సెరెనా..మరో‘సారీ’

ABN , First Publish Date - 2020-09-12T09:07:22+05:30 IST

యూఎస్‌ ఓపెన్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సెరెనా విలియమ్స్‌ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల ...

సెరెనా..మరో‘సారీ’

ఫైనల్లో అజరెంకా వర్సెస్ ఒసాక

యూఎస్‌ ఓపెన్‌


 మహిళల ఫైనల్‌

శనివారం అర్ధరాత్రి 1.30 తర్వాత 

స్టార్‌స్పోర్ట్స్‌ సెలెక్ట్‌-1లో..


మహిళల టెన్నిస్‌ చరిత్రలో 24 గ్రాండ్‌స్లామ్స్‌తో చరిత్ర సృష్టించాలనుకున్న సెరెనా విలియమ్స్‌కు నిరాశే ఎదురైంది. యూఎస్‌ ఓపెన్‌లో ఆమె కథ ఫైనల్‌కు ముందే ముగిసింది. మాజీ ప్రపంచ నెంబర్‌వన్‌ విక్టోరియా అజరెంకా సెమీస్‌లో సెరెనాను కంగుతినిపించి జపాన్‌ సంచలన తార నవోమి ఒసాకతో  ఫైనల్‌ ఫైట్‌కు సిద్ధమైంది. మరో సెమీస్‌లో జెన్నిఫర్‌ బ్రాడీని ఒసాక ఓడించింది. 2018 నుంచి నాలుగు గ్రాండ్‌స్లామ్స్‌ ఫైనల్స్‌లో ఆడినా ట్రోఫీ నెగ్గలేకపోయిన సెరెనా మరో టైటిల్‌కోసం  ఫ్రెంచ్‌ ఓపెన్‌ దాకా వేచిచూడాల్సిందే! 


న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సెరెనా విలియమ్స్‌ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో మూడోసీడ్‌ సెరెనాకు 6-1, 3-6, 3-6తో విక్టోరియా అజరెంకా (బెలారస్‌) చేతిలో ఊహించని షాక్‌ ఎదురైంది. ఎందుకంటే.. ఈ వేదికపై అజరెంకాను ఇప్పటికే 2012, 2013 ఫైనల్స్‌లో ఓడించడంతో పాటు, ఆమెతో గ్రాండ్‌స్లామ్స్‌లో ఆడిన పదిసార్లూ సెరెనానే గెలిచింది. వీటన్నింటికీ బదులు తీర్చుకుంటూ విక్టోరియా సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. తద్వారా ఏడేళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌లో తుది పోరుకు అజరెంకా అర్హత సాధించింది. ఫైనల్లో నాలుగోసీడ్‌ ఒసాకాతో 31 ఏళ్ల అజరెంకా తలపడుతుంది. మహిళల సింగిల్స్‌లో అత్యధిక టైటిళ్ల (24) రికార్డు కలిగిన మార్గరెట్‌ కోర్ట్‌ సరసన నిలవాలనుకుంటున్న 38 ఏళ్ల నల్ల కలువకు ఆ ఒక్క టైటిల్‌ మాత్రం మూడేళ్లుగా ఊరిస్తూనే ఉంది. 2017 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను చివరిసారి సాధించిన సెరెనా.. 2018, 2019 వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్స్‌లో ఓటమిని చవిచూసింది. 

తొలి సెట్‌ గెలిచినా..: ఆరుసార్లు యూఎస్‌ ఓపెన్‌ గెలిచిన సెరెనా.. సెమీస్‌లోనూ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగింది. కోర్టుకు నలువైపులా విన్నర్స్‌ సంధిస్తూ అదరగొట్టింది. అటు అజరెంకా సర్వీస్‌ లోపాలతో పాటు  నాలుగు డబుల్‌ ఫాల్టులు, 11 అనవసర తప్పిదాలు చేయడంతో అరగంటలోనే తొలిసెట్‌ను సెరెనా గెలుచుకుంది. కానీ అజరెంకా రెండో సెట్‌ నుంచి అనూహ్య ప్రదర్శన కనబర్చింది. సెరెనా సర్వీ్‌సను బ్రేక్‌ చేస్తూ 3-2 ఆధిక్యంలోకి వెళ్లింది. అదే ఊపులో మరో బ్రేక్‌ పాయింట్‌ సాధించిన అజరెంకా 6-3తో రెండో సెట్‌ను గెలిచి ఉత్కంఠ పెంచింది. నిర్ణాయక చివరి సెట్‌లోనూ సెరెనాపై సంపూర్ణ ఆధిపత్యం చూపుతూ అజరెంకా 3-0తో దూసుకెళ్లింది. దీనికి తోడు సెరెనా ఎడమ కాలికి చికిత్స తీసుకున్నాక కోర్టులో చురుగ్గా కదల్లేకపోయింది. ఆ తర్వాత మూడు పాయింట్లు నెగ్గి కాస్త పోరాటం ప్రదర్శించింది. అటువైపు ఎలాంటి ఒత్తిడికి లోనవని అజరెంకా వరుస ఏస్‌లతో మ్యాచ్‌ను ముగించింది. 

ఒసాక..అదే జోరు: మరో సెమీఫైనల్లో నవోమి ఒసాక 7-6 (7-1), 3-6, 6-3తో 28వ సీడ్‌ జెన్నిఫర్‌ బ్రాడీ (అమెరికా)పై గెలిచి ఫైనల్లో ప్రవేశించింది. 2 గంటల 8 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఒసాకకు బ్రాడీ నుంచి గట్టి పోటీ ఎదురైనా తనదైన ఆటతీరుతో విజృంభించి తుదిపోరులో నిలిచింది.  


పావిక్‌-సోర్స్‌ జోడీకి డబుల్స్‌ టైటిల్‌

యూఎస్‌ ఓపెన్‌ పురుషుల డబుల్స్‌ ఫైనల్లో అన్‌సీడెడ్‌ మేట్‌ పావిక్‌ (క్రొయేషియా)-బ్రూనో సోర్స్‌ (బ్రెజిల్‌) ద్వయం 7-5, 6-3తో ఎనిమిదో సీడ్‌ మెక్టిక్‌-కూల్‌హాఫ్‌ జంటపై గెలిచి టైటిల్‌ దక్కించుకుంది. మహిళల డబుల్స్‌ ఫైనల్లో అన్‌సీడెడ్‌ సీగెమండ్‌ (జర్మనీ)- వెరా జ్వొనరేవా (రష్యా) జోడీ 6-4, 6-4తో మూడో సీడ్‌ ఇఫాన్‌ (చైనా)- నికోల్‌ (అమెరికా) ద్వయాన్ని చిత్తుచేసి చాంపియన్‌గా నిలిచింది.

Updated Date - 2020-09-12T09:07:22+05:30 IST