గ్రామాల్లోనూ అన్ని రకాల సేవలు

ABN , First Publish Date - 2021-04-16T06:17:12+05:30 IST

గ్రామాలలో అన్ని రకాల వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

గ్రామాల్లోనూ అన్ని రకాల సేవలు
ఆరోగ్య ఉప కేంద్రాలలో వసతులను పరిశీలిస్తున్న అధికారులు

ఆరోగ్య సంరక్షణ కేంద్రాలుగా ఆరోగ్య ఉప కేంద్రాలు

ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో భాగంగా చర్యలు

ఎన్‌సీడీ జిల్లా అధికారి డా. ప్రసాద్‌ వెల్లడి

అశ్వారావుపేట, ఏప్రిల్‌ 15: గ్రామాలలో అన్ని రకాల వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌లో భాగంగా ప్రస్తుతం ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాలను ఆరోగ్య సంరక్షణ కేంద్రాలుగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం మండలంలోని పలు ఆరోగ్య ఉపకేం ద్రాలను ఆరోగ్య సంరక్షణ కేంద్రాలుగా మార్చే భాగంలో ఎన్‌సీడీ జిల్లా అధికారి డా. ప్రసాదరావు, టీఎంహెచ్‌ఐ అధికారి సలీమ్‌ అశ్వారావుపేట, దమ్మపేట మండలంలోని పలు ఉప కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 240 ఆరోగ్య ఉప కేంద్రాలను ఆరోగ్య సంరక్షణ కేంద్రాలుగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇందులో ప్రస్తుతం 96 కేంద్రాలను తక్షణమే మార్చేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. మిగతావాటన్నింటిని 2022 డిసెంబర్‌ నెలలోపు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. ఈ కేంద్రాలలో ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉండే అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయని, అదనంగా ప్రతి కేంద్రానికి వైద్యునితో పాటు అదనపు సిబ్బందిని నియమిస్తారని ఆయన తెలిపారు. వైద్య సౌకర్యాల కల్పన, సిబ్బందికి ఏర్పాట్లు, ల్యాబ్‌ వంటి సౌకర్యాలు, ప్రహరీలు, అదనపు గదులు, ఇతరత్రా సౌకర్యాల ఏర్పాటుకోసం ఈ పర్యటనలు చేస్తున్నామని, మొత్తం నివేదికను ప్రభుత్వానికి పంపుతామని ఆయన చెప్పారు. వీరితో పాటు ఎస్‌యూఓ అజ్మార వెంకటేశ్వరరావు, హెచ్‌ఈఓ రాజు , సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-16T06:17:12+05:30 IST