Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Mon, 01 Aug 2022 03:44:36 IST

జాతి మరచిన ‘జెండా వెంకయ్య’

twitter-iconwatsapp-iconfb-icon
జాతి మరచిన  జెండా వెంకయ్య

బ్రిటిష్‌ ఆర్మీలో ఉండగానే..మనకూ జాతీయ పతాకం ఉండాలని ఆకాంక్ష

అందుకోసం ఎనలేని కసరత్తు

ఆయన కృషికి ఇన్నాళ్లకు గుర్తింపు

‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా దేశవ్యాప్త ప్రచారం


మచిలీపట్నం, జూలై 31 (ఆంధ్రజ్యోతి) : అఖండ భారతావని సగర్వంగా ఆవిష్కరించుకునే మువ్వన్నెల జాతీయ పతాకం.. ప్రతి రోజూ సమున్నతంగా ఎగురుతుంటే ప్రతి భారతీయుడి శరీరం పులకరిస్తుంది. ఏటా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన.. జనవరి 26న గణతంత్ర వేడుకల సమయంలో ఊరూవాడా ఎగురవేస్తుంటాం. మరి దీనిని రూపొందించినవారెవరో తెలుసా? మన అచ్చ తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య. జాతీయ పతాక రూపశిల్పిని దేశం దాదాపు మరచిపోయింది. తాజాగా ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా స్వాతంత్య్ర సంగ్రామంలో పింగళి పాత్ర, జాతీయ పతాకం రూపకల్పనలో ఆయన విశేష కృషిని స్మరిస్తూ కేంద్రం పెద్దఎత్తున ప్రచారం చేస్తోంది. 146వ జయంతిని మంగళవారం ఢిల్లీలో నిర్వహించనుంది.


చిన్నప్పుడే గాంధీతో..

జీవితాంతం గాంధేయవాదిగా కొనసాగిన పింగళి.. 1876 ఆగస్టు 2న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మచిలీపట్నం వద్ద భట్లపెనుమర్రులో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి పింగళి హనుమంతరాయుడు, తల్లి వెంకటరత్నం. చల్లపల్లి మండలం యార్లగడ్డలో, మొవ్వ మండలం భట్లపెనుమర్రులో, మోపిదేవి మండలం పెదకళ్ల్లేపల్లిలో బాల్యం, విద్యాభ్యాసం కొనసాగించారు. మచిలీపట్నం హిందూ హైస్కూలులో ప్రాఽథమికోన్నత విద్యను అభ్యసించారు. పామర్రు గ్రామకరణం కుమార్తె రుక్మిణమ్మను వివాహం చేసుకున్నారు. ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేసుకున్నాక.. 19 ఏళ్లకే బ్రిటిష్‌ సైన్యంలో చేరారు. దక్షిణాఫ్రికాలో జరిగిన ఆంగ్లో-బోయెర్‌ యుద్ధం(1899-1902)లో పాల్గొన్నారు. ఆ సమయంలోనే అక్కడ మహాత్మాగాంధీని కలుసుకున్నారు. బ్రిటిష్‌ జాతీయ పతాకానికి సైనికులు సెల్యూట్‌ చేసే ఘటన వెంకయ్య మదిలో నిలిచిపోయింది. స్వదేశానికి వచ్చాక మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తూ.. మన దేశానికి కూడా జాతీయ పతాకం కావాలని.. రూపకల్పనకు నడుం బిగించారు. 


బ్రిటిష్‌ పతాకాన్ని ఆవిష్కరించడం చూసి..

స్వాతంత్య్ర ఉద్యమ కార్యాచరణ కోసం జరిగే అఖిల భారత కాంగ్రెస్‌ సమావేశాల్లో పింగళి తరచూ పాల్గొనేవారు. 1906లో కలకత్తాలో కాంగ్రెస్‌ సమావేశాల ప్రారంభ సమయంలో బ్రిటిష్‌ వారి జాతీయ జెండాను కాంగ్రెస్‌ నాయకులు ఆవిష్కరించడం చూసి ఎంతో కలత చెందారు. మన దేశానికి ఒక జాతీయజెండా ఉండాలనే  ఆవశ్యకతను గుర్తించి కాంగ్రెస్‌ సమావేశాల్లోనూ నొక్కిచెప్పేవారు. ఇతర దేశాల పతాకాలపైనా అధ్యయనం చేశారు. భారత జాతీయ పతాకం ఎలా ఉండాలో 30 రకాల డిజైన్లు సిద్ధం చేసి.. 1916లో ‘ఏ నేషనల్‌ ఫ్లాగ్‌ ఫర్‌ ఇండియా’ అనే బుక్‌లెట్‌ ప్రచురించారు.


1921 మార్చి 31-ఏప్రిల్‌ 1న మహాత్మాగాంధీ విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సమావేశానికి వచ్చారు. పింగళి ఆయన్ను కలిసి.. ఖద్దరుపై తాను రూపొందించిన ‘స్వరాజ్‌’ పతాక్నాన అందజేశారు. హిందువులు, ముస్లింలను ప్రతిబింబించే ఎరుపు, పచ్చ రంగులు మాత్రమే అందులో ఉన్నాయి. మధ్యలో స్వరాజ్యానికి గుర్తుగా చరఖాను పెట్టారు. గాంధీజీ సలహాతో తెల్ల రంగును కూడా కలిపి 3గంటల్లో తయారుచేసి ఇచ్చారు. గాంధీజీ ముగ్ధుడయ్యారు. ఆయన, కాంగ్రెస్‌ అగ్ర నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆ ఏడాది ఏప్రిల్‌ 13న ‘యంగ్‌ ఇండియా’ పత్రికలో మహాత్మాగాంధీ మన జాతీయపతాకం అనే శీర్షికతో ప్రత్యేక వ్యాసం రాశారు. నాటి నుంచి పింగళి ‘జెండా వెంకయ్య’గా ప్రసిద్ధుడయ్యారు. దేశమంతటా 1931 వరకు ఈ స్వరాజ్‌ పతాకమే రెపరెపలాడింది. ఆ ఏడాది పతాకంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ కొన్ని మార్పులు చేసింది. ఎరుపు రంగు స్థానంలో కాషాయ రంగు వచ్చింది. పతాకం పై భాగాన ఈ రంగు, మధ్యలో తెలుపు, ఆ తర్వాత పచ్చ రంగు వచ్చాయి. మధ్యలో తెల్ల రంగుపై చరఖాను చేర్చారు. 1947లో స్వాతంత్య్రం సిద్ధించాక బాబూ రాజేంద్రప్రసాద్‌ (తర్వాత రాష్ట్రపతి అయ్యారు) సారథ్యంలో జాతీయ పతాక కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ చరఖా స్థానంలో అశోక చక్రాన్ని ఆమోదించింది.

 


జపాన్‌ వెంకయ్య.. పత్తి వెంకయ్య..

పింగళి వెంకయ్య బహుభాషాకోవిదుడు.. బహుళ శాస్త్రజ్ఞుడు కూడా. నిత్య విద్యాపిపాసి. విద్యపై అభిలాషతో లాహోర్‌లోని డీఏవీ కళాశాలలో చేరారు. అక్కడ ఆంగ్లం, జపాన్‌, సంస్కృతం. ఉర్దూ నేర్చుకుని వాటిపై పట్టు సాధించారు. జపాన్‌ భాషలో మంచి వక్తగా పేరొందారు. తనకు జపాన్‌ భాష నేర్పిన ప్రొఫెసర్‌ గోటేకు తెలుగు భాషను ఆయన నేర్పించారు. జపాన్‌ భాషలో అనర్గళంగా మాట్లాడుతుండడంతో అందరూ ‘జపాన్‌ వెంకయ్య’ అని పిలిచేవారు. అప్పట్లో మత్స్య, జౌళి పరిశ్రమలకు మచిలీపట్నం పెద్ద కేంద్రంగా ఉండేది. మునగాల రాజా ప్రోత్సాహంతో అక్కడి సంస్థానంలో వ్యవసాయక్షేత్రాన్ని ప్రారంభించారు.


అమెరికా, తదితర దేశాల నుంచి పత్తి విత్తనాలు తెప్పించి పరిశోధనలు చేశారు. 1909లో ఏలూరులో జరిగిన వ్యవసాయ ప్రదర్శనలో తన ప్రయోగాలను ప్రదర్శించారు. పింగళి ప్రతిభను గుర్తించి బంగారు పతకాన్ని బహూకరించారు. బ్రిటిష్‌ ప్రభుత్వం రాయల్‌ అగ్రికల్చర్‌ సొసైటీలో సభ్యత్వమిచ్చింది. ‘కాంబోడియా కాటన్‌’ వంగడంపై పరిశోధనకు ‘పత్తి వెంకయ్య’ అని పేరు వచ్చింది. వజ్రాలపైనా పరిశోధనలు సాగించారు.


ప్రేమను పెంచు.. పది మందికీ పంచు..

అద్వితీయమైన మేధస్సుతో దేశానికి అపరిమితమైన సేవలు చేసిన పింగళి.. ప్రేమను పెంచు, పదిమందికీ పంచు అని పదేపదే చెబుతుండేవారు. తన రాజకీయ గురువు బాలగంగాధర తిలక్‌ మరణంతో రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. నెల్లూరులో కొంతకాలం ఉండి అబ్రకంపై పరిశోధనలు చేశారు. భూగర్భ, ఖనిజ శాఖలో కేంద్ర ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేశారు. జీవిత చరమాంకంలో విజయవాడ పాలఫ్యాక్టరీ సమీపంలో ఒక ఇంటిలో ఉండేవారు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. రోజూ ఉదయంపూట విష్ణుసహస్రనామం చదివేవారు. మధ్యాహ్న భోజనం అనంతరం భగవద్గీత చదివేవారు. బయటకువెళ్లే సమయంలో ఖద్దరు లాల్చీ, నల్లటి కోటు వేసుకునేవారు. 1963 జూలై 4న పింగళి కన్నుమూశారు.


దేశానికి విశేషసేవలందించిన ఆయనకు సరైన గుర్తింపు రాలేదు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర సంగ్రామంలో ఆయన కృషిని గుర్తించి.. 2009లో కేంద్రం ఐదు రూపాయల పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న ప్రతిపాదన 2011లో వచ్చినా.. ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. 2016లో నాటి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి పింగళి పేరు పెట్టారు. ఆ కార్యాలయ ప్రాంగణంలో పింగళి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తాజాగా పింగళి 146వ జయంతిని కేంద్రం మంగళవారం ఢిల్లీలో ఘనంగా నిర్వహించనుంది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.