క్వారంటైన్‌ కేంద్రాల్లో బాధితుల బెంబేలు

ABN , First Publish Date - 2020-08-14T10:14:43+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా మొదట్లో కరోనా పాజిటివ్‌గా తేలిన కేసులన్నింటినీ గాంధీకి రెఫర్‌ చేసిన వైద్యులు తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో స్థానికంగానే క్వారంటైన్‌ చేస్తున్నారు

క్వారంటైన్‌ కేంద్రాల్లో బాధితుల బెంబేలు

పట్టించుకునే వారు లేరని ఆవేదన

తీవ్ర లక్షణాలున్నా ఆసుపత్రికి తరలించకుండా క్వారంటైన్‌ చేస్తున్నారని ఆక్షేపణ

అందుబాటులో లేని ఆక్సిజన్‌ సిలిండర్లు

జిల్లాలో 212కు చేరిన కరోనా కేసులు


(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

రాష్ట్రవ్యాప్తంగా మొదట్లో కరోనా పాజిటివ్‌గా తేలిన కేసులన్నింటినీ గాంధీకి రెఫర్‌ చేసిన వైద్యులు తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో స్థానికంగానే క్వారంటైన్‌ చేస్తున్నారు. దీంతో కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఆరు క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో వాంకిడి, ఆసిఫాబాద్‌, గోలేటి ఐసోలేషన్‌ కేంద్రాల్లో పాజిటివ్‌ బాధితులను క్వారంటైన్‌ చేస్తున్నారు. అలాగే కాగజ్‌నగర్‌లో రెండు, సిర్పూర్‌(టి)లో ఒకటి క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికి అక్కడ కేవలం బాధితుల కాంటాక్ట్‌లను మాత్రమే ఐసోలేషన్‌లో ఉంచుతున్నారు. అయితే ఈ కేంద్రాల్లో అపరిశుభ్ర వాతావరణం కారణంగా అక్కడ ఉండలేమంటూ పలువురు బాధితులు  బెంబేలెత్తి పోతున్నారు. వాంకిడి క్వారంటైన్‌ కేంద్రంలో పరిస్థితులపై మొట్టమొదటి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్వారంటైన్‌ కేంద్రంలోనే నిన్న మొన్నటి వరకు జిల్లాలో నమోదయిన పాజిటివ్‌ బాధితులందరినీ ఉంచుతూ వస్తున్నారు. 


వాంకిడి కేంద్రంలో అపరిశుభ్రంగా పరిసరాలు

వాంకిడి క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటు చేసిన నాటి నుంచి ఇప్పటి దాకా ఇక్కడ శానిటేషన్‌ ప్రక్రియ చేపట్టలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాంతో ఈ కేంద్రం ఏర్పాటు చేసిన గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహం పరిసరాలు కూడా దుర్గందం వెదజల్లుతున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఇటీవల క్వారంటైన్‌ కేంద్రం ఐసోలేషన్‌లో ఉన్న 75ఏళ్ల వ్యాపారిని హైదరాబాద్‌కు తరలిస్తుండగా మృత్యువాత పడడంతో బాధితుల్లో భయాందోళనలు మరింత పెరిగాయి. బాధితుల సంఖ్య అధికంగా ఉండడం అక్కడ మూత్రశాలలు, మరుగుదొడ్ల సంఖ్య తక్కువగా ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వీటినే వినియోగిస్తుండటంతో ప్రస్తుతం అవి మురికి కూపల్లా మారి దుర్వాసన వస్తోందని పలువురు బాధితులు పేర్కొంటున్నారు. అయితే మరుగుదొడ్లను వాడుకుం టున్న వారే శుభ్రం చేసుకోవాలని వైద్య సిబ్బంది చెబుతున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఇదే విషయాన్ని ఇటీవల ఒకరిద్దరు బాధితులు సోషల్‌ మీడియాలో ఇక్కడి స్థితిగతులపై పోస్టులు పెట్టడంతో వారికి ఎపిడమిక్‌ కంట్రోల్‌ యాక్ట్‌ కింద నోటీసులు ఇచ్చినట్లు మీడియాకు తమ గోడు వెల్లబోసుకున్నారు. తాజాగా మరో వృద్ధుడు పూర్తి స్థాయిలో కరోనా లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ మైల్డ్‌ సింప్టమెటిక్‌ కేసుగా వాంకిడి క్వారంటైన్‌కు తరలించడంపై బాధితుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సదరు వృద్ధుడికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో అక్కడి నుంచి ఆసిఫాబాద్‌ సామాజిక ఆసుపత్రికి తీసుకువచ్చి ఆక్సిజన్‌ అందించారు. అనంతరం హైదరాబాద్‌కు తరలించినట్లు బాధిత కుటుంబసభ్యులు చెబుతున్నారు. వరుసగా జరిగిన ఈ రెండు సంఘటనలతో క్వారంటైన్‌ కేంద్రాలలో ఉంటున్న బాధితులు భయాందోళనలకు గురయ్యారు. 


బాధితుల ఆందోళనతో సిబ్బంది ఏర్పాటు

జిల్లాలో అసింప్టమెటిక్‌, మైల్డ్‌ కేసుల ఐసోలేషన్‌ కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాలలో వ్యాధి తీవ్రత పెరిగి బాధితులు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎట్టకేలకు మూడు కేంద్రాలలో వైద్యులు, ఇతర సహాయక సిబ్బందిని నియమించారు. మార్చి 22వ తేదీ నుంచి నిన్న మొన్నటి వరకు ఈ క్వారంటైన్‌ కేంద్రాలను ఆరోగ్యశాఖ కార్యకర్తల నేతృత్వంలోనే నిర్వహించారు. డాక్టర్లకు బాధ్యతలు అప్పగించినప్పటికీ ఎవరూ అటు వెళ్లి చూసిన పరిస్థితి లేదని బాధితులు అంటున్నారు. ఇటీవల ఆసిఫాబాద్‌ పట్టణానికి చెందిన  75 ఏళ్ల వ్యాపారి మృత్యువాత పడడంతో వైద్య ఆరోగ్యశాఖ పరిస్థితిని గ్రహించి ప్రస్తుతం మూడు చోట్ల వైద్యులను ఏర్పాటు చేసింది.


అంతేకాదు బాధితులకు ఆహారం విషయంలోనూ ప్రత్యేక చర్యలను చేపట్టింది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల మేరకు జిల్లాల్లో కేవలం లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు కలిగిన పాజిటివ్‌ బాధితులను మాత్రమే క్వారంటైన్‌ చేయాలి. అంతేకాకుండా ఈ రెండు కేటగిరీలకు చెందిన బాధితులను ఇనిస్టిట్యూషనల్‌ కేంద్రాల్లో ఉంచాలన్నా నిబంధనల్లోనూ సడలింపులు ఇచ్చింది. అయితే జిల్లాలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఇళ్లలో క్వారంటైన్‌ చేయడం సురక్షితం కాదన్న ఉద్దేశ్యంతో క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంచుతున్నట్లు అధికార యంత్రాంగం చెబుతోంది. అయితే పూర్తి స్థాయిలో కరోనా లక్షణాలు కలిగి ఉన్న వృద్ధులను ఇక్కడ క్వారంటైన్‌ చేయడం ప్రమాదకరమని తెలిసి నప్పటికీ మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు ఎందుకు రెఫర్‌ చేయడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

 

జిల్లాలో వారం రోజుల వ్యవధిలో రెండు క్రానిక్‌ కేసులను సాధారణ క్వారంటైన్‌ చేయడం వల్ల ఒకరు మృత్యువాత పడడం, మరొకరు ప్రాణాపాయ స్థితిలో గాంధీలో చికిత్స పొందుతుండడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. క్వారంటైన్‌ కేంద్రాలలో వైద్యులను ఏర్పాటు చేసిన అధికారులు ఆక్సిజన్‌ సిలిండర్లను అందుబాటులో ఉంచడం లేదని  పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  అయితే జిల్లా వైద్యాధికారి వాదన మాత్రం మరోలా ఉంది. క్వారంటైన్‌ కేంద్రాలలో సీరియస్‌ కేసులు ఉంటే వారికి ఆసిఫాబాద్‌లో ఆక్సిజన్‌ అందించే చర్యలు చేపట్టామన్నారు. క్వారంటైన్‌ కేంద్రాలలో సిలిండర్లు ఉంచాలన్నా ఆదేశాలు లేవని చెప్పడం గమనార్హం. 


క్వారంటైన్‌ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నాం..కుమరం బాలు, జిల్లా వైద్యాదికారి

జిల్లాలో ఉన్న ఆరు క్వారంటైన్‌ కేంద్రాలలో ఉన్న బాధితుల ఆరోగ్య స్థితిగతులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతున్నాం. పాజిటివ్‌ బాధితులు ఉన్న చోట డాక్టర్లు, సహాయక సిబ్బందిని కూడా ఏర్పాటు చేశాం. పరిస్థితులను బట్టి బాధితులకు చికిత్స అందజేస్తున్నాం. సౌకర్యాలు లేవని చెప్పడం అవాస్తవం. 

Updated Date - 2020-08-14T10:14:43+05:30 IST