యోధుల త్యాగాలను తక్కువ చేస్తే ఊరుకోం

ABN , First Publish Date - 2022-08-16T06:50:39+05:30 IST

రాజకీయ ప్రయోజనాల కోసం స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలను తక్కువ చేసి చూపిస్తూ, చరిత్రను వక్రీకరిస్తున్న విధానాలపై పోరాటాలు చేయాలని సోమవారం కాంగ్రెస్‌ పార్టీ ప్రతిజ్ఞ చేసింది. స్వాతంత్య్ర అమృతోత్సవాల...

యోధుల త్యాగాలను తక్కువ చేస్తే ఊరుకోం

చరిత్రను వక్రీకరిస్తే పోరాటం: కాంగ్రెస్‌

గాంధీ స్మృతి వనం వరకు ఆజాదీ గౌరవ్‌ యాత్ర 


న్యూఢిల్లీ, ఆగస్టు 15: రాజకీయ ప్రయోజనాల కోసం స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలను తక్కువ చేసి చూపిస్తూ, చరిత్రను వక్రీకరిస్తున్న విధానాలపై పోరాటాలు చేయాలని సోమవారం కాంగ్రెస్‌ పార్టీ ప్రతిజ్ఞ చేసింది. స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమం, అనంతరం నిర్వహించిన ఆజాదీ గౌరవ్‌ యాత్రలో ఈ మేరకు శపథం చేసింది. కాంగ్రెస్‌ కార్యాలయం నుంచి తీస్‌ జనవరి రోడ్డు మీదుగా గాంధీ స్మృతి వనం వరకు గౌరవ్‌ యాత్ర నిర్వహించింది. ఈ రోడ్డులో ఉన్న భవనం వద్దనే జనవరి 30న మహాత్మాగాంధీ హత్యకు గురయ్యారు. ఆ ప్రదేశం వద్ద మహాత్మునికి నివాళులు అర్పించారు. కరోనా సోకడంతో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పతాకావిష్కరణకు రాలేకపోయారు.


రాహుల్‌గాంధీ, ప్రియాంకలు సహా సీనియర్‌ నేతలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యురాలు అంబికా సోనీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోనియా స్వాతంత్య్ర దినోత్సవ సందేశాన్ని పంపించారు. చరిత్రలోని వాస్తవాలను తప్పుడు భాష్యం చెప్పే ప్రతి ప్రయత్నాన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఆమె తెలిపారు. గత 75 ఏళ్లలో ఎన్నో ఘన విజయాలు సాధించామని తెలిపారు. 

Updated Date - 2022-08-16T06:50:39+05:30 IST