అయేషా బాను ఆత్మహత్య కేసులో వెలుగులోకి విస్తుపోయే నిజాలు!

ABN , First Publish Date - 2021-03-07T23:32:30+05:30 IST

రెండు వారాల క్రితం సబర్మతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న అయేషా బాను మక్రానీ (23) కేసులో

అయేషా బాను ఆత్మహత్య కేసులో వెలుగులోకి విస్తుపోయే నిజాలు!

అహ్మదాబాద్: రెండు వారాల క్రితం సబర్మతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న అయేషా బాను మక్రానీ (23) కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా, ఆమె తరపు న్యాయవాది జాఫర్ పఠాన్ కోర్టుకు ఆమె రాసిన లేఖ సమర్పించారు. అయేషా అందులో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను పూసగుచ్చినట్టు రాసుకొచ్చింది. తనను ఓ గదిలో నాలుగు రోజులపాటు బంధించారని, అందులో ఉన్నన్ని రోజులు తనకు తిండి పెట్టలేదని పేర్కొంది. 


‘‘నా ప్రియమైన ఆరు (ఆరిఫ్). నా పేరును ఆసిఫ్‌తో ముడిపెట్టడంతో నా మనసు బద్దలైంది. అతడు నాకు మంచి స్నేహితుడు, సోదరుడు. నేను గర్భవతిగా ఉన్నప్పుడు నన్ను చూసేందుకు నీవు రాలేదు’’ అని అందులో రాసింది. ఆరిఫ్‌ను తాను ప్రేమించానని, కానీ అతడు రెండు జీవితాలను నాశనం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లయిన రెండు నెలల నుంచే అయేషాకు కష్టాలు మొదలయ్యాయని పఠాన్ కోర్టుకు తెలిపారు. ఆమె ఎదుటే ఆరిఫ్ మరో యువతితో మాట్లాడేవాడని పేర్కొన్నారు.


తన జీవితంలో మరో మహిళ ఉందని, ఆయేషా కోసం ఆమెను వదులుకోబోనని ఆరిఫ్ తెగేసి చెప్పాడని, దీంతో అయేషా మనసు ముక్కలైందని అన్నారు. అయితే, తల్లిదండ్రుల గురించి ఆలోచించి మౌనంగా ఉండిపోయిందన్నారు. రాజస్థాన్‌లోని పాలిలో ఆరిఫ్‌ఖాన్‌ను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయేషా ఆత్మహత్య తర్వాత ఆరిఫ్ పరారయ్యాడు. 


నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అయేషా తన భర్త, తల్లిదండ్రులతో మాట్లాడింది. చనిపోవాలంటే ఆ పని నిరభ్యంతరంగా చేయొచ్చని, కాకపోతే ఆ వీడియో తనకు పంపాలని తన కుమార్తెతో ఆరిఫ్ చెప్పాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయేషా తండ్రి ఆరోపించారు. 2018లో అయేషాకు వివాహం జరిగింది. అయితే, ఇటీవల అహ్మదాబాద్‌లోని వాట్వాలో ఉండే తన తల్లిదండ్రుల చెంతకు చేరుకుంది. రెండు వారాల క్రితం సబర్మతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

Updated Date - 2021-03-07T23:32:30+05:30 IST