ఆయకట్టు రైతుల శ్రమదానం

ABN , First Publish Date - 2022-08-19T06:40:47+05:30 IST

సాగు నీటి కాలువ టన్నెల్‌లో మూడేళ్లుగా పూడుకుపోయిన మట్టి, తుప్పలను రైతులు శ్రమదానంతో తొలగించి ఆయకట్టుకు నీరు అందేలా శ్రమించారు.

ఆయకట్టు రైతుల శ్రమదానం
టన్నెల్‌లో పూడిక తొలగించిన రైతులు


వంద అడుగుల టన్నెల్‌లో పూడిక తొలగింపు

దమ్ములకు కామునిగెడ్డ రిజర్వాయర్‌ నీరు

రావికమతం, ఆగస్టు 18: సాగు నీటి కాలువ టన్నెల్‌లో మూడేళ్లుగా పూడుకుపోయిన మట్టి, తుప్పలను రైతులు శ్రమదానంతో తొలగించి ఆయకట్టుకు నీరు అందేలా శ్రమించారు. సుమారు వంద అడుగుల టన్నెల్‌లో రైతులు సాహసం చేసిన రెండు గ్రామాల రైతులను అందరూ అభినందించారు. వివరాల్లోకి వెళితే.. మండలంలో ధర్మవరం పంచాయతీ పరిధిలో ఉన్న కామునిగెడ్డ మినీ రిజర్వాయర్‌ ఉంది. దీని ద్వారా ఏటా రెండు మండలాల ఆయకట్టుకు సాగు నీరు అందుతుంది.  రిజర్వాయర్‌ గేట్లు మరమ్మతులకు చేరాయి. అలాగే మదుంలు, కాలువలు పూడికపోయాయి. తుప్పలు బలిశాయి. అలాగే వంద అడుగుల పొడవు ఉన్న టన్నెల్‌ పూడికతో మూసుకు పోయింది. మూడేళ్లుగా ఇరిగేషన్‌ అధికారులు ఆలనా పాలనా చూడకపోడంతో ఆయకట్టుకు మూడేళ్లుగా నీరు అందడం లేదు. ఈ సమస్యను ఆయకట్టు రైతులు పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా ఫలితం లేకపోయింది. దీంతో ధర్మవరం, చినధర్మవరం గ్రామస్థులు గత్తెం అప్పారావు, చినబాబు, ఈదుల రమణ, చిరంజీవి, అర్జున, విశారపు జోగినాయుడు , సింగం అమ్మన్న, అనపర్తి అప్పారావు, గోరా జోగిరాజు తదితర రైతులు గురువారం సాహసం చేసి టన్నెల్‌లోని పూడిక,తుప్పలు తొలగించి    ఆయకట్టు భూములకు నీరు పారేలా శ్రమించారు. ఇకనైనా అధికారులు స్పందించి కాలువలు, తూములకు మరమ్మతులు పూర్తి స్థాయిలో చేసి రిజర్వాయర్‌ నీరు ఆయకట్టు భూములకు సక్రమంగా పారేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2022-08-19T06:40:47+05:30 IST