ఓపెన్‌ వర్సిటీతో మహిళలకు ఉన్నత విద్య

ABN , First Publish Date - 2021-03-08T05:20:01+05:30 IST

అర్ధంతరంగా చదువు మానేసిన మహిళలు ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఉందని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎల్‌ విజయకృష్ణారెడ్డి అన్నారు.

ఓపెన్‌ వర్సిటీతో మహిళలకు ఉన్నత విద్య
అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతున్న విజయకృష్ణారెడ్డి

వీఎస్‌యూ రిజిస్ట్రార్‌ విజయకృష్ణారెడ్డి 

నెల్లూరు(హరనాథపురం), మార్చి 7 : అర్ధంతరంగా చదువు మానేసిన మహిళలు ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఉందని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎల్‌ విజయకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం నెల్లూరులోని శ్రీసర్వోదయ కళాశాలలోని ఓపెన్‌ వర్సిటీ రీజనల్‌ స్టడీ సెంటర్‌లో మహిళా విద్యార్థులకు ఉన్నత చదువులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చాలా మంది కొన్ని కారణాల వల్ల మధ్యలోనే చదువు మనేస్తుంటారన్నారు. అలాంటి వారి కోసం ఓపెన్‌ యూనివర్సిటీ అనేక ఉన్నతమైన కోర్సులను ప్రవేశ పెట్టిందన్నారు. యూజీ, పీజీ, డిప్లమో, బీఈడీ వంటి కోర్సులు ఓపెన్‌ యూనివర్సిటీలో ఉన్నాయన్నారు. ఏలాంటి విద్యార్హత లేకపోయినా 18 సంవత్సరాలు నిండిన వారు ప్రవేశ పరీక్ష రాసి ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీలో చేరి చదువుకోవచ్చన్నారు. అధ్యయన తరగతులు ప్రతివారం ఉంటాయని, వివిధ సబ్జెక్టులలో నిష్ణాతులైన అధ్యాపకులు స్టడీ సెంటర్లలో ఉన్నారన్నారు. ప్రతి మహిళ చదువుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓపెన్‌ వర్సిటీ స్టడీ సెంటర్‌ రీజనల్‌ కోఆర్డినేటర్‌ రమణారెడ్డి, అధికారి రత్నయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-08T05:20:01+05:30 IST