్లబ్‌ సెక్రటరీలు తిరుగుబాటు చేశారు. కొన్నినెలలుగా హెచ్‌సీఏలో నెలకొన్న వివాదాలన్నీ ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఏజీఎం సాక్షిగా మరోసారి బట్టబయలయ్యాయి.

అంబుడ్స్‌మన్‌ చుట్టూ వివాదం:

పదకొండు అంశాల ఎజెండాతో ఆదివారం ఉదయం ఏజీఎం మొదలైంది. గత ఏజీఎంలో తీసుకున్న నిర్ణయాలు, పెండింగ్‌ బిల్లుల చెల్లింపులు, 2017-18 ఆడిట్‌ నివేదిక, వార్షిక బడ్జెట్‌ ఆమోదం వరకు సభ్యుల అభ్యంతరాల మధ్యే సమావేశం కొనసాగింది. అంబుడ్స్‌మన్‌గా దీపక్‌ వర్మను అజర్‌ ప్రతిపాదించగానే అర్షద్‌ అయూబ్‌, వి.హనుమంతరావుతో పాటు మెజారిటీ క్లబ్‌ కార్యదర్శులు వేదిక వద్దకు దూసుకొచ్చి వాగ్వాదానికి దిగారు. కార్యదర్శి విజయానంద్‌తో పాటు మిగిలిన కార్యవర్గ సభ్యులు కూడా అజర్‌ ప్రతిపాదనను వ్యతిరేకించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి సభ్యులను అదుపు చేయాల్సి వచ్చింది. ఏకపక్షంగా ఒకరి పేరునే అంబుడ్స్‌మన్‌గా ప్రకటించడాన్ని సభ్యులు తప్పుబట్టారు.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ జస్టి్‌సగా పని చేసిన నిసార్‌ అహ్మద్‌ కక్రూ, రిటైర్డ్‌ జస్టిస్‌ మీనా కుమారి పేర్లను కొందరు సభ్యులు తెరమీదకు తీసుకొచ్చి ఓటింగ్‌కు పట్టుపట్టడంతో సమావేశం చాలాసేపు నిలిచిపోయింది. కొద్దిసేపటి తర్వాత వచ్చేనెల 11కు ఏజీఎంను వాయిదా వేసినట్టు ప్రకటించారు. తదుపరి ఏజీఎంలో అంబుడ్స్‌మన్‌ ఎంపిక కోసం సీక్రెట్‌ ఓటింగ్‌ నిర్వహించనున్నట్టు కార్యదర్శి విజయానంద్‌ తెలిపారు.


అజర్‌పై సస్పెన్షన్‌ వేటు?:

అంబుడ్స్‌మన్‌ కోసం నిర్వహించే ఓటింగ్‌లో అజర్‌ ప్రతిపాదన గనక వీగిపోతే, వెంటనే అతడిపై సస్పెన్షన్‌ వేటు వేసేందుకు హెచ్‌సీఏలోని రెండు గ్రూపులు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. అర్షద్‌, శివలాల్‌ యాదవ్‌ వర్గాలతో పాటు ప్రస్తుత కార్యవర్గ సభ్యుల గ్రూప్‌ కూడా అజర్‌కు వ్యతిరేకంగా ఓటింగ్‌లో పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. 

వీహెచ్‌, అర్షద్‌ గరంగరం:

అజర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ టీఆర్‌ఎస్‌ నాయకుల చుట్టూ తిరుగుతున్నాడని హెచ్‌సీఏ క్లబ్‌ సెక్రటరీ, మాజీ ఎంపీ వీ హనుమంతరావు మండిపడ్డారు. అవినీతి ఆరోపణలు ఉన్న దీపక్‌ను అంబుడ్స్‌మన్‌గా అజర్‌ ఎలా ప్రతిపాదిస్తాడని ప్రశ్నించారు. 

Updated Date - 2021-03-29T10:14:25+05:30 IST