స్వాతంత్య్రానంతరం ఉత్తరాంధ్రలో ఆచార్య రంగాజీ ప్రభావంతో, కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ వారసునిగా అధికార, విపక్ష రాజకీయాలలో ఈనాటికీ కీలకంగా కొనసాగుతున్న కుటుంబాలలో మాజీ మంత్రి టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబం ఒకటి. నర్సీపట్నం ప్రాంతంలో, ఆనాటి ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాలలో ఎదురులేని నేతలుగా రాజకీయాలను శాసించిన స్వర్గీయ మాజీ మంత్రి సాగి సూర్యనారాయణరాజు, సాగి సీతారామరాజులను ఎదుర్కొని నిలిచిన రాజకీయ కుటుంబం రుత్తల లచ్చాపాత్రుడుది. నిబద్ధ రాజకీయాలతో, అన్ని సామాజిక వర్గాలతో సన్నిహిత ఆత్మీయ సంబంధాలతో ఆరోగ్యకరమైన, ఆదర్శవంతమైన రాజకీయాలు నెరపారాయన. ప్రతిపక్ష శాసనసభ్యునిగా ఉన్నా, కొందరు అధికార పార్టీ నేతలు, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు కూడా లచ్చాపాత్రుడుని వ్యక్తిగతంగా ఎంతో గౌరవించేవారు. కృషీకార్ లోక్‌పార్టీ, స్వతంత్ర పార్టీలలో రంగాజీ వెంట నడచిన రుత్తుల లచ్చాపాత్రుడి రాజకీయ వారసుడు అయ్యన్న పాత్రుడు. రాగద్వేషాలకు అతీతంగా ప్రజలతో మమేకమైన అయ్యన్నపాత్రుడు తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత రాజకీయాలలోకి ప్రవేశించి నాలుగు దశాబ్దాలుగా జిల్లా రాజకీయాలలో ఎదురులేని శక్తిగా ఎదిగారు.
ఇంకా ఉత్తరాంధ్రలో, ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎన్నో కుటుంబాలు ఈనాటికీ రాజకీయాలలో కొనసాగడం గమనార్హం. దురదృష్టవశాత్తూ, వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మహోపకారాలు చేసినా, తమ తమ ప్రాంత అభివృద్ధికి ఎంతో పాటుపడినా, తెన్నేటి విశ్వనాథం, ఎంవి భద్రం, కోడుగంటి గోవిందరావు, చౌదరి సత్యన్నారాయణ, చీకటి పరశురామనాయుడు, గొర్రెపాటి బుచ్చప్పారావు, వివి. రమణబాబు, పివి రమణ, భీశెట్టి అప్పారావు, చాగంటి సోమయాజులు, పీసపాటి పుండరీకాక్షయ్య, పోతిన సన్యాసిరావు వంటివారు తమకు సరైన రాజకీయ వారసులు లేక, రాజకీయంగా ఆ కుటుంబాలు తెరమరుగైపోయాయి. శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ కుటుంబ వారసత్వంతో ఈనాటికీ అధికార, విపక్ష రాజకీయాలలో ముందు వరుసలో గౌతు శిరీష (సర్దార్ గౌతు లచ్చన్న వారసురాలు), కళా వెంకటరావు, కింజరాపు అచ్చెంనాయుడు (స్వర్గీయ కింజరాపు ఎర్రంనాయుడు, చిన్నాన్న కింజరాపు కృష్ణమూర్తి రాజకీయ వారసత్వం) ప్రముఖులు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో తొలుత కాంగ్రెస్ వర్గ రాజకీయాలలో ప్రముఖునిగా పలు పదవులు చేపట్టినా, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీ రామారావు వెంట నిలిచిన స్వర్గీయ పెదకంశెట్టి అప్పల నరశింహం. ఆయన శాసనసభ్యునిగా, ఉడా ఛైర్మన్‌గా, లోకసభ సభ్యునిగా, పార్టీ జిల్లా అధ్యక్షునిగా వివిధ హోదాలలో ప్రజలకు, పార్టీకి సేవలందించారు. మంచి ప్రజా సంబంధాలు కలిగిన కుటుంబ నేపథ్యం. ఆయన వారసునిగా, జెడ్పిటిసి సభ్యునిగా రాజకీయ అరంగ్రేటం చేసి, ఉమ్మడి పెందుర్తి నియోజకవర్గానికి ఒకసారి, విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి రెండోసారి శాసనసభ్యునిగా ఎన్నికైన పెదకంశెట్టి గణబాబు. తండ్రీ కొడుకులు ఎలాంటి ఆరోపణలు ఎదుర్కోకుండా దశాబ్దాలుగా రాజకీయాలు నెరపుతున్నారు.
1984లోనే తెలుగుదేశం పార్టీలో చేరి, ఒకసారి శాసనసభ్యునిగా తాను, మరోసారి తన కుమారుడు గాజువాక నుంచి శాసనసభ్యునిగా ఎన్నికైన చరిత్ర పల్లా సింహాచలం, పల్లా శ్రీనివాసరావుది. వివాదరహితునిగా నిబద్ధతతో రాజకీయాలు నెరుపుతూ, ప్రజలతో మమేకమయ్యే యువ రాజకీయ నాయకుడు పల్లా శ్రీనివాసరావు. ఈయన ప్రస్తుతం విశాఖ పార్లమెంటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి సేవలందిస్తున్నారు. 1981లో స్వతంత్ర అభ్యర్థిగా పెందుర్తి సర్పంచ్‌గా ఎన్నికైన పీలా మహాలక్ష్మినాయుడు 1983లోనే తెలుగుదేశం పార్టీలో చేరారు, 1987, 1995లో పెందుర్తి మండలాధ్యక్షునిగా ఎన్నికైనారు. ఆయన రాజకీయ వారసుడే అనకాపల్లి పూర్వ శాసనసభ్యుడు పీలా గోవింద్. ఈనాటి విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పీలా గోవింద్, పెదకంశెట్టి గణబాబు, పల్లా శ్రీనివాసరావు, తాజాగా సిహెచ్ అయ్యన్నపాత్రుడు ఇళ్ళు, ఆస్తులపై ప్రభుత్వం (కక్ష సాధింపు చర్యల రూపంలో) వ్యవహరించిన తీరు, అధికార పార్టీకి రాజకీయంగా ఎంతో నష్టం. ఈ దేశంలోను, రాష్ట్రంలోను, అధికార పార్టీలు నిస్సిగ్గుగా ప్రత్యర్థులపై చేస్తున్న దాడులు, కక్షసాధింపు చర్యలు, శాంతికాముకులైన ఈ దేశ ప్రజలు హర్షించరు అన్న సంగతి ఎన్నోసార్లు రుజువైంది.
అయ్యన్నపాత్రుడు చేసే విమర్శలు కొన్ని వివాదాస్పదమైనవే కావచ్చు. వాటికి సమాధానం చెప్పే విధానం, లేదా ఇతర రాజకీయ ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. అవన్నీ కాదని భౌతిక దాడులతో ప్రత్యర్థుల నోరు మూయించాలనుకుంటే... ఈ దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం బతికే ఉంది. తస్మాత్ జాగ్రత్త.
బి.వి. అప్పారావు