వైద్యశాఖలో ఇష్ట్టారాజ్యం!

ABN , First Publish Date - 2021-01-10T05:46:57+05:30 IST

జిల్లా వైద్యశాఖలో చేపట్టిన ఉద్యోగాల భర్తీలో వింతలు, విడ్డూరాలు చోటు చేసుకుంటున్నాయి.

వైద్యశాఖలో ఇష్ట్టారాజ్యం!

 ఒకే అభ్యర్థి రెండు ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తే డిగ్రీ మార్కుల గుర్తింపులో తేడాలు

అభ్యంతరం పెట్టినా పరిశీలించనక్కరలేదని రిమార్కులో రాత

 ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : జిల్లా వైద్యశాఖలో చేపట్టిన ఉద్యోగాల భర్తీలో వింతలు, విడ్డూరాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకే అభ్యర్థి రెండు, మూడు ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తే డిగ్రీ మార్కుల గుర్తింపులో తేడాలు చూపి ఉద్యోగానికి అనర్హుడిగా చూపుతున్నారు.  వైద్యశాఖ అధికారులు ధ్రువీకరించిన తుది జాబితాల్లో తప్పులు దొర్లాయని అభ్యంతరాలు వ్యక్తంచేస్తే... ఈ అంశాలను పరిశీలించనక్కరలేదని రిమార్కుల కాలమ్‌లో రాసేస్తున్నారు. ఇదేం చోద్యమని అధికారులను ప్రశ్నిస్తే వినిపించుకోవడం లేదని అభ్యర్థులు వాపోతున్నారు. వైద్యశాఖలో పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయనే కారణంతో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఫైళ్లను జేసీ ఎల్‌ శివశంకర్‌ తన వద్దకు తెప్పించుకున్నారు. పూర్తిస్థాయిలో పరిశీలన చేసేవరకు ఈ నియామకాలు నిలిపివేయాలని జేసీ ఆదేశాలిచ్చినా అవేమీ పట్టించుకోకుండా వైద్యశాఖ అధికారులు తమదైన శైలిలో శనివారం అభ్యర్థులకు నియామకపు ఉత్తర్వులు ఇచ్చారని కొందరు అభ్యర్థులు చెబుతున్నారు. 

డిగ్రీ మార్కుల గుర్తింపులో ఇష్టారాజ్యం  

 వైద్యశాఖ భ ర్తీ చేస్తున్న స్టోర్‌ కీపర్‌కం క్లర్క్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, మెడికల్‌ రికార్డు ఆఫీసర్‌(ఎంఆర్‌వో) పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు డిగ్రీ మార్కులను ఇష్ట్టారాజ్యంగా మెరిట్‌ జాబితాల్లో నమోదు చేయడంపై అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.  ఈ అంశం వివాదాస్పదమవుతోంది. స్టోర్‌ కీపర్‌కం క్లర్క్‌ మెరిట్‌ జాబితాలో సీరియల్‌ 15వ నెంబరులో మహ్మద్‌ రసూల్‌ బీఎస్సీ డీగ్రీకి మొత్తం మార్కులను 2300గా చూపారు. 16వ నెంబరు సీరియల్‌లో అప్పయ్య చౌదరికి బీఎస్సీ డిగ్రీకి 1900 మార్కులు, 17వ నెంబరులోని ఆలపాటి దుర్గా నిఖితకు బీఎస్సీ డిగ్రీలో 2500 మార్కులుగా చూపారు. 18వ నెంబరులో మహ్మద్‌ ఇమ్రాన్‌కు బీఎస్సీ డిగ్రీకి 4900 మార్కులుగా చూపారు. 19వ నెంబరులోని దారం ప్రజ్వలకు బీఎస్సీ డిగ్రీలో 1800 మార్కులుగా చూపారు.  20వ నెంబరులోని పరిగడపు శ్రీనివా్‌సకు బీకాం డిగ్రీకి 1900 మార్కులు చూపారు. 21వ నెంబరులోని టీఎన్‌వీ హనుమంతరావుకు బీకాం డిగ్రీకి 1500 మార్కులను చూపారు. 

     మెడికల్‌ రికార్డు ఆఫీసర్‌(ఎంఆర్‌వో)పోస్టులకు సంబంధించి మెరిట్‌ జాబితాలో ఇదే టీఎన్‌వీ హనుమంతరావుకు బీకాం డిగ్రీకి 2000 మార్కులను చూపారు. తాను రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నానని, మార్కుల మార్పు చేయాలని కోరాడు. దీనిపై స్పందించిన అధికారులు మెడికల్‌ రికార్డు ఆఫీసర్‌(ఎంఆర్‌వో) పోస్టుల మెరిట్‌ జాబితాలోని రిమార్కుల కాలమ్‌లో నో నీడ్‌ కరెక్షన్స్‌ అని రాయడం గమనించదగ్గ అంశం. వైద్యశాఖలోని పోస్టుల భర్తీలో ఇలాంటి ఎన్నో పొరపాట్లు జరిగాయని, పూర్తిస్థాయిలో విచారణ చేసి అర్హత ఉన్న అభ్యర్థులకు పోస్టులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు.  


Updated Date - 2021-01-10T05:46:57+05:30 IST