Abn logo
Mar 5 2021 @ 03:57AM

మళ్లీ తిప్పేశారు..

  • అక్షర్‌కు నాలుగు.. అశ్విన్‌కు మూడు వికెట్లు
  • ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 205 ఆలౌట్‌
  • బెన్‌ స్టోక్స్‌ అర్ధసెంచరీ
  • భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌ 24/1

గులాబీ టెస్టు మాదిరి మరీ టర్నింగ్‌ వికెట్‌ ఏమీ కాదు.. బ్యాట్స్‌మెన్‌ ఓపిగ్గా క్రీజులో నిలిస్తే భారీ స్కోర్లు సాధించే అవకాశమూ కనిపించింది. అయినా టాస్‌ గెలిచీ.. అదనపు బ్యాట్స్‌మన్‌తో బరిలోకి దిగినా ఇంగ్లండ్‌కు ఫలితం లేకపోయింది. స్పిన్‌ ద్వయం అక్షర్‌-అశ్విన్‌ ఏకంగా ఏడు వికెట్లతో దెబ్బతీయగా, సిరాజ్‌ సైతం ఆకట్టుకున్నాడు. అయితే బెన్‌ స్టోక్స్‌ అర్ధసెంచరీతో తొలి టెస్టు తర్వాత పర్యాటక జట్టు 200 స్కోరు దాటగలిగింది. ఆనక పేసర్‌ అండర్సన్‌ వేసిన ఐదు ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా బెంబేలెత్తించడంతో భారత్‌ ఓపికను కనబరుస్తోంది.
అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌తో చివరిదైన నాలుగో టెస్టులో భారత జట్టు తొలి రోజే ఆధిపత్యం చూపింది. బౌలర్ల విజృంభణ కారణంగా గురువారమే రూట్‌ సేన బ్యాట్లెత్తేసింది. స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌ (4/68), అశ్విన్‌ (3/47) మరోసారి ఆ జట్టును వణికించారు. పాత బంతితో పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ (2/45) కూడా ప్రభావం చూపడంతో ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 75.5 ఓవర్లలో 205 పరుగులకు కుప్పకూలింది. ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ (55) అర్ధసెంచరీ సాధించగా లారెన్స్‌ (46) ఫర్వాలేదనిపించాడు. మిడిలార్డర్‌లో కాస్త పోరాటం కనిపించినా ఆరుగురు బ్యాట్స్‌మెన్‌ రెండంకెల స్కోరు కూడా సాధించలేకపోయారు. ఆ తర్వాత భారత జట్టును పేసర్‌ అండర్సన్‌ (5-5-0-1) ఇబ్బందిపెట్టాడు. తొలి ఓవర్‌లోనే గిల్‌ను డకౌట్‌ చేసిన అతడి మొత్తం 30 బంతుల్లో  పుజార (15 బ్యాటింగ్‌), రోహిత్‌ (8 బ్యాటింగ్‌) పరుగు తీసేందుకు కూడా జంకాల్సి వచ్చింది. దీంతో ఆటముగిసే సరికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 12 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 24 పరుగులు చేసింది. భారత్‌ ఇంకా 181 పరుగుల వెనుకంజలో ఉంది. అయితే గతటెస్టులో ఏకైక స్పిన్నర్‌తో బరిలోకి దిగి దెబ్బతిన్న ఇంగ్లండ్‌.. ఈసారి ఒకే స్పెషలిస్ట్‌ పేసర్‌తో ఆడడం కూడా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.


ఆదిలోనే అక్షర్‌ హవా: తొలి రోజు పిచ్‌పై కాస్త టర్న్‌తో పాటు బౌన్స్‌ ఉన్నప్పటికీ బ్యాటింగ్‌కు కూడా అనువుగానే కనిపించింది. కానీ తొలి గంట ఆట చూస్తే వారింకా మూడో టెస్టు ప్రభావం నుంచి బయటపడలేదేమో అనిపించింది. ఆరో ఓవర్‌లోనే స్పిన్నర్‌ అక్షర్‌ తన ఆర్మ్‌ బంతితో ఓపెనర్‌ డామ్‌ సిబ్లే (2)ను బౌల్డ్‌ చేశాడు. ఇక అక్షర్‌ బౌలింగ్‌లో ఎదురుదాడికి దిగడమే కరెక్ట్‌ అనుకున్న క్రాలే (8) మిడా్‌ఫలో సిరాజ్‌కు తేలికైన క్యాచ్‌ ఇచ్చాడు. కెప్టెన్‌ రూట్‌ (5)ను సిరాజ్‌ అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ దశలో బెయిర్‌స్టో, స్టోక్స్‌ ఆదుకునే ప్రయత్నం చేస్తూ లంచ్‌ బ్రేక్‌కు వెళ్లారు.


స్టోక్స్‌ పోరాటం: రెండో సెషన్‌లో స్టోక్స్‌ క్రీజులో నిలిచే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతను బెయిర్‌స్టోతో కలిసి నాలుగో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. బెయిర్‌స్టోను ఎల్బీగా అవుట్‌ చేసిన సిరాజ్‌ ఈ జోడీని విడదీశాడు. అటు స్టోక్స్‌ మాత్రం అత్మవిశ్వాసంతో క  నిపించాడు. 114 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న బెన్‌ భారీ స్కోరు సాధిస్తాడనిపించింది. అతడికి ఒల్లీ పోప్‌ (29) చక్కగా సహకరించాడు. కానీ ఐదో వికెట్‌కు 43 పరుగులు జతచేశాక ఇంగ్లండ్‌కు గట్టి షాక్‌ తగిలింది. కీలక ఇన్నింగ్స్‌ ఆడుతున్న స్టోక్స్‌ను స్పిన్నర్‌ సుందర్‌ ఎల్బీ చేయడంతో భారత్‌ సంబరాల్లో మునిగింది. 


టపటపా వికెట్లు: ఆఖరి సెషన్‌లో ఏడో నెంబర్‌ బ్యాట్స్‌మన్‌ లారెన్స్‌ నుంచి భారత బౌలర్లకు ప్రతిఘటన ఎదురైంది. అడపాదడపా ఫోర్లతో హాఫ్‌ సెంచరీకి చేరువయ్యాడు. పోప్‌తో కలిసి లారెన్స్‌ ఆరో వికెట్‌కు 45 పరుగులు జోడించాడు. అయితే అశ్విన్‌, అక్షర్‌ జోరుకు లోయరార్డర్‌ పతనమైంది. ముందుగా పోప్‌ను అశ్విన్‌ అవుట్‌ చేయగా, కాసేపటికే 71వ ఓవర్‌లో లారెన్స్‌, బెస్‌ (3)లను అక్షర్‌ పెవిలియన్‌కు చేర్చాడు. ఆఖర్లో లీచ్‌ (7)ను అశ్విన్‌ పడగొట్టడంతో ఇంగ్లండ్‌ చివరి ఐదు వికెట్లను 39రన్స్‌ తేడాతో కోల్పోయింది. 
సిరాజ్‌ కోసం కోహ్లీ గొడవ

తొలి రోజు ఆట ఆరంభంలోనే కెప్టెన్‌ కోహ్లీ, బెన్‌ స్టోక్స్‌ మధ్య మాటల యుద్ధంతో  ‘వేడి’ వాతావరణం కనిపించింది. 13వ ఓవర్‌లో స్టోక్స్‌కు షార్ట్‌ లెంగ్త్‌ బంతులను వేసిన సిరాజ్‌ అతడి వైపే తదేకంగా చూశాడు. దీంతో స్టోక్స్‌ తన నోటికి పనిచెప్పాడు. అయితే ఆ ఓవర్‌ ముగిసిన వెంటనే స్టోక్స్‌ వద్దకు వెళ్లిన విరాట్‌ అతడితో వాదనకు దిగడం కనిపించింది. దీంతో అంపైర్లు మధ్యలో జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆ తర్వాత దూరం నుంచైనా ఇద్దరూ మాటల దాడిని కొనసాగించారు. ఇక తన మరుసటి ఓవర్‌లోనే స్టోక్స్‌ మూడు ఫోర్లు బాదగా సిరాజ్‌ కూడా స్లెడ్జింగ్‌కు దిగాడు. మరోవైపు స్టోక్స్‌ తనను తిట్టాడని, అందుకే కోహ్లీ మధ్యలో కలుగజేసుకున్నాడని మ్యాచ్‌ తర్వాత సిరాజ్‌ తెలిపాడు.


‘ఇప్పుడెవరికో కోపం వస్తోంది’

కీపర్‌ రిషభ్‌ పంత్‌ వికెట్ల వెనకాల నుంచి తన నోటికి పనిచెప్పడం కొనసాగుతూనే ఉంది. ఎనిమిదో ఓవర్‌లో అతడు జాక్‌ క్రాలే ఏకాగ్రతను దెబ్బతీసి వికెట్‌ను చేజార్చుకునేలా చేశాడు. అక్షర్‌ వేసిన ఆ ఓవర్‌ తొలి బంతిని క్రాలే ఫోర్‌గా మలిచాడు. ఆ తర్వాత నా లుగో బంతికి ముందు ‘ఇప్పుడెవరికో కోపం వస్తోంది’ అంటూ రెండుసార్లు గట్టిగా అనడం మైక్‌లో రికార్డయింది. భారీ షాట్‌ ఆడతాడని హిందీలో అక్షర్‌కు చెప్పాడు. ఆ తర్వాతి బంతికి నిజంగానే క్రాలే షాట్‌ ఆడగా సిరాజ్‌ క్యాచ్‌ తీసుకున్నాడు.


స్కోరుబోర్డు

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: క్రాలే (సి) సిరాజ్‌ (బి) అక్షర్‌ 9; సిబ్లే (బి) అక్షర్‌ 2; బెయిర్‌స్టో (ఎల్బీ) సిరాజ్‌ 28; రూట్‌ (ఎల్బీ) సిరాజ్‌ 5; స్టోక్స్‌ (ఎల్బీ) సుందర్‌ 55; పోప్‌ (సి) గిల్‌ (బి) అశ్విన్‌ 29; లారెన్స్‌ (స్టంప్‌) పంత్‌ (బి) అక్షర్‌ 46; ఫోక్స్‌ (సి) రహానె (బి) అశ్విన్‌ 1; బెస్‌ (ఎల్బీ) అక్షర్‌ 3; లీచ్‌ (ఎల్బీ) అశ్విన్‌ 7; అండర్సన్‌ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 75.5 ఓవర్లలో 205 ఆలౌ ట్‌; వికెట్ల పతనం: 1-10, 2-15, 3-30, 4-78, 5-121, 6-166, 7-170, 8-188, 9-189, 10-205. బౌలింగ్‌: ఇషాంత్‌ 9-2-23-0; సిరాజ్‌ 14-2-45-2; అక్షర్‌ 26-7-68-4; అశ్విన్‌ 19.5-4-47-3; సుందర్‌ 7-1-14-1.


భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: గిల్‌ (ఎల్బీ) అండర్సన్‌ 0; రోహిత్‌ (బ్యాటింగ్‌) 8; పుజార (బ్యాటింగ్‌) 15; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: 12 ఓవర్లలో 24/1. వికెట్‌ పతనం: 1-0. బౌలింగ్‌: అండర్సన్‌ 5-5-0-1; స్టోక్స్‌ 2-1-4-0; లీచ్‌ 4-0-16-0; బెస్‌ 1-0-4-0.


Advertisement
Advertisement
Advertisement