ఆయుర్వేద మాస్క్‌

ABN , First Publish Date - 2020-07-12T18:21:10+05:30 IST

కోవిడ్‌ అపాయానికి కోటి ఉపాయాలు.. తెలంగాణలోని నారాయణపేట ఆయుర్వేద మాస్కులు అలాంటివే.. ! సినిమాతారలు అడిగి మరీ తెప్పించుకుంటున్న....

ఆయుర్వేద మాస్క్‌

కోవిడ్‌ అపాయానికి కోటి ఉపాయాలు.. తెలంగాణలోని నారాయణపేట ఆయుర్వేద మాస్కులు అలాంటివే.. ! సినిమాతారలు అడిగి మరీ తెప్పించుకుంటున్న ఆ మాస్క్‌ల ప్రత్యేకత ఏంటి?


అక్కడెక్కడో చైనా నుంచి మాస్కుల్ని తెప్పించుకోవడం ఎందుకు? ఇక్కడే తెలంగాణలోని నారాయణపేట జిల్లా నుంచి తెప్పించుకుంటే? చేనేతకు చేయూత లభిస్తుంది. పల్లె మహిళలకు ఉపాధి లభిస్తుంది. వీళ్లు చేస్తున్న ఆయుర్వేద మాస్క్‌లతోపాటు.. పలు రకాల డిజైనర్‌ మాస్కులు భలే ఆకట్టుకుంటున్నాయి...


ముల్లును ముల్లుతోనే తీయాలి. నోటికాడ తిండిని లాక్కున్న కరోనా నుంచే తిరిగి రాబట్టుకోవాలి.. ఎలా? చేనేత కార్మికులు మూకుమ్మడిగా చేసిన ఒక ఆలోచన ఫలితాన్ని ఇచ్చింది. మహమ్మారి వల్ల లాక్‌డౌన్‌ పెట్టారు. చేనేత పనులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఉపాధి లేదు. ఇల్లు గడవడమే భారంగా మారింది. కరోనా సంక్షోభాన్నే ఒక అవకాశంగా మలుచుకుంటే? అనే ఆలోచన తట్టింది మహబూబ్‌నగర్‌ జిల్లాకు సమీపంలోని నారాయణపేట జిల్లా కలెక్టర్‌, చేనేత కార్మికులకు. ఇక అంతే. పని మొదలైంది. చకచకా కత్తెర్లు కత్తిరించాయి. టకటకా కట్టుమిషన్లు కదిలాయి. ఇళ్ల నిండా మాస్కులే మాస్కులు. నారాయణపేట చేనేత మాస్క్‌.. ప్రత్యేక మార్క్‌ సాధించింది. సెలబ్రిటీలు కూడా పార్శిల్స్‌ తెప్పించుకునేంత గ్లామర్‌ సంపాదించుకుంది. ‘‘లాక్‌డౌన్‌కు నెల రోజుల ముందు నుంచీ నేసిన వస్త్రాలు మా దగ్గర పేరుకుపోయాయి. వైరస్‌ బారిన పడకుండా.. సామాజిక దూరం పాటించక తప్పదు కాబట్టి.. అందరం ఒకేచోట కలిసి పనిచేసే పరిస్థితి లేదు. చేనేత పనులను ఆపేశాం. ఇలాంటి ఆపత్కాలంలో మాస్కుల ఆర్డర్లు వచ్చాయి. జిల్లా అధికారులు మా ఇళ్లకే వచ్చి, నేత వస్త్రం అందిస్తున్నారు. మేము మాస్కులు కుట్టి వాళ్లకు తిరిగి ఇస్తున్నాం. ఒక్కో మాస్కుకు ఐదు రూపాయలు చొప్పున చెల్లిస్తున్నారు వాళ్లు. రోజుకు రెండొందల మాస్కులు కుడితే, వెయ్యి రూపాయలు చేతికి వస్తోంది..’’ అంటున్నారు నారాయణపేట చేనేత కార్మికురాలు అంబిక. ఇలాంటి సమయంలో ఆ ఆదాయం గొప్ప ఊరట. ఒక అంచనా ప్రకారం తెలంగాణలో  నెలకు రూ.40 నుంచి 50 కోట్ల విలువైన చేనేత వస్త్రాలు ఉత్పత్తి అవుతాయి. కేవలం కరోనా వల్ల రాష్ట్రంలో సుమారు వంద కోట్ల రూపాయల విలువైన వస్త్రాలు నిల్వ ఉండిపోయాయి. వాటిలో కొద్దిపాటి వస్త్రాలను ఇలా మాస్కులుగా మారిస్తే.. అటు కార్మికులకు, ఇటు ప్రజలకు ప్రయోజనమే కదా!. ఆ పనిని నారాయణపేట జిల్లా కలెక్టరు, అధికారులు విజయవంతంగా చేశారు. ఇప్పుడు మూడువేల కుటుంబాలు మాస్కుల తయారీలో బిజీగా ఉన్నాయి. 


ఎన్ని చేశారు?

నారాయణపేట జిల్లాలోని మహిళలు ఇప్పటి వరకు సుమారు నాలుగు లక్షలకు పైగా మాస్కుల్ని తయారుచేశారు. గ్రామాలలోనే రెండు లక్షల మాస్కుల్ని నామమాత్రపు ధరకు విక్రయించి, తమ ఉదారతను చాటుకున్నారు. కరోనా మహమ్మారి నిర్మూలనకు చేనేత కార్మికుల కృషి ప్రశంసనీయం.


టబు, విజయ్‌లు కూడా..

నేతన్నల దగ్గర నుంచి నూలు వస్త్రాలను కొనుగోలు చేసి, వాటిని మహిళా సంఘాలకు ఇస్తున్నాం. చిన్నారులు, మహిళల కోసం వైవిధ్యంగా మాస్కుల్ని తయారుచేస్తున్నారు. వీటిలో స్కార్ఫ్‌ మాస్క్‌లు, ట్రాన్స్‌పరెంట్‌ మాస్క్‌లు, ఇక్కత్‌ మాస్క్‌లు, గ్లౌజ్‌లు, శానిటైజర్‌లు వంటివన్నీ ఉన్నాయి. ప్రముఖ యువ కథానాయకుడు దేవరకొండ విజయ్‌, సీనియర్‌ నటి టబు, బెంగాలీ నటి చైతి గోశాల్‌ ఇక్కడి నుంచే మాస్కుల్ని కొనుగోలు చేశారు. దాంతో నారాయణపేట మాస్కులకు ఫ్యాషన్‌ ట్రెండ్‌ కూడా తోడైంది.

- కాళిందిని మర్రిపూడి, డీఆర్‌డీవో అధికారిణి




సంజీవధారతో.. 

కరోనాతో చేనేత కార్మికులు పని కోల్పోయారు. అదే సమయంలో మార్కెట్‌లో మాస్కుల కొరత ఏర్పడింది. ఇలాంటి సంక్షోభాన్ని పేద మహిళల ఉపాధికి అవకాశంగా మలుచుకోవాలి అనుకున్నాం. స్వయం సహాయ సంఘాలను రంగంలోకి దింపాం. డీఆర్డీవో కాళిందిని పురమాయించి మాస్కుల తయారీకి ఏర్పాటు చేశాం. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న మాస్కులకు భిన్నంగా చేయించడం మొదలుపెట్టాం. ఇవి చాలామందికి నచ్చాయి. వీటిలో ఆయుర్వేద మాస్క్‌ ప్రత్యేకమైనది. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యులు, నిపుణులతో సంజీవధార అనే ద్రావణాన్ని తయారుచేయించి.. ఇందులో మాస్కుల్ని నానబెట్టి ఆరబెడుతున్నాం. ఆ తరువాత పంపిణీ చేస్తున్నాం.

- హరిచందన, కలెక్టర్‌, నారాయణపేట జిల్లా




ఆయుర్వేద మాస్క్‌ ఎలా చేస్తారంటే..

పుదీనా, లవంగం, తులసి, కర్పూరం, వాములతో సంజీవధార మిశ్రమాన్ని తయారుచేస్తారు. అందులో మాస్కుల్ని ముంచి ఆరబెడతారు. వీటిని వారం రోజుల పాటు వాడుకోవచ్చు. తరువాత శుభ్రంగా ఉతికి, మళ్లీ సంజీవధారలో అద్ది మరోసారి ఉపయోగించవచ్చు. దీనివల్ల శ్వాస పీల్చుకున్నప్పుడు.. ఆయుర్వేద ఔషధగుణాలతో కూడిన సువాసన లోపలికి వెళుతుంది. 


హైదరాబాద్‌ను ఆదుకున్నారు..

లాక్‌డౌన్‌ పెట్టిన తొలినాళ్లలో మాస్కుల కొరత తీవ్రంగా ఉండేది. ఇలాంటి చేనేత బృందాలు రంగంలోకి దిగకపోతే చాలా ఇబ్బందులు వచ్చేవి. మహిళా సంఘాలుగా ఏర్పడి మాస్కుల్ని ఆర్డర్లు తీసుకుని వీళ్లు కుడుతున్నారు. నాణ్యమైన కాటన్‌, పోచంపల్లి, నారాయణపేట చేనేత వస్త్రాలతో వివిధ రకాల డిజైన్లతో మాస్కుల్ని చేస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌ నగరానికే ఇంచుమించు లక్షా యాభై వేల మాస్కుల్ని పంపిణీ చేసినట్లు మహిళలు పేర్కొన్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు, మెట్రోరైలు ఉద్యోగులు, సినీ రంగ ప్రముఖులు నారాయణపేట మాస్కుల్ని తెప్పించుకున్నారు.


కథనం: శ్యాంమోహన్‌, 94405 95858

Updated Date - 2020-07-12T18:21:10+05:30 IST