ప్రోస్టేట్‌ క్యాన్సర్‌పై అవగాహన

ABN , First Publish Date - 2022-06-21T08:47:18+05:30 IST

అన్ని వయసుల పురుషులకూ ఈ సమస్య వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, మరీ ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన పురుషులు ఈ వ్యాధి పట్ల అవగాహనతో మెలగుతూ, ముందస్తు క్యాన్సర్‌ సూచనలను కనిపెడుతూ ఉండాలి.

ప్రోస్టేట్‌ క్యాన్సర్‌పై అవగాహన

ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ను ఎంత ముందుగా గుర్తిస్తే, క్యాన్సర్‌ మీద విజయం సాధించే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ క్యాన్సర్‌ కారణంగా శరీరంలో చోటు చేసుకునే మార్పులను గమనిస్తూ ఉండాలి. 


న్ని వయసుల పురుషులకూ ఈ సమస్య వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, మరీ ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన పురుషులు ఈ వ్యాధి పట్ల అవగాహనతో మెలగుతూ, ముందస్తు క్యాన్సర్‌ సూచనలను కనిపెడుతూ ఉండాలి. సెమైనల్‌ ఫ్లూయిడ్‌ తయారయ్యే ఈ ప్రోస్టేట్‌ గ్రంథిలో పెరిగే వయసుతో పాటు అసాధారణ కణాలూ పెరిగిపోతాయి. ఫలితంగా ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ వృద్ధి చెందుతుంది. ఈ వ్యాధి ప్రారంభంలో ఎలాంటి లక్షణాలూ ఉండవు. ప్రోస్టేట్‌ గ్రంథి పెరుగుదల కారణంగా మూత్రనాళం మీద ఒత్తిడి ఏర్పడి, మూత్రవిసర్జన లక్షణాలు మొదలవవచ్చు. క్యాన్సర్‌ కాని ప్రోస్టేట్‌ సమస్యల్లో కూడా ఈ లక్షణం కనిపిస్తుంది. కొన్ని ప్రోస్టేట్‌ క్యాన్సర్లలో కణాలు అపరిమిత వేగంతో పెరిగి, శరీరంలోని ఇతర అవయవాలకు కూడా వ్యాపిస్తాయి. సాధారణంగా జనరల్‌ చెకప్‌లోనే ఈ క్యాన్సర్‌ను వైద్యులు కనిపెడుతూ ఉంటారు. 


తరచూ మూత్రవిసర్జన చేయవలసివస్తూ ఉండడం, మూత్రవిసర్జనలో ఆటంకం ఏర్పడడం, మూత్రవిసర్జన సమయంలో నొప్పి, మంట వేధిస్తూ ఉండడం, నొప్పితో కూడిన స్కలనం, మూత్రం, వీర్యంలో రక్తం కనిపించడం, నిరంతరంగా నొప్పి వేధిస్తూ ఉండడం ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ లక్షణాలు. ఈ లక్షణాలు కనిపిస్తే, ఆలస్యం చేయకుండా వైద్యులను కలిసి, చికిత్స తీసుకోవాలి. ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ను ప్రారంభంలోనే గుర్తించడం కోసం, డీఆర్‌ఈ, ప్రోస్టేట్‌ నిర్దిష్ఠ యాంటీజెన్‌ రక్తపరీక్షలు చేయించాలి. అలాగే క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో మెలగడమూ అవసరమే! క్యాన్సర్‌ను నిర్ధారించిన తర్వాత, ప్రోస్టేట్‌ రేడియేషన్‌ థెరపీతో పాటు, క్రమం తప్పకుండా పరీక్షలు చేయిస్తూ, క్యాన్సర్‌ పెరిగినా, లక్షణాలు పెరిగినా వెంటనే సర్జరీ చేయడం జరుగుతుంది. 


ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ నివారణ కోసం పురుషులు ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడంతో పాటు, ధూమపానం మానేయాలి. అలాగే సమతుల్య ఆహారం తీసుకుంటూ, క్రమం తప్పక వ్యాయామం చేస్తూ ఉండాలి. ఆహార, జీవనశైలి నియమాలతో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ నుంచి రక్షణ పొందడంతో పాటు, వచ్చిన క్యాన్సర్‌ను కూడా అదుపులో ఉంచుకోవచ్చు. ఇలాంటి ఖచ్చితమైన నియమాలు పాటించడం ద్వారా ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ సోకిన పురుషులు తమ ఆయుష్షును పెంచుకోవచ్చు. మెరుగైన జీవితాన్ని కూడా గడపవచ్చు. 

Updated Date - 2022-06-21T08:47:18+05:30 IST