సీజేఐకి అయేషా మీరా తల్లి లేఖ

ABN , First Publish Date - 2021-12-28T00:20:59+05:30 IST

అయేషా మీరా హత్య కేసులో దేశ అత్యున్నత నేర పరిశోధన సంస్థ సీబీఐ కూడా న్యాయం చేయలేదని ఆమె తల్లి శంషాద్‌ బేగం ఆవేదన వ్యక్తం చేశారు.

సీజేఐకి అయేషా మీరా తల్లి లేఖ

తెనాలి: అయేషా మీరా హత్య కేసులో దేశ అత్యున్నత నేర పరిశోధన సంస్థ సీబీఐ కూడా న్యాయం చేయలేదని ఆమె తల్లి శంషాద్‌ బేగం ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గుంటూరు జిల్లా తెనాలిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ అయేషా మీరా హత్యకేసులో సిట్‌ వైఫల్యం చెందడంతో సీబీఐకి అప్పగించాలని కోర్టును ఆశ్రయించామన్నారు. కానీ సీబీఐ కేసు తీసుకుని రెండేళ్లు అవుతున్నా ఎలాంటి పురోగతి కనిపించలేదని తెలిపారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణను కలిసే ప్రయత్నం చేసినా వీలు కాలేదని చెప్పారు. దీంతో మీరైన జోక్యం చేసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ లేఖను సీజేఐ మెయిల్‌కు పంపానని తెలిపారు. సీబీఐ అధికారులు నార్కో ఎనాలసిస్‌ కోసం అయేషా సమాధి నుంచి అవయవ భాగాలు తీసుకు వెళ్లారని, మళ్లీ తీసుకు వచ్చి ఖననం చేస్తామని చెప్పి చేయకపోవడం మనస్థాపం కలిగిస్తుందని వాపోయారు. తొలుత సమాధిని తెరవడానికి తాము, మత పెద్దలు ఒప్పుకోకపోవడంతో హైకోర్టుకు కూడా వెళ్లి ఆర్డర్‌ తెచ్చి మత పెద్దలను ఒప్పించి అవయవ భాగాలు సేకరించి ఏం సాధించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసును సమగ్రంగా విచారించి తగిన న్యాయం చేసేలా సీజేఐ చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నట్లు శంషాద్‌ బేగం చెప్పారు. 

Updated Date - 2021-12-28T00:20:59+05:30 IST