అక్రమ వ్యాపారాలకు అడ్డాగా ఏవోబీ

ABN , First Publish Date - 2020-09-17T12:27:20+05:30 IST

ఆంధ్రా - ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతాలు అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారాయి. ఖైనీ, గుట్కా, గంజాయి రవాణాకు కేంద్రాలయ్యాయి. ఆంధ్రాలో నిషేధిత వ్యాపారాలు ఒడిశాలో అధికారికంగా సాగుతుండడంతో అక్కడి సరుకు ఇక్కడికి దొడ్డిదారిలో ది

అక్రమ వ్యాపారాలకు అడ్డాగా ఏవోబీ

 గతంలో సాలూరు సర్కిల్‌లో గంజాయి స్వాధీనం

తాజాగా కొమరాడలో భారీగా పట్టుబడిన గంజాయి 


(పార్వతీపురం):ఆంధ్రా - ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతాలు అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారాయి. ఖైనీ, గుట్కా, గంజాయి రవాణాకు కేంద్రాలయ్యాయి. ఆంధ్రాలో నిషేధిత వ్యాపారాలు ఒడిశాలో అధికారికంగా  సాగుతుండడంతో అక్కడి సరుకు ఇక్కడికి దొడ్డిదారిలో దిగుమతి అవుతోంది. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నా నేటికీ అనేక కిరాణా దుకాణాలు గుట్కా విక్రయ స్థలాలుగా ఉన్నాయి.


గంజాయి విషయానికొస్తే ఒడిశా నుంచి ఎస్‌.కోట, అరకు ప్రాంతాలకు  రవాణా ఎక్కువగా జరుగుతుండేది. పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టడంతో వారు రవాణా మార్గాలను మార్చారు. ఒడిశా రాష్ట్రం కొరాపుట్‌ జిల్లా సరిహద్దుల నుంచి సాలూరు మీదుగా గంజాయిని రవాణా చేయడం ప్రారంభించారు. సాలూరులోనూ భారీగా గంజాయిని పోలీసులు గతంలో గుర్తించారు. తాజాగా అరకు నుంచి పార్వతీపురం మీదుగా రాయగడకు వెళ్తున్న సుమారు రూ.1.20 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 


 ఆంధ్రప్రదేశ్‌లో నిషేధంలో ఉన్న ఖైనీ, గుట్కా వ్యాపారం ఒడిశాలో అధికారికంగా జరుగుతోంది. వీటిని ఒడిశా నుంచి ఆంధ్రాకు తీసుకువచ్చే మార్గాల్లో ఏఓబీని అక్రమ వ్యాపారులు అనుకూలంగా భావిస్తున్నారు. కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాలకు చెందిన కొంతమంది ఖైనీ, గుట్కా వ్యాపారులు భారీగా గుట్కాను జిల్లాకు తీసుకొచ్చి వివిధ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. పార్వతీపురం పట్టణానికి కూడా వ్యాపారాన్ని విస్తరించుకుని రెండు చేతులా కాసులు సంపాదిస్తున్నారు.

 

 మరోవైపు సారా వ్యాపారాన్ని అరికట్టేందుకు ఎక్సైజ్‌శాఖ అధికారులు శ్రమిస్తున్నా మైదాన, ఏజెన్సీ గ్రామాల్లో ఏరులై ప్రవహిస్తోంది. సారా విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఏవోబీ సరిహద్దుల నుంచి కూడా పెద్ద ఎత్తున జిల్లాలోకి దిగుమతి అవుతోంది. 


 జిల్లా నుంచి ఒడిశాకు బియ్యం అక్రమ రవాణా కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. స్థానికంగా కిలో రూ. 10కు కొనుగోలు చేసి ఒడిశాలో రూ.20కు విక్రయిస్తున్నారు. బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్న కొంతమంది ఒడిశాలో బియ్యం విక్రయించిన తరువాత అక్కడ నుంచి ఖైనీ, గుట్కాలను తెచ్చుకుని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు

Updated Date - 2020-09-17T12:27:20+05:30 IST