Abn logo
Sep 16 2020 @ 11:16AM

అయ్యన్న సంచలన కామెంట్స్.. టీడీపీలో హాట్ హాట్ చర్చ..!

తెలుగుదేశం పార్టీలో ఓ మాజీ మంత్రి మాటలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అధినేత ఎదుటే ఆయన సంధించిన ప్రశ్నలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన కొందరు నాయకులు ఏమయ్యారని ఆయన గట్టిగా నిలదీశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరికో భయపడి దాక్కుంటున్నారని నిప్పులు చెరిగారు. ఇంతకీ ఆయన ఎవరు? ఆయన ఎవరిని లక్ష్యంగా చేసుకుని అలా శివాలెత్తిపోయారు? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..


మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు చేసిన కామెంట్స్‌ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. పార్టీ నేతలతో మాజీ సీఎం చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు పార్టీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.. ఎవరిపై ఆయన ఇంతగా అసహనం తెలిపారనే విషయంపై అంతర్గతంగా చర్చోపచర్చలు జరుగుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.


టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పార్టీకి చెందిన పలు సంస్థాగత అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు కొన్ని అంశాలపై తన అభిప్రాయాలను అధినేత ముందు కుండబద్దలు కొట్టారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి పదవులు అనుభవించడం ముఖ్యం కాదనీ.. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు, అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడటం అవసరమన్నారట. ప్రజల తరుపున పోరాడి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే టీడీపీలో మంత్రులుగా పనిచేసిన వారు, వివిధ పదవులు అనుభవించిన వారు ఇప్పుడు ఏమయ్యారని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించినట్లు సమాచారం. ఎందుకు వారు బయటికి రావడంలేదు... ఎవరికి భయపడుతున్నారు ప్రశ్నలు సంధించారట. మరికొందరు నేతలు అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి, ఆ తరువాత అడ్రస్ లేకుండా పోయారని ఆక్రోశం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇటువంటి వారిని తెలుగు దేశం పార్టీ ఎంతోమందిని చూసిందని... వారంతా పత్తా లేకుండా పోయారని పెదవి విరిచారట అయ్యన్నపాత్రుడు.


అయ్యన్న వ్యాఖ్యలతో అంతా నిశ్శబ్ధం..

టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న నాయకులకు అయ్యన్నపాత్రుడు గట్టిగానే చురకలంటించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వారి మాటలను బట్టి టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వీరిని పక్కకు తప్పించాలంటూ అయ్యన్నపాత్రుడు సీరియస్ అయ్యారు. ప్రతిపక్షంగా ఉన్న సమయంలో అధినేతకు అండగా ఉండాలంటూ ఆయన తన స్వరం వినిపించారు. దాంతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఒక్కసారిగా నిశ్శబ్ధం ఆవరించడంతో అందరూ సైలెంటైపోయారు. చంద్రబాబు కూడా అయ్యన్న పాత్రుడు చేసిన కామెంట్లపై స్పందిస్తూ... తాను అన్ని విషయాలు గమనిస్తున్నానని అయ్యన్న పాత్రుడిని సమాధానపరిచారు. ఆ తరువాత మరికొంతమంది నేతలు కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో అయ్యన్నపాత్రుడు వాదనను సమర్ధించారని సమాచారం. ఏపీలో చంద్రబాబు లేదా నారాలోకేష్‌ అందుబాటులో ఉండాలని అయ్యన్నపాత్రుడు సూచించడంతో..చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.  అందుకే చంద్రబాబు లోకేష్‌ను హైదరాబాద్‌ నుంచి ఏపీకి పంపించినట్లు చర్చ జరుగుతోంది. 


ఆయననుద్దేశించి అన్నారా?

పార్టీలో కొనసాగుతూ మౌనంగా ఉంటున్న సీనియర్లపై అయ్యన్న పాత్రుడు, మరికొందరు నాయకులు చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీలో హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది. ఆయన మాటలు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును ఉద్దేశించినవేనని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత అధికార పార్టీకి భయపడి సైలెంట్ అయిన వారందరికీ వర్తిస్తాయని అంటున్నారు.


మూడు నెలల్లోనే కోలుకుని...

వాస్తవానికి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం తర్వాత మూడు నెలల్లోనే కోలుకుంది. ఇసుక కొరతపై ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ అలుపెరగని పోరాటం చేసింది. పార్టీ నేతలు రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలతో హోరెత్తించారు. అధికార పార్టీ కేసులు, అరెస్టులను లెక్కచేయకుండా జగన్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ తప్పులను ఎండగడుతున్నారు. 2014 నుంచి 2019 వరకు మంత్రులుగా పనిచేసిన వారిలో ఎక్కువమంది పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈఎస్ఐ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టయ్యారు. వారు ఇప్పుడు బెయిల్ పై బయటికి వచ్చి ప్రభుత్వ తప్పులపై నిరసన గళం ఎత్తుతున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ జెండాను ఎగురవేయాలన్న లక్ష్యంతో జనంతో మమేకమవుతున్నారు. ఏదైమైనా తమ ప్రయోజనాల కోసం పార్టీని వాడుకుంటున్న నాయకులపై అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్‌ సర్కిల్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి.

Advertisement
Advertisement
Advertisement